Home సినిమా టాలీవుడ్ గొప్పగా చెప్పుకునే నటుడు తారక్

టాలీవుడ్ గొప్పగా చెప్పుకునే నటుడు తారక్

Jai-Lava-Kusaఎన్‌టిఆర్ హీరోగా నివేదా థామస్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నందమూరి తారకరామారావు ఆర్ట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘జై లవ కుశ’. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హరికృష్ణ మాట్లాడుతూ ‘అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణానికి ఆద్యుడు స్వర్గీయ జానకిరామ్ బాబు. తాతగారి పేరున్న బ్యానర్‌లో తాతగారి పేరు పెట్టుకున్న తమ్ముడితో సినిమా చేయాలి కదా అని అతను అన్నాడు. అలా ఈ సినిమాకు బీజం పడింది. దానికి అనుగుణంగా ఇద్దరు అన్నదమ్ములు నడుస్తున్నారు’ చెప్పారు. ఎన్‌టిఆర్ మాట్లాడుతూ ‘మరో జన్మంటూ ఉంటే నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా. ఈ జన్మకు మాత్రం అభిమానులతో ఉంటా. అభిమానుల ప్రేమానురాగాలు ఎన్నో జన్మల సుకృతం. అభిమానులు చల్లగా చూశారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. మా బ్యానర్‌లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలో నిజంగా నాకు అర్థం కాలేదు. కానీ అభిమానులు ఈ సినిమా చూసి ‘ఏం తీశార్రా అన్నాదమ్ములు’ అని అనుకోవాలి. బాబీ ఈ కథ చెప్పగానే తన చెయ్యిపట్టుకున్నా. ముందు భయం వేసింది. ఈ సినిమా చేయగలుగుతానా? అని. కానీ మా డ్రీమ్‌కి కావాల్సినటువంటి ఆయుధాలు మొత్తం ఈ కథలో ఉన్నాయి. ఈ సినిమా మా తల్లిదండ్రులకు, మా అన్నదమ్ములకు కూడా గర్వకారణంగా ఉంటుంది’ అని అన్నారు. కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘తమ్ముడితో సినిమా చేసినప్పుడు అందరి అంచనాలకు మించి సినిమా ఉండాలని అనుకున్నా. బాబీ చెప్పిన 10 నిమిషాల స్క్రిప్ట్ విని దానవీర శూరకర్ణ సినిమా గుర్తుకొచ్చింది. తారక్ తప్పించి ఎవరూ ఈ సినిమా చేయలేరు. బాబీ నాకు టైటిల్‌తో పాటు ఈ కథ చెప్పారు. ఈ సినిమా కథ విని తారక్ వారం రోజుల సమయం తీసుకున్నాడు. సినిమాలోని ఓ పాత్ర కోసం సిద్ధమవడానికి తను ఆ వారం సమయం తీసుకున్నాడని నాకు తర్వాత అర్థమైంది. సినిమాలో మేము ముందు రావణ పాత్రను చిత్రీకరించాం. సినిమాలో ఎన్‌టిఆర్ పూర్తిగా లీనమై చేశాడు. సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డాడు’ అని తెలిపారు. బాబీ మాట్లాడుతూ ‘టాలీవుడ్ గొప్పగా చెప్పుకునే నటుడు తారక్. ఈ సినిమాను డైరెక్ట్ చేసినందుకు నేను అదృష్టవంతుడిని. ఎన్‌టిఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. కళ్యాణ్‌రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా ఇది’ అని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘తారక్‌తో నేను వరుసగా చేస్తున్న మూడో సినిమా ఇది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలోని ఓ సీన్‌లో ఎన్‌టిఆర్ నటన చూసి అబ్బురపడి పోయాను. త్రిపాత్రాభినయం చేసి ఎన్‌టిఆర్ గొప్ప నటుడిగా తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. తారక్ నటనను ఎంజాయ్ చేస్తూ రీరికార్డింగ్ చేశాను. ఇంత మంచి స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చిన బాబీకి థాంక్స్. ఆయన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తనకు చాలా మంచి పేరు వస్తుంది’ తెలిపారు. రాశీఖన్నా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో తారక్ చూపించిన వేరియేషన్స్ చూసి నేను ఆయనకు అభిమానిని అయ్యాను. ఎన్‌టిఆర్ అద్భుతమైన నటుడు. ఆయన డ్యాన్సింగ్‌లో బెస్ట్. ఈ సినిమాకు పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ ‘తారక్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఆయనతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, వి.వి.వినాయక్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, కొరటాల శివ, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.