Home వార్తలు లవ్ వర్సెస్ ఈగో

లవ్ వర్సెస్ ఈగో

Jeelakarra-Bellamఅభిజిత్, రేష్మ జంటగా శ్రీచరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జీలకర్ర బెల్లం’. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలను తెలంగాణ ఎంపి కవిత విడుదల చేయగా అనంతరం హైదరాబాద్‌లోని ఆవాస హోటల్‌లో ఆడియో వేడుక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు దశరథ్ బిగ్ సిడి, ఆడియో సిడిలను విడుదల చేసి మొదటి కాపీని దాస్యనాయక్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆళ్ల నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ “ప్రస్తుతం ఉన్న యువతకు చదువు, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి. వారిని తమ తల్లిదండ్రులు కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్న వారు ఎనిమిదో అడుగును విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని మంచి సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈనెల 29న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రీతిలో సినిమాను చిత్రీకరించాం. వందేమాతరం శ్రీనివాస్ నా మొదటి సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది”అని చెప్పారు. హీరో అభిజిత్ మాట్లాడుతూ “లవ్ వర్సెస్ ఈగో అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మధ్య ప్రేమ గెలుస్తుందా..? లేక ఈగో గెలుస్తుందా..? అనే అంశాలతో ఈ సినిమా నడుస్తుంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం శ్రీనివాస్, రేష్మ, గుణ్ణం గంగరాజు, వెనిగళ్ల రాంబాబు, రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, బలరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.