Home ఆఫ్ బీట్ సిలబస్‌పై పట్టు సాధిస్తేనే ఉద్యోగం

సిలబస్‌పై పట్టు సాధిస్తేనే ఉద్యోగం

700 విఆర్‌ఒ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు
విఆర్‌ఒ, గ్రూప్4 పోస్టులకు పోటీ అధికం
స్వల్ప తేడాతో ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు
ఎఎస్‌ఒ పోస్టులకు అదనంగా స్టాటిస్టిక్స్
సెప్టెంబర్ 2న ఎఎస్‌ఒ, 16న విఆర్‌ఒ,అక్టోబర్ 7 గ్రూప్-4 పరీక్షలు

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే అధికారి విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ). గ్రామాలలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు నిత్యం ప్రజల మధ్యలో ఉండే విఆర్‌ఒ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించే గ్రూప్4 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) విఆర్‌ఒ, గ్రూప్4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.ఈ పోస్టులకు నోటిఫికేషన్లు, విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నప్పటికీ సిలబస్ మాత్రం ఒకే విధంగా ఉంది. ఒకే సమయంలో ఒకే సిలబస్‌తో ఉండే రెండు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో నిరుద్యోగులకు ఏకకాలంలో ఈ రెండు పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవకాశం లభించింది. విఆర్‌ఒ పోస్టులకు ఇంటర్మీడియేట్ అర్హత కాగా, గ్రూప్4 పోస్టులకు డిగ్రీ అర్హత. 700 విఆర్‌ఒ పోస్టులకు, 1,521 గ్రూప్4 పోస్టులకు వెలువడిన ప్రకటనలను పరిశీలిస్తే, ఒకే సబ్జెక్టులు, దాదాపుగా ఒకే సిలబస్ కనిపిస్తుంది. వీటితోపాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు  మండల్ ప్లానింగ్, స్టాటిస్టికల్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎఎస్‌ఒ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 474 ఎఎస్‌ఒ పోస్టులకు రెండు పేపర్లు ఉండగా, అందులో ఒకటి విఆర్‌ఒ, గ్రూప్4 ఉన్న పేపర్ కాగా, మరొకటి స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఒకేసారి మూడు పరీక్షలకు సిద్దమయ్యే అవకాశం లభించించి.

