Home అంతర్జాతీయ వార్తలు అల్లరి చేశాడని అరణ్యంలో వదిలేశారు..!

అల్లరి చేశాడని అరణ్యంలో వదిలేశారు..!

Boy-Lefted-in-Forestటోక్యో: పిల్లలు అల్లరి చేస్తే మనం మాములుగా బెదిరిస్తాం.. మరి ఎక్కువ చేస్తే రెండు దెబ్బలేస్తాం. అంతేకానీ తీసుకెళ్లి కారడవిలో అయితే వదిలేయం కదా. కానీ జపాన్‌కు చెందిన దంపతులు తమ ఏడేళ్ల కొడుకును బాగా అల్లరి చేస్తున్నాడని క్రూర మృగాలు సంచరించే అడవిలో వదిలేశారు. దీంతో ఆ బాలుడు ఏడు రోజులు నిద్రాహారాలు లేకుండా కారడవిలో గడిపాడు. అయితే బాలుడి కోసం రంగంలోకి దిగిన రెండు వందల మంది సాయుధులు ఎట్టకేలకు బాలుడిని ప్రాణాలతో కనిపెట్టగలిగారు. ఘటన వివరాల్లోకి వెళితే… జపాన్‌లోని హొక్కయిదో దీవికి చెందిన దంపతులకు ఏడేళ్ల యమతో తనూక అనే కొడుకు ఉన్నాడు. అందరి పిల్లలలాగే అల్లరి చేసేవాడు యమతో. కానీ ఈ మధ్యకాలంలో అతడి అల్లరి శృతిమించిపోయింది. రోడ్డుపై వెళ్లేవాళ్లపై, ఆగిఉన్న కార్లపై రాళ్లు విసిరేంతవరకు వెళ్లింది. దాంతో మొదట దంపతులు అతడిని అలా చేయడం తప్పు అని వారించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులకు చిర్రెత్తుకొచ్చింది. ఇలా చెబితే వినడని యమతోను తీసుకెళ్లి భయంకర వన్యమృగాలు తిరిగే కారడవిలో వదిలేశారు. బాలుడిని భయపెట్టాలని వదిలేసిన తల్లిదండ్రులు అతడు కనిపించకపోవడంతో భయపడ్డారు. మొదట అడవిలో పండ్ల కోసం వెళ్లగా తప్పిపోయాడని చెప్పిన దంపతులు… చివరికి తాము చేసిన తప్పు పనిని పోలీసులకు చెప్పి, ఎలాగైన కొడుకును కాపాడాలని వేడుకున్నారు. దీంతో రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. 200 మంది సైనికులు ఆరు రోజులపాటు గాలించి, ఓ పాడుబడిన బంగ్లాలో సురక్షితంగా ఉన్న యమతోను కనిపెట్టి ఆస్పత్రికి తరలించారు. పిల్లాడిని భయపెట్టాలనుకున్న దంపతులు చివరకు తామే భయపడే పరిస్థితి తెచ్చుకున్నారు.