Home సినిమా ఆరు భాషా చిత్రాల నటి జయంతి

ఆరు భాషా చిత్రాల నటి జయంతి

Actor

హీరోయిన్‌గా ప్రవేశించి, ప్రాధాన్యతగల సహాయ పాత్రల్లోనూ మెప్పిస్తూ హీరోయిన్‌గానూ కొనసాగింది జయంతి ఆరు భాషా చిత్రాలలో! తరువాత కాలంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. చిన్నతనంలో తల్లిదండ్రుల ఇష్టప్రకారం మగపిల్లవాడి వేషధారణలోనే పెరగడమే కాకుండా చాలాకాలం మగ పిల్లాడి బుద్ధులు, ఆటలతో ఆమె బాల్యం గడిచింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని బళ్లారిలో బాలసుబ్రహ్మణ్యం, సంతానలక్ష్మి దంపతులకు 1945 అక్టోబర్ 11న జేష్ఠ పుత్రికగా జన్మించింది. అప్పుడు పెట్టిన పేరు కమలకుమారి. తరువాత కొంతకాలం శ్రీకాళహస్తిలోనూ నివసించారు. ఈమె తరువాత పుట్టారు ఇద్దరూ మగపిల్లలే. తండ్రి బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ప్రొఫెసర్. బెంగళూరులోనూ చదివింది. స్కూల్లో చదువుతున్నప్పుడు బొద్దుగా, ఆకట్టుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్స్‌లో పాటలు పాడుతూ, నాట్యాలు చేసేది. మిస్సమ్మ చిత్రంలోని ‘బృందావన మది అందరిదీ గోవిందుడు అందరివాడేలే’ పాటకు బాగా గుర్తింపు వచ్చింది. అందరూ పొగుడుతుంటే కూతురికి నాట్యం నేర్పిస్తే మంచిదనే ఆలోచన తల్లికి వచ్చింది. తరువాత భార్యాభర్తల మధ్యన పొరపొచ్చాల కారణంగా పిల్లలను తీసుకుని మద్రాస్ చేరుకుంది సంతానలక్ష్మి. అప్పుడు కమలకుమారి వయసు పదకొండేళ్లు వుంటాయి. తన స్నేహితురాలు, నాట్యకారిణి, సినిమాల్లో నృత్యాలు చేసే చంద్రకళ వద్ద కమలకుమారి నాట్యంలో శిక్షణ పొందే ఏర్పాట్లు చేసింది తల్లి.
కమలకుమారికి తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు తల్లి, చంద్రకళ తదితరులతో షూటింగ్ చూడటానికి వెళ్లింది. తనకు ఇష్టమైన ఎన్.టి.రామారావు నటిస్తున్న సినిమా అది. ఏ బెరుకూ లేకుండా దగ్గరకు వచ్చిన బొద్దుగా ముద్దొచ్చే అమ్మాయిని చూసి ఒళ్లో కూర్చో పెట్టుకున్న ఎన్.టి.ఆర్‌” మాతో హీరోయిన్‌గా నటిస్తారా” అని అడిగితే “ఓ.ఎస్‌” అంది.
చంద్రకళ దగ్గర నాట్యం నేర్చుకుంటున్నప్పటికీ మామూలు సమయాల్లో అబ్బాయిలాగే నడవడం, అబ్బాయిలాగే వ్యవహరించడం చేసేది. నటి మనోరమ, చంద్రకళకి స్నేహితురాలు. ఈ కారణంగా నాట్యం నేర్చుకునే సమయంలో చిత్రపరిశ్రమ లోని వారు కమలకుమారి ప్రభృతులను చూసేవారు. అలా కన్నడ చిత్రదర్శకుడు వై.ఆర్. స్వామి దృష్టిలో కమలకుమారి పడింది.
