Home ఎడిటోరియల్ జార్ఖండ్ ఆదివాసీల దుస్థితి

జార్ఖండ్ ఆదివాసీల దుస్థితి

Adivasi2

జూలై 5వ తేదీన జార్ఖండ్‌లో ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు కలిసి “24 గంటల మహాబందీ” (సమ్మె) కు పిలుపిచ్చారు. జార్ఖండ్‌లో భూసేకరణ బిల్లు 2017కు వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. భూ సేకరణ, పునరావాసం, పునర్నివాసాల్లో పారదర్శకత, నిష్పక్షపాత నష్టపరిహారాల హక్కు (Right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement (Jharkhand Amendment Bill) 2017). ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ బిల్లును ప్రతిఘటిస్తూ సమ్మె మొదలైంది.
ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో భూమి హక్కు విషయంలో జరిగిన అనేక ప్రతిఘటనల్లో ఇది కూడా ఒకటి. ప్రతిఘటన అనేక రూపాల్లో జరుగుతోంది. 2015లో సంచలనాత్మక రూపంలో ప్రతిఘటన జరిగింది. బహిరంగ మలవిసర్జన బిల్లు పత్రాలను టాయిలెట్ పేపర్లుగా వాడడం ద్వారా తమ నిరసనను తీవ్ర ఆగ్రహావేశాలను ప్రకటించారు. చట్టానికి సంబంధించిన పత్రాల కాపీలను టాయిలెట్ పేపర్లుగా బాహాటంగా ఉపయోగించడం అత్యంత తీవ్రస్ధాయికి చెందిన నిరసనగా నమోదయ్యంది. ఇప్పుడు ఈ జూలై 5వ తేదీ ప్రతిఘటన కూడా తీవ్రస్థాయిలో జరిగింది.
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 2020 నాటికి రెండు దశాబ్దాలు పూర్తవుతాయి. ఒక గొప్ప ఆశతో కొత్త రాష్ట్రం సాధించుకున్నారు. ఆ ఆశ క్రమేణా ఘర్షణగా మారింది. ఆ ఘర్షణ ఇప్పుడు ఒక ఉద్యమం రూపంలోకి బదిలీ అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉన్న ఆశలు, ఆకాంక్షలు ఇప్పుడు మిగల్లేదు. నిజానికి జార్ఖండ్ ఆదివాసీల రాష్ట్రంగా ఏర్పడుతుందనుకున్నారు. కాని ఆదివాసీలు హక్కుల కోసం నిత్యం ఉద్యమించే రాష్ట్రం అయ్యింది.
20వ శతాబ్దంలో జార్ఖండ్ ప్రాంతంలో రాజకీయాలన్నీ ప్రత్యేకరాష్ట్ర సాధన చుట్టే తిరిగాయి. ప్రారంభంలో ఈ ఉద్యమం ఆదివాసీల చేతుల్లోనే ఉండేది. ఆదివాసీ నాయకత్వమే ఉండేది. ఛోటా నాగ్ పూర్ ప్రాంతంలోని ఆదివాసీ జనాభా కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ఉద్యమం ప్రారంభంలో నడిచింది. 1960 తర్వాతి నుంచి ఉద్యమం రూపు మారింది. ఉద్యమం విస్తరించింది. ఈ ప్రాంతం జనాభాలో ఆదివాసీల శాతం తగ్గింది. ఆ తర్వాత ఆర్థిక రంగంలో మార్పుల వల్ల తలెత్తిన కష్టాలు ఉద్యమంలో ప్రధాన అంశాలయ్యాయి. అనేక ఇతర వర్గాలు సముదాయాలు ఉద్యమంలో చేరాయి. జార్ఖండ్ ఆదివాసీ పోరాటాలు ముఖ్యంగా జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి) చుట్ట్టూ తిరిగిన పోరాటాలు. ఎందుకంటే ఈ ముఖ్యమైన వనరుల వాడకం విషయంలో రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
జార్ఖండ్‌లో భూమిపై హక్కు అనేది చాలా వివాదాస్పదమైన అంశంగా మారింది. పూర్వ కాలంలో కూడా జార్ఖండ్ లో ఇది చాలా కీలకమైన సమస్యగానే ఉండేది. బ్రిటీషువారు జార్ఖండ్ వచ్చినప్పుడు ఛోటా నాగ్ పూర్ రాజును భూస్వామిగా చేశారు. దానికి బదులుగా ఆ రాజుగారు బ్రిటీషు వారికి భారీగా కప్పం కట్టేవాడు. ఆ కాలంలోనే భూస్వాములు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలోకి వచ్చారు. వారితో పాటు వడ్డీవ్యాపారులు వచ్చారు. వడ్డీవ్యాపారులే కాదు ఇతర వ్యాపారులు కూడా వచ్చారు. జార్ఖండ్ సహజవనరులను వీరంతా దోచుకోవడం ప్రారంభమైంది.