Inter Exams to Begin from Feb 28

నో స్క్రీనింగ్, నో ఇంటర్వూ
700 విఆర్‌ఒ పోస్టులకు సుమారు 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్నందున భారీగా దరఖాస్తులు వచ్చాయి. చాలాకాలంగా ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో విఆర్‌ఒ, గ్రూప్ 4 ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షల కాఠిన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు, ఎలాంటి ఇంటర్వూలు లేని నియామక ప్రక్రియ కావడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. కష్టపడి చదివి సిలబస్‌లో పొందుపరిచిన అన్ని అంశాలపై పట్టు సాధిస్తే తప్ప ఉద్యోగాన్ని చేజిక్కించుకోలేని పరిస్థితి. గ్రూప్ 4 పరీక్షను అక్టోబర్ 7న, విఆర్‌ఒ పరీక్షను సెప్టెంబర్ 16న నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి సన్నద్దమవుతోంది. అందువల్ల అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు.
రెండు పరీక్షల మధ్య తేడా ఏంటీ..?
విఆర్‌ఒ, గ్రూప్4 రెండు నోటిఫికేషన్లకు ఒకే సిలబస్. అయితే గ్రూప్4లో రెండు పేపర్లు ఉండగా, విఆర్‌ఒ పోస్టులకు మాత్రం ఒకే పేపర్ ఉంటుంది. గ్రూప్4లో మొత్తం 300 మార్కులు అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటాయి. అలాగే విఆర్‌ఒ మొత్తం 150 మార్కులకే పరీక్ష ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షల్లో ప్రతి పేపర్ 150 నిమిషాల వ్యవధిలో 150 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంటే సరాసరిన ఒక ప్రశ్నకు ఒక నిమిషం సమయం ఉంటుంది.
సిలబస్
జనరల్ నాలెడ్జ్ : కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు.
సెక్రటేరియల్ ఎబిలిటీస్ : మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రెహెన్షన్, రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్
విఆర్‌ఒ పరీక్ష విధానం (వ్యవధి : 150 నిమిషాలు)
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
1. జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ 75+75=150.
సిలబస్
జనరల్ నాలెడ్జ్ : గ్రూప్ 4 సిలబస్‌లోని అంశాలే అందులోనూ ఉన్నాయి. అదనంగా ఎథిక్స్, బలహీనవర్గాలు, లింగ అసమానతలు, సామాజిక స్పృ హ అంశాలను పొందుపరిచారు. విఆర్‌ఒ పరీక్షలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని ప రీక్షించేలా కూడా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఎథిక్స్, స్త్రీ-పురుష సమానత్వం, బలహీన వర్గాలు, సామాజిక స్పృహ తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.
సెక్రటేరియల్ ఎబిలిటీస్ : బేసిక్ ఇంగ్లీష్(8వ తరగతి స్థాయి) మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్) లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్.
సిలబస్
జనరల్ నాలెడ్జ్ : కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు
స్టాటిస్టిక్స్ : ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, అనాలసిస్ ఆఫ్ టైమ్ సీరీస్ అండ్ ఇండక్స్ నెంబర్స్, సాంప్లింగ్ టెక్నిక్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్.
సెక్రటేరియల్ ఎబిలిటీస్‌పై పట్టు సాధిస్తేనే మంచి స్కోర్
విఆర్‌ఒ, గ్రూప్4 సిలబస్‌లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంది. ఈ సబ్జెక్ట్‌కు గ్రూప్4లో ప్రత్యేక పేపర్ ఉండగా, విఆర్‌ఒలో ఒకే పేపర్ ఉంది కాబట్టి 50 శాతం ప్రశ్నలు సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కే కేటాయించారు. ఈ సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల్లో మంచి స్కోర్ లభిస్తుంది. నెగెటివ్ మార్కులు లేకపోయినప్పటికీ ప్రశ్నలు కఠినంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున సెక్రటేరియల్ ఎబిలిటీస్‌ను ఏమాత్రం నిర్లక్షం చేయకుండా నిరంతరంగా చదువుతూ పునశ్చరణ చేసుకోవాలి.
తెలంగాణ చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి
తెలంగాణకు సంబంధించిన చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి. ఉద్యమ చరిత్రలో 1947 నుంచి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో తెలంగాణ ప్రాంతం కోసం జరిగిన ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు, వాటి సిఫార్సులు తదితరాలను అధ్యయనం చేయాలి. తెలంగాణలోని కవులు-రచనలు,కళలు, ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై శ్రద్ద వహించాలి. అదేవిధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయమున్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. భౌగోళికంగా తెలంగాణలోని ముఖ్య నదులు-పవీవాహక ప్రాంతాలు, ముఖ్య పంటలు, భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి సారించాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా తదితర అంశాలపై అవగాహ అవసరం. వీటితోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరిచిన అంశాలు, తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి.
అన్ని అంశాలపై అవగాహన అవసరం
విఆర్‌ఒ, గ్రూప్4, ఎఎస్‌ఒ సిలబస్‌లో పొందుపరిచిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్స్/న్యామరికల్, లాజికల్ రీజనింగ్, జాతీయోధ్యయం, భౌగోళశాస్త్రంపై దృష్టి సారించాలి. కరెంట్ ఎఫైర్స్‌లో ఆరు నెలల నుంచి ఏడాదికి సంబంధించి వర్తమాన అంశాలను చదవాలి. అర్థశాస్త్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక సర్వే, పౌరశాస్త్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ-గవర్నెన్స్, రెవిన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లోని అధికారులు- వారి అధికారాలు-విధులు గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. జీవశాస్త్రంలో విజ్ఞానశాస్త్ర చరిత్ర, విటమిన్లు, సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు, మానవ శరీరం-ఆరోగ్యం, పశు సంవర్థనం, జీవన విధానాలు, పోషణ, నియంత్రణ, సమన్వయం, జీవశాస్త్రంపై పరిశోధనలు జరిపే సంస్థలు,అవి ఉన్న ప్రదేశాలు, కొత్తగా ఆవిషమ్కరించిన ముఖ్య ఔషధాలు, వైరస్‌లు వాటి నేపథ్యం తెలుసుకోవాలి. భౌతిక-రసాయన శాస్త్రంలో ప్రశ్నలు ఎక్కువగా అనువర్తిత విధానంలో ఉంటాయి. నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజి, సమకాలీన ఆవిష్కరణలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
కటాఫ్