జగదేక వీరుని కథ చిత్రానికి ప్లాన్ చేస్తున్న దర్శకుడు కె.వి.రెడ్డి ఇంద్రపుత్రిక జయంతిగా బి.సరోజదేవిని, వరుణుని కుమార్తె వరుణ కుమారిగా కుమలకుమారిని, నాగ కుమారిగా ఎల్. విజయలక్ష్మిని కుమారిగా బాలను ఎంపిక చేశారు. చిన్నతనంలో ఎన్.టి.ఆర్‌తో ఓ.ఎస్ అన్న మాట ఇలా నాయికగా నటించే అవకాశంగా నిజమైంది పదిహేనవ ఏట. మద్రాసు అగ్ని దేవతలు వుంటారనటానికి ఉదాహరణ అంటుంది జయంతి. జలకాలాటలలో కలన్‌ల పాటలలో ఏమి హాయిలే హలా-పాట చిత్రీకరణకు ముందు ఈమెకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. నలుగురు హీరోయిన్లు పాల్గొనే పాట. ఇద్దరు డాక్టర్లను ఏర్పాటుచేసి, జనవరి నెలలో చలికారణంగా ఈ పాట చిత్రీకరించే కొలను సెట్‌లో వేడినీరు వుండే ఏర్పాటు చేయించి చిత్రీకరణ పూర్తి చేశారు కె.వి.రెడ్డి. కమలకుమారిగా నాయిక పాత్రలతో ఇది ఈమె తొలి చిత్రం. 1961లో విడుదలై హిట్ అయినా ఈమెకు తెలుగులో అవకాశాలు వెంటనే రాలేదు. తమిళంలో కూడా ఇదే ఈమె తొలిచిత్రం ‘జగతల ప్రతాపన్’గా 1961లో.
కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి తను రూపొందించే ‘జీనుగూడు’ చిత్రంలో ముగ్గురు నాయికలు అవసరమై పండరీబాయి, చంద్రకళలను ముందు తరువాత ఈమెను నిర్ణయించి ఈమె పేరు జయంతిగా మార్చారు. 1963లో విడుదలై విజయం సాధించింది. ద్వితీయ చిత్రం ‘చంద్రవళ్లియతోట” చిత్రంలో రాజకుమార్ సరసన నాయికిగా నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది 1964లో. సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు రావడంతో కన్నడంలో అవకాశాలు ఎక్కువ రావడమే కాక కాలక్రమంలో రాజన్ కుమార్‌కి నాయికగా. 36 చిత్రాలలో నటించి హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. కన్నడంలో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలలో నాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విశిష్టమైన పాత్రలలో పోషించి మెప్పు పొందింది. ఆమెను ఎంతగానో అభిమానించిన కన్నడిగులు ‘అభినయ శారద’ బిరుదుతో సత్కరించారు.
కులగౌరవం చిత్రలో ఎన్.టి.ఆర్ సరసన నాయికగా నటించి మంచి పేరు ప్రతిష్ఠలు ఆర్జించింది. ఉత్తమ ఇల్లాలుగా డాక్టర్ చక్రవర్తిలో మంచి పాత్ర లభించింది. సుమంగళి, శారద చిత్రాలతో శోభన్ బాబుతో, కమలమ్మ కమతం, అగ్నిపూలు, విధాత చిత్రాలలో కృష్ణంరాజుతో, మరపురాని మనిషి, కలెక్టర్ జానకి చిత్రాలలో జగ్గయ్యతో, రక్తసంబంధం, కుమార్ రాజా చిత్రాలలలో కృష్ణతో తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌లో సత్యనారాయణతో నటించి ఆయా పాత్రలకు వన్నె తెచ్చింది.
మదన కామరాజులో కాంతారావు సరసన మందారవల్లిగా, బొబ్బిలియుద్ధంలో విజయరామరాజు భార్య చంద్రావతిగా, బంగారుబాబులో అక్కినేని సోదరిగా, రామాంజనేయ యుద్ధంలో శాంతగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. నెగిటివ్ టచ్ వున్న మత్సయామిని పాత్రలో స్వర్ణమంజరి’ చిత్రం ద్వారా పేరు తెచ్చుకుంది.
అంతా మన మంచికే, జీవితం, అభిమానవతి, గాంధీ పుట్టిన దేశం చిత్రాల్లో కరుణ రస పూరిత ప్రాతలలో మెప్పుపొందింది. మినిస్టర్ మహాలక్ష్మిలో ఎదురు తిరిగిన భార్యగా, మినిస్టర్‌గా చక్కని హావభావాలు చూపింది. పార్వతీ పరమేశ్వరులు, బొట్టుకాటుక, అల్లరిక్రిష్ణయ్య చిత్రాలతోనూ మెప్పించింది.