బ్రిటీషు వారు చేసిన మరో మార్పు ఉంది. దానివల్ల తిరుగుబాటు కూడా జరిగింది. గ్రామంలోని భూములు సాంప్రదాయికంగా ఉమ్మడి ఆస్తిగా ఉండేవి. వాటిని క్రయవిక్రయ హక్కులున్న భూములుగా మార్చడం జరిగింది. అంటే ఒకరి యాజమాన్యంలోకి ఆ భూములను తీసుకునే వీలు కల్పించారు. అంతేకాదు, బ్రిటీషు వారు అక్కడి అడవులపై ఆదివాసీల హక్కులపై కూడా పరిమితులు విధించారు. అడవులను ఉపయోగించడం, అడవి భూములను వ్యవసాయానికి వాడడంపై ఆంక్షలు పెట్టారు.
1830 నాటి బొగ్గు తిరుగుబాటు, 1855 నాటి సంతాల్ హుల్ (హుల్ అంటే విముక్తి అని స్థానిక భాషలో అర్థం) తిరుగుబాటు ఈ రెండు కూడా ప్రధానంగా భూమి హక్కుల కోసం జరిగిన పోరాటాలే. వడ్డీవ్యాపారులు, ఇతర వ్యాపారవర్గాలు స్ధానిక ఆదివాసీలపై కొనసాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగానే ఈ పోరాటాలు జరిగాయి. ఆదివాసీ భూములను బయటివారు (దికూస్) ఆక్రమించుకోడాన్ని ప్రతిఘటించిన పోరాటాలే ఇవి.
బ్రిటీషు వారు ఈ పోరాటాలను అణచివేసి విల్కిన్సన్ నియమాలు ప్రవేశపెట్టారు. ఈ నియమాల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్తగా ఎవరు బయటి నుంచి వచ్చి భూమి స్వంతం చేసుకునే వీలు లేదు. 1869 నుంచి 1880 మధ్య కాలంలో భారీస్థాయిలో భూమి సర్వే చేయించారు. ఈ సర్వే ఇక్కడి ఖుంట్ కత్తిదారి, భూయిన్హార్ భూముల వివరాలను, వాటిపై హక్కులను నిర్ధారించడానికి చేయించిన సర్వే. ఈ సర్వే తర్వాత ఎవరి యాజమాన్యంలోనూ లేని, సెటిల్మెంటు జరగని భూమి బ్రిటీషు వారు తీసుకున్నారు.
1890 నుంచి 1895 మధ్య కాలంలో ఆదివాసీల్లో మరోసారి తీవ్రమైన నిరసన చోటు చేసుకుంది. 19వ శతాబ్దంలో ప్రసిద్ధిపొందిన బిర్సా ముండా పోరాటం ప్రముఖం గా చెప్పుకోదగ్గది. వ్యవసాయ సంస్కరణల కోసం, బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు.
బిర్సాముండా జార్ఖండ్‌లో ఆదివాసీ పాలన కోసం, ఆదివాసీల భూమి హక్కులను, అడవి హక్కులను సాధించడానికి పోరాడాడు. భూమి, అడవి రెండింటిని బ్రిటీషు పాలకులు, బయటి వ్యాపారులు దోచుకోడాన్ని నిరసిస్తూ పోరాడాడు. బ్రిటీషు వారు అత్యంత హింసాత్మకంగా ఈ తిరుగుబాటును అణచేసే ప్రయత్నం చేశారు. 1908లో వలసపాలకులు ఛోటా నాగ్ పూర్ కౌలు చట్టం చేశారు. కాని ఈ చట్టం ఆదివాసీల ఆగ్రహాన్ని చల్లార్చలేదు.
