Home జగిత్యాల కడ్డీలు ఎరగా వేసి బంగారం కాజేసే ముఠా అరెస్ట్

కడ్డీలు ఎరగా వేసి బంగారం కాజేసే ముఠా అరెస్ట్

Gold

మనతెలంగాణ/జగిత్యాల : మెడలో విలువైన బంగారు ఆభరణాలు ధరించి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ వారి ముందు నకిలీ బంగారు కడ్డీలను పడేని వారి మెడలోని బంగారాన్ని కాజేసే ముఠాను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్‌పల్లి డిఎస్‌పి నల్ల మల్లారెడ్డి దొంగల ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల కొత్త బస్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న 5 గురిని అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు వారిని విచారించగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో నకిలీ బంగారు కడ్డీలు ఎరగా వేసి బంగారాన్ని కాజేస్తున్నట్లు ఒప్పుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన బత్తుల లక్ష్మి, దారంగుల భూలక్ష్మి, కొమిరె రేణుక, కొమిరె అంజలి, దారంగుల శ్రీనివాస్‌లు ఒక ముఠాగా ఏర్పడి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తారు. ఈ నలుగురిలో ఒకరు మహిళను వెంబడిస్తూ ఆమె ముందు నకిలీ బంగారు కడ్డీని పడేస్తారు. అమాయక మహిళలు బంగారు కడ్డీని తీసుకోగానే ఆ కడ్డీని మేం చూసాం… మాకు కూడా వాటా ఇవ్వాలని మరో ఇద్దరు పట్టుబడతారు.

ఇంతలో శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి ఇది బంగారు కడ్డేనని, ఇన్ని తులాలు ఉంటుందంటూ చెప్పి గుట్టు చప్పుడు కాకుండా పంచుకోండి… పోలీసులకు తెలిస్తే పట్టుకుపోతారని భయపెడతాడు.స్వర్ణకారుడి దగ్గరకు వెళ్తే విషయం బయటపడుతుందని, కడ్డీని ఉంచేసుకుని మెడలోని బంగారు గొలుసు ఇవ్వమని ఉచిత సలహా ఇస్తాడు. దాంతో నకిలీ బంగారు కడ్డి దొరికిన మహిళ తన మెడలోని బంగారు గొలుసు ఇవ్వడం… ఆ తర్వాత కడ్డీని పరీక్షిస్తే అది నకిలీదిగా తేలడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనలను జిల్లా ఎస్‌పి సింధూశర్మ సీరియస్‌గా తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శివకృష్ణ, సిబ్బంది శ్రీనివాస్, తిరుపతిలు చాకచక్యంగా వ్యవహరించి నలుగురు దొంగలను పట్టుకోగా వారి వద్ద 11 తులాల బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు డిఎస్‌పి వివరించారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ, సిబ్బందికి రివార్డులు ప్రకటించి, అభినందించారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ ప్రకాశ్, ఎస్‌ఐ అల్తాఫ్ ఖాన్‌లు పాల్గొన్నారు.

Jagtial police Arrested gold theft thieves gang