Home రాష్ట్ర వార్తలు రూ.50 కోట్లతో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి

రూ.50 కోట్లతో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి

kcr

మొక్కులు చెల్లించుకున్న తరువాత సిఎం ప్రకటన 

మన తెలంగాణ/ రంగారెడ్డి : చారిత్రక జహంగీర్ పీర్ దర్గాను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌పీర్ దర్గాను సిఎం సందర్శించారు. పూల ఛాదర్‌ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జహంగీర్‌పీర్ దర్గా అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. వంద ఎకరాల్లో యాత్రికుల కోసం విశ్రాంతి గదు ల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో దర్గాను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. సంవత్సర కాలంలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జహంగీర్‌బాబా ఆశీర్వాదంతో మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూ తెలంగాణ సాధించుకున్నట్లు సీఎం గుర్తు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని 92 గ్రామాలు, 86 అనుబంధ గ్రామాలు, 127 తండాల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి రూ.10 లక్షలు, అనుబంధ గ్రామాలకు రూ.5 లక్షలు, తండాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి నిధులకు సంబంధించిన మంజూరు పత్రాలు అందుతాయని తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ది కి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో చర్చించి ప్రణాళికలు రూపొ ందిస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లాలో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. 20 లక్షల ఎకరాలలో పంటల సాగు జరగనుందని , పాలమూరును పచ్చబడాలన్నదే తమ ప్రతిజ్ఞ అని తెలిపారు. రూ.35 వేల కోట్ల అంచనాతో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేశామన్నారు. జడ్చర్ల ముద్దాండపూర్ ప్రాజెక్టు ద్వారా కొం దుర్కు మండలంలోని 670 అడుగల ఎత్తులో ఉన్న లక్ష్మీదేవిపల్లికి మంచినీళ్లు అందజేస్తామన్నారు. షాద్‌నగర్ నుంచి ఇబ్రంహీంపట్నం, మహేశ్వరం నియోజవర్గాల వరకు మంచినీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ, మంత్రులు నాయిని నర్సింహ్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, వినోద్, ఎమ్మెల్యేలు అం య్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనలో అపశృతి : ముఖ్యమంత్రి దర్గా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వాహనం భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రవి కిరణ్‌కు తీవ్ర గాయాలైనాయి. వెంటనే అతణ్ణి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.