అనేక ప్రతిఘటనలు జరిగాయి. జార్ఖండ్ ఉద్యమంలో భూమి హక్కుల కోసం హింసాత్మక పోరాటానికి దిగడం తప్పు కాదన్న భావన చాల మంది ఉద్యమకారుల్లో చోటు చేసుకుంది. ఆదివాసీ భూములను రాజ్యం స్వాధీనం చేసుకోవడం కొనసాగుతూ వచ్చింది. 1894 భూ సేకరణ చట్టం క్రింద రాజ్యం, ప్రయివేటు కంపెనీలు పారిశ్రామిక అవసరాల కోసం భూమి సేకరించడం కొనసాగిస్తూ వచ్చారు. ఇలా సేకరించిన భూమి ప్రజాప్రయోజనాల కోసమే అన్న వాదన ముందుకు వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతూ వచ్చింది. 1950 తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం భారీస్థాయిలో ఆదివాసీ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కేవలం 1990లోనే దామోదర్ వ్యాలీ కార్పొరేషను కోసం 90,000 మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. జార్ఖండ్ లో వివిధ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆదివాసీల నేలను ఆక్రమించుకున్నారు. కాని ఇల్లు కోల్పోయిన కుటుంబంలో ఒక్కడికి కూడా ఉద్యోగం దొరకలేదు. రాజ్యం భూమిని సేకరించినప్పుడు ప్రారంభంలో ప్రతిఘటన అంతగా లేదు. కొంతవరకు అంగీకారం కూడా ఉండేది. 1965- 1975 మధ్య కాలంలో గనుల కోసం, పరిశ్రమల కోసం, డ్యాముల కోసం ఇతర అభివృద్ధి కార్యకలాపాల కోసం కోల్పోయిన భూమికి నష్టపరిహారం కోరుతూనే ఉద్యమాలు నడిచాయి.
రాంచీలోని సామాజిక కార్యకర్త స్టాన్ స్వామి ప్రకారం జార్ఖండ్ లో 20 శాతం భూమి నేడు గనుల తవ్వకం కోసం, డ్యాముల కోసం ఉపయోగపడుతోంది. ఈయన ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వాతంత్య్రం తర్వాతి నుంచి ఇలా అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమి సేకరించడం వల్ల జార్ఖండ్‌లో 40 లక్షల మంది నేటి వరకు నిర్వాసితులయ్యారు. 1975 తర్వాతి నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రతిఘటనలో తీవ్రత కూడా పెరిగింది. పోరాటాలు హింసాత్మకం అయ్యాయి. బ్రిటీషు కాలం నుంచి నేటి వరకు జార్ఖండ్ చరిత్ర బీహారు చరిత్రతో కలగలిసిపోయింది.
నవంబర్ 2000లో అనేక పోరాటాల తర్వాత ఛోటా నాగపూర్‌ను బీహారు నుంచి వేరు చేసి జార్ఖండ్ ఏర్పాటు చేశారు. దీనికి అర్ధం అడవుల నేల. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం అయ్యింది.ఈ రాష్ట్రంలో నేడు ఆదివాసీలు 28 శాతం ఉన్నారు. ఆదివాసీల కొరకు ఏర్పడిన రాష్ట్రమిది. కాని రాష్ట్రం ఏర్పడిన లక్ష్యాల్లో ఒక్కటి కూడా నేటికీ సాధించుకోలేకపోయింది. అవినీతి తారాస్థాయికి చేరింది. స్థిరమైన ప్రభుత్వాలు లేవు. ఆరోగ్యం, పోషకాహార సూచికలు దయనీయంగా ఉన్నాయి. పేదరాష్ట్రంగా మిగిలిపోయింది. కాని రాష్ట్రంలో సహజవనరులు, సంపద అపారం. దేశంలోని విలువైన ఖనిజాల్లో 40శాతం జార్ఖండ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం కూడా తీవ్రంగా ఉంది.
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 19 జిల్లాలు నక్సల్ జిల్లాలుగా గుర్తింపు పొందాయి. జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి ఆదివాసీ ప్రజలు అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు. ఉద్యమాల్లో హింసాత్మక దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి జరిగింది. ఈ పవర్ ప్రాజెక్టు సంతాల్ పరగణ డివిజన్‌లో ఉంది. 1855లో బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. బంగ్లాదేశ్‌కు విద్యుచ్ఛక్తి సరఫరా చేయడానికి ఉద్దేశించిన పవర్ ప్రాజెక్టు అని చెబుతున్నారు.ఈ పవర్ ప్రాజెక్టు వల్ల ఇ క్కడి ప్రజాప్రయోజనమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆదివాసీల కోసం ఏర్పడిన రాష్ట్రంలో వారి కోసం పనిచేసే ప్రభుత్వంతో ఆదివాసీలు ఇప్పుడు తమ హక్కుల కోసం గొంతెత్తి నినదించవలసి వస్తోంది. ఒకవైపు ప్రభుత్వం, కార్పొరేట్ల కూటమి ఉంటే మరోవైపు ఆదివాసీలు ఉన్నారు. 1855 సంతాల్ హుల్ తిరుగుబాటులో వినిపించిన నినాదం “లోహా నహీ అనాజ్ చాహియే” (లోహం కాదు ధాన్యం కావాలి) నేటికి కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంది.

* సానియా మర్యం