క్యారక్టర్ ఆర్టిస్టుగా రాజావిక్రమార్క, దొంగమొగుడు, పెదరాయుడు, తల్లిదండ్రులు, స్వాతికిరణం, కొదమసింహం, శ్రీదత్త దర్శనం, ముద్దుల మేనల్లుడు. వామ్మో నా అత్తో, పట్నం పిల్ల- పల్లెటూరి చిన్నోడు, కంటే కూతురినే కను సినిమాలు గుర్తింపునిచ్చాయి.
ప్రణయ సన్నివేశాలు, ప్రేమ దృశ్యాలకు సంబంధించి అయితే కృష్ణంరాజుతో “తొలిసారి మొగ్గేసింది సిగ్గు పాడు సిగ్గు….” , ‘రావే అరకు రాణి నీకు చేస్తానే వలపు బోణి రారారాజా నిమ్మలపండు నిన్ను రమ్మంది నా తల్లో మల్లె చెండు…’ పిల్లగాడి రివురివులు పులిహోర గుమగుమలు.. (కమలమ్మ కమతం) పాటలలో, పిల్లలు పడుకోగా శ్రీధర్ పిలుపులకు సైగలతో రొమాంటిక్‌గా కళ్లతో, తనువుతో పలకరిస్తూ బొమ్మరిల్లుతో చేసిన అభినయం గుర్తుండిపోతుంది.
ఆనందం, సంతృప్తి వ్యక్తం అయ్యేలా’ మాతృత్వంలోనే వుంది ఆడజన్మ సార్ధకం. అమ్మా అనిపించుకుంటే స్త్రీ మూర్తికి గౌరవం (కుటుంబ గౌరవం) చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మా (బొమ్మరిల్లు) మల్లెపందిరి నీడలోన జాబిల్లి, మంచమేసి వుంచినానె జాబిలీ…. అంటూ వీణ వాయిస్తూ (మాయదారి మల్లెగాడు) పాటలతో ప్రతిభ చూపింది.
ఆవేదన, అంతలోనే ఆనందం చూపి అభినయానిచ్చే వీల్ చెయిర్లో ఎన్.టి.ఆర్. తీసుకు వెడుతూ ‘మా ఇంటి మహాలక్ష్మినీవె మా కంట వెలిగే గృహలక్ష్మి నీవె….’ (కొండవిటి సింహం) పాడుతుంటే ప్రదర్శించింది. వలచిన మనసే ఆలయం…, అనగనగా ఒక చిలుకమ్మా (కలెక్టర్ జానకి) పాటలలో దిగులు, ఆవేదన, ఆందోళన కనబరుస్తూ నటించింది.
దేవదాసు చిత్రంలో కృష్ణముందు ‘ఈరోజు చాలా మంచి రోజు నీ రాక నా మనసు మరిచిపోదు’ అంటూ ఖవ్వాలీ తరహా గీతంలో నాట్యంతో మెప్పించింది.
ఇందిరాగాంధీ ముద్దు
ఫ్యాషన్‌ని, ఆధునికతను అనుసరించడంలో ముందుండే నటిగా చిత్రసీమలో జయంతికి మంచి గుర్తింపు వుంది. స్విమ్ సూట్ ధరించడానికి మొదటిసారి ముందుకొచ్చిన నటి. స్కర్ట్‌లు, టిషర్ట్‌లు, నైటీలు ధరించి గ్లామర్ హీరోయిన్‌నని వెండితెర మీద రుజువు చేసుకుంది. మిస్ లీలావతి కన్నడ చిత్రంలో ఇలానూ, ఇంకా విభిన్నమైన శైలిలోనూ నటించడంతో జాతీయస్థాయి అవార్డుని గెలుచుకుంది. ఈ అవార్డుని అప్పటి సమాచార ప్రసారశాఖ మంత్రి శ్రీమతి ఇందిరిగాంధీ జయంతికి ప్రదానం చేశారు. అవార్డు తీసుకుని వెళ్లిపోతున్న జయంతిని వెనక్కి పిలిచి, బుగ్గను ముద్దాడి, గుడ్‌లక్ చెప్పడం జీవితంలో మరిచిపోని సంఘటనగా భావిస్తుంది జయంతి.
ముగ్గురు గురువులు
దేవకన్యలా నడిచి రమ్మంటే ఒక అబ్బాయిలా నడిచిన మనకు వయ్యారంగా, అందంగా ఎలా నడవాలో చూపించి అలా నటింపజేయడం వల్లనే ‘జగదేక వీరుని కథ’ చిత్రంలో చక్కగా ముద్దుగా చేయగలిగానని, ఆడదానిలా ఎలా నడుచుకోవాలో ఆ పాఠమే ప్రేరణ అయిందని అలా కె.వి.రెడ్డి తన తొలి గురువు అని అంటారు జయంతి. శోభన్‌బాబుతో శోభనం రాత్రి నాడు పులకించిపోతూ, మత్తుగా ఎలా చూడాలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సూచనతో కె.విశ్వనాథ్ నాకు చేసి చూపడం వల్లనే ప్రణయ సన్నివేశాల్లో ఎలా చేయాలో నేర్చుకున్నాను అని అంటుంది. జయంతికి సావిత్రి అంటే చాలా అభిమానం. తమిళ సినిమాలో ఆమెతో కలిసి చేయడానికి భయపడింది. సహాయ దర్శకులు ఒత్తిడి చేస్తే సరేనంది జయంతి. డైలాగ్ చెప్పడంలో భావ ప్రకటనలో తడబడటంతో సావిత్రి కోపగించడంతో బాగా నేర్చుకుని ఆ తరువాతే నటిస్తానని వెళ్లిపోయింది. ఈ సంఘటన తమిళం బాగా మాట్లాడటంతో బాటు హావభావాల ప్రకటన అంశాలు బాగా నేర్చుకునేలా చేసింది. అలా సావిత్రి మూడవ గురువు.
ఫ్యాషన్ ఐకాన్‌గా, పొగరుమోతు నాయికగా , చక్కని గృహిణిగా, ప్రేమ, ఆప్యాయత, అనురాగం గుప్పించే ప్రేయసిగా, భయ, రౌద్రరసాలను వ్యక్తీకరించే నటిగా పేరున్నందునే ఆరుభాషలలో అయిదువందల ఇరవైకిపైగా చిత్రాలలో నటించి, ఇప్పుడూ తన నట ప్రస్థానం కొనసాగిస్తోంది జయంతి.

క్యారెక్టర్ ఆర్టిస్టులుగా  వీరికి వీరే సాటి

రంగారావు తెలుగు చిత్రరంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదటి స్థానంలో నిలుస్తారు. హావభావ ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక విలక్షణమైన పాత్రల్ని పోషించారు. అంతర్జాతీయ ఖ్యాతిని వహించిన మహానటుడు.
లింగమూర్తి విలక్షణపాత్రల్ని పోషించి మెప్పించారు.
జగ్గయ్య వైవిధ్యమైన పాత్రలెన్నింటినో పోషించారు. అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మొదలుపెట్టి, విలన్ పాత్రల్లో రాణించారు. మహామంత్రి తిమ్మరుసు వంటి పాత్రలలో నటించి క్యారెక్టర్ నటునిగా స్థిరపడ్డ విశిష్ట నటుడు గుమ్మడి. పాత్రల్లో ఒదిగి నటించగల సామర్థం ఆయన సొంతం.
పాత్రలలో ఎదిగిన మంచి నటి రుషేంద్రమణి.
నటనతో అందర్నీ ఆకట్టుకున్న నటి శాంతకుమారి.
పాత్రలకు కొత్త నిర్వచనం చెప్పిన కన్నాంబ నటనలో హుందాతనం ప్రదర్శించేవారు.
అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన నటుడు జె.వి. సోమయాజులు. రారా కృష్ణయ్య, శంకరాభరణం, త్యాగయ్య, వంశవృక్షం సినిమాలలో కథానాయకుడు అనదగ్గ పాత్రల్ని పోషించారు. అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు.
పాత్రల్ని, గయ్యాళి పాత్రల్ని అద్భుతంగా పోషించిన నటి సూర్యకాంతం. సాత్విక పాత్రల్లో సైతం తన అభినయ ప్రౌఢిని ప్రదర్శించారు.
అమ్మమ్మ, నాయనమ్మ పాత్రల్లో తనదైన ప్రత్యేక శైలిలో నటించి మెప్పించిన నటి నిరమ్మలమ్మ. ఆమె నటన సహజంగా ఉండేది.