Home సినిమా రంజాన్ కానుకగా టీజర్

రంజాన్ కానుకగా టీజర్

JR-NTR

అభిమానులు అడగడానికంటే ముందే విందు వడ్డించేస్తున్నాడు ఎన్‌టిఆర్. ‘జై లవకుశ’ సినిమా ప్రారంభమై నెల రోజులు కాకముందే… అభిమానులు ఏ అంచనాలతో లేని సమయంలోనే శ్రీరామనవమికి టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఆనందం పంచాడు తారక్. ఆపై తన పుట్టిన రోజుకు ఒకటికి రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. త్వరలోనే అభిమానులకు మరో సర్ర్పైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ‘జై లవకుశ’ ఫస్ట్ టీజర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. రంజాన్ కానుకగా ఈనెల 21న టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలుగు సినిమాలకు సంబంధించి రంజాన్ కానుకగా టీజర్‌లాంటిది రిలీజ్ చేసే ఆనవాయితీలేం లేవు. అయితే ఈసారి ఈ పండుగకు తన టీజర్‌ను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెర తీయాలని ఎన్‌టిఆర్ అండ్ టీం భావిస్తున్నట్లు సమాచారం. రంజాన్ సమయానికి సినిమా విడుదలకు సరిగ్గా వంద రోజుల కౌంట్ డౌన్ ఉంటుంది. కాబట్టి టీజర్ విడుదలకు అది సరైన సమయమవుతుందని భావిస్తున్నారు. ఎన్‌టిఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ గత ఏడాది ఏ తేదీన రిలీజైందో.. ఈ ఏడాది అదే డేటుకు అంటే సెప్టెంబర్ 1న ‘జై లవకుశ’ను విడుదల చేయాలని భావిస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఎన్‌టిఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.