Home జాతీయ వార్తలు రెండోకాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని.. కన్నతల్లే కడతేర్చింది!

రెండోకాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని.. కన్నతల్లే కడతేర్చింది!

Neha-Goyalజైపూర్ : దేశ, విదేశాల్లో ఆడపిల్లలు ఎన్నో ఘన విజయాలు సాధిస్తున్న కొందరు మూర్ఖులు మాత్రం ఆడ పిల్లలు పుట్టడాన్ని సహించలేకపోతున్నారు. సాధారణంగా మగ సంతానం కావాలని భర్తకి ఎక్కువగా కోరిక ఉంటుంది… కానీ కడుపున పుట్టింది ఆడైన, మగైన కన్నతల్లికి మాత్రం పంచప్రాణాలుంటాయి. అయితే ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మచ్చ తెచ్చే పని చేసింది. రెండో కాన్పులోనూ ఆడ సంతానమే పుట్టిందని.. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని దారుణంగా చంపేసింది. కుమారుడు కావాలన్న ఆమె కోరిక 4 నెలల ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. నాలుగు నెలల పసికందును కన్న తల్లే గొంతు కోసి చంపిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన నేహా గోయల్(35) ఇద్దరు కుమార్తెలు. మొదటి కూతురుకు ఎనిమిది సంవత్సరాలు. రెండో కూతురికి నాలుగు నెలలు. అయితే ఆమె మగ బిడ్డ కోసం కలలు కన్నది. కానీ ఆడ బిడ్డ పుట్టేసరికి తీవ్ర ఆందోళనకు గురైంది.
ఆగస్టు 26న బిడ్డ తప్పిపోయిందని ఇంట్లో చెప్పింది. దీంతో పసికందు కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు రెండు గంటలపాటు వెతికారు. తల్లిపై అనుమానం రావడంతో పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా గాలించారు. ఇంట్లో ఉన్న ఉపయోగించని ఎయిర్ కండిషనర్‌లో బేబి మహిక మృతదేహం లభ్యమైంది. కత్తితో గొంతు కోసిన తల్లి.. 17 సార్లు చిన్నారి శరీరంపై పొడిచింది. కుమారుడి కోసం చాలా పూజలు చేశానని.. అయినా ఫలితం లేదని తల్లి తెలిపింది. పుత్రుడు పుట్టలేదన్న కోపంతోనే చిన్నారిని హత్య చేశానని ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.