Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రాజెక్టులకు జలగండం

Jala gandam to projects

భారీ ఉష్ణోగ్రతలతో తగ్గుతున్న నీటి మట్టం
ఎల్లంపల్లి ఇంటెక్ వెల్ వద్ద అడుగంటిన జలాలు
కనిష్ట స్థాయికి చేరువలో ప్రాజెక్టులు
మిషన్ భగీరథపై ప్రభావం చూపే అవకాశాలు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: గత నెల రోజులుగా బానుడి భగభగలతో ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుకుపోతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి అవసరాలు పెరగడంతో ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. గత నెల రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రాజెక్టులోని జలాలు అడుగంటి పోతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఇంటెక్ వెల్ వద్ద నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి.సాగు నీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్షంతో చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో సైతం ఉహించని విధంగా నీటి మట్టం తగ్గిపోయింది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు అడుగంటిపోయి నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల మిషన్ భగీరథ పథకానికి నీరు అందించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మంచిర్యాల, కొమురంభీం జిల్లాలోని ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలను పరిశీలించినట్లయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 20,175 టిఎంసిలు కాగా ప్రస్తుతం 2.9 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. అదే విధంగా కడెం ప్రాజెక్టు నీటి సామర్థం 7.60 టిఎంసిలు కాగా ప్రస్తుతం 2.98 టిఎంసిలు, కొమురంభీం ప్రాజెక్టు నీటి సామర్థం 10.993 టిఎంసిలు కాగా 5.516 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. నీల్వాయి ప్రాజెక్టు సామర్థం 0.846 టిఎంసిలు కాగా ప్రస్తుతం 0.412, గొర్లవాగు ప్రాజెక్టు సామర్థం 0.500 టిఎంసిలు కాగా ప్రస్తుతం 0.200 టిఎంసిల నీటి మట్టం మాత్రమే ఉంది. ఈ విధంగా 50 శాతం టిఎంసిల నీటి మట్టం తగ్గు ముఖం పట్టింది. మంచిర్యాల జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తయిన చోట తాగునీరు అందించేందుకు వీలుగా ప్రయోగాత్మకంగా పరిశీలన కూడా నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో గోదావరి నీటి పథకం కింద జిల్లాలోని పలు మండలాలకు ఇప్పటికే నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గు ముఖం పడుతుండగా కొత్త పథకాలకు నీరందించడం కష్టతరంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందగా గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 10.5 టిఎంసిల నీరు ఉండగా ప్రస్తుతం 2.9 టిఎంసిలకు పడిపోయింది. ప్రాజెక్టు నీటి సామర్థానికి అనుగుణంగా అధికారులు నీటిని వినియోగించాల్సి ఉండగా అధికారులు ఆనాలోచిత నిర్ణయాలు మంచినీటి సరఫరాకు ఆటంకాలను కలిగిస్తున్నాయి. మంత్రులు ప్రజా ప్రతినిధుల ఒత్తిడితోనే ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరగడం వలన ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ప్రభుత్వ తలపెట్టిన మిషన్ భగీరథ పథకానికి కూడా ఇదే ప్రాజెక్టు నుండి నీటిని అందించేందుకు శ్రీకారం చుట్టగా ఏమేరకు గ్రామాలకు తాగునీరు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Comments

comments