Home జాతీయ వార్తలు కశ్మీర్ అసెంబ్లీ రద్దు

కశ్మీర్ అసెంబ్లీ రద్దు

గవర్నర్ సత్యపాల్ అనూహ్య నిర్ణయం 

Jammu-Kashmir Assembly Dissolved by Governor

శ్రీనగర్ /న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు. కీలక రాజకీయ నాటక పరిణామాల నడుమ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అసెంబ్లీ సుప్త చేతనావస్థలో ఉంది. తమకు ప్రభుత్వ స్థాపనకు అవకాశం ఇవ్వాలని మాజీ సిఎం మెహబూబా సారథ్యంలోని పిడిపి, సజ్జాద్ లొనే నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు వేర్వేరుగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి. తమకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మద్దతు ఉందని పిడిపి తెలిపింది. అయితే తమకు బిజెపి మద్దతు ఉందని లొనే తెలిపారు. ఈ దశలో ఇరువురి అభ్యర్థనలను పక్కకు పెట్టిన గవర్నర్ బుధవారం సాయంత్రం అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 87 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా తాము కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లతో కలిపి మహాకూటమిగా అవతరిస్తున్నట్లు, తమ మొత్తం బలం 56కు పెరుగుతున్నట్లు మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు తెలిపారు. అయితే అసెంబ్లీనే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించడంతో కశ్మీర్‌లో రాజకీయ కలకలం చెలరేగింది.

బుధవారం మధ్యాహ్నమే పిడిపి అధినేత్రి మెహబూబా ముప్తీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఆమె వెంట నేషనల్ కాన్ఫరెన్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తుందని ముప్తీ చెప్పారు. అయితే కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అటువంటిదేమీ లేదని ఢిల్లీలో తెలిపారు. అంతకు ముందు జరిగిన పరిణామాలలో జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఒక్కటై మహాకూటమిగా అవతరించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ స్థాపపనకు మెహబూబా ముఫ్తీ నాయకత్వపు పిడిపి ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు కానుంది. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు భాగాస్వమ్య పక్షాలుగా ఉంటాయి. రాష్ట్రంలో మహాకూటమి ఏర్పాటు విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి , పిడిపి సీనియర్ నేత అల్తాఫ్ బుఖారీ నిజమేనని ధృవీకరించారు. రాష్ట్ర రాజకీయ వాతావరణం, చట్టబద్ధతలను పరిరక్షించేందుకు అనివార్య రీతిలో కాంగ్రెస్ , పిడిపిలతో కలిసి తమ పార్టీ జట్టు కడుతుందని, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తమ బలం చాటుకుంటుందని ఆయన తెలిపారు.

త్వరలోనే ఈ శుభవార్తను అధికారికంటా వింటారు అని బుధవారం విలేకరులతో చెప్పారు. ఈ కూటమికి పిడిపి సారథ్యం ఉంటుందని, మెహబూబా ముఫ్తీ లేదా ఆమె సూచించే వ్యక్తి సిఎం అవుతారని తెలిపారు. రాష్ట్రంలో ఇంతకు ముందు పిడిపి బిజెపి సంకీర్ణ ప్రభుత్వం సాగింది. అసెంబ్లీలో పిడిపికి 28, ఎన్‌సికి 15, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యులు ఉన్నారు. దీనితో అధికార స్థాపనకు అవసరం అయిన 44 స్థానాల బలం దాటుతుంది. పిడిపి, కాంగ్రెస్‌లతో జట్టుగా సాగాలని తాము భావిస్తున్నట్లు ఇటీవలే నేషనల్ కాన్ఫరెన్స్ నేత, శ్రీనగర్ ఎంపి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనివార్యంగా ఈ కలయిక తప్పదన్నారు. ఈ మేరకు ఇప్పుడు రాస్ట్రంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్న విషయం బుధవారం స్పష్టం అయింది.

తాము కోరుకున్నదీ ఇదే : అబ్దుల్లా

అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించగానే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. తాము కోరుతున్నదీ ఇదేనని , గత ఐదు నెలలుగా తాము అసెంబ్లీ రద్దు కోరుతున్నామని , ప్రస్తుతం గవర్నర్ ఈ విధంగా స్పందించడం తమకు మంచిదే అని వ్యాఖ్యానించారు. తాము తాజాగా ఎన్నికలు కోరుకుంటున్నామని తెలిపారు. గవర్నర్ పాలనలో ఇప్పటివరకూ కేంద్రంలో బిజెపి పరోక్ష పాలన సాగిందని ఇక ఎన్నికలతో ఈ పరిస్థితి మారుతుందని చెప్పారు. తాము ఒక పథకం ప్రకారం వ్యవహరించే ప్రభుత్వ స్థాపనకు ముందుకు వచ్చామని, బిజెపి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రకటించడంతో వారికి బలం లేదని తెలిసి గవర్నర్ అసెంబ్లీ రద్దు చర్య తీసుకున్నారని , ఇది తమ రాజకీయ ఎత్తుగడకు ఫలితం అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ నేతలు వెంటనే స్పందించలేదు.