Home తాజా వార్తలు నేడు తేలనున్న ‘జెట్’ భవితవ్యం

నేడు తేలనున్న ‘జెట్’ భవితవ్యం

Jet Airwaysరుణదాతలతో సమావేశం కానున్న యాజమాన్యం
పైలట్ల తదుపరి నిర్ణయం కోసం ఈరోజు భేటీ

ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు నేడు(సోమవారం) ఎంతో కీలకం కానుంది. కష్టాల్లో ఉన్న జెట్ విమానాలు ఎగరాలా? లేదా సంస్థను మూసివేయాలా? అనే నిర్ణయం తీసుకునే రోజు వచ్చింది. రూ.1500 కోట్లు అత్యవసర నిధిని అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రణాళికతో జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం నేడు రుణ సంస్థలతో సమావేశం కానుంది. రుణ సంస్థలు నిధులను మంజూరు విషయంలో మరింత ఆలస్యం చేస్తాయా? లేదా? అనేది నేటితో తేలనుంది.

పైలట్లు విధులకు దూరం
మరోవైపు జెట్ పైలట్లు, ఉద్యోగులు సోమవారం సంస్థ అధికార కార్యాలయం వద్ద సమావేశమై, తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 1,100 మంది పైలట్లు సోమవారం ఉదయం 10 గంటల నుంచి విధులకు దూరంగా ఉండనున్నారు. పైలట్స్ బాడీ ఎన్‌ఎజి(నేషనల్ ఏవియేటర్ గిల్డ్) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పైలట్స్, ఇంజినీర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు జీతం బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదు. జనవరి నుంచి వీరికి జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇతర కేటగిరి ఉద్యోగులకు కూడా మార్చి జీతాలను చెల్లించలేదు. దీంతో మొత్తం మూడున్నర నెలల జీతాలు ఇవ్వాల్సి ఉందని, ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే మేము ఏప్రిల్ 15 నుంచి విధులకు దూరంగా ఉంటున్నామని గిల్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 1,600 మంది పైలట్లలో దాదాపు 1,100 మంది ఎన్‌ఎజిలో సభ్యులు. జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ బాధ్యతల ను ఇప్పుడు ఎస్‌బిఐ నేతృత్వంలోని కన్సార్టియం చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజశ్రీ పతి తన పదవి నుంచి వైదొలగారు. ఆయన రాజీనామా ఏప్రిల్ 13 నుంచే అమల్లోకి రానుంది.

మౌన ప్రదర్శన
జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందిఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్ ఎయిర్‌వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. 2 వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు.

30-50% తగ్గింపుతో స్పైస్‌జెట్‌లోకి…
జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం ప్రత్యర్థిక సంస్థ స్పైస్‌జెట్‌కు కలిసివస్తోంది. జెట్ ఉద్యోగులు తగ్గింపు వేతనాలతో స్పైస్‌జెట్‌లోకి చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్లు 30 నుంచి 50 శాతం తగ్గింపుతో స్పైస్‌లోకి వెళ్లేందుకు సుముఖత చూపుతుండగా, మరోవైపు ఇంజినీర్లు అంతకంటే దిగివచ్చి తమకు ఇప్పుడున్న జీతంలో 50 శాతం తగ్గింపుతో ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Jet Airways Crisis Management To Meet State Bank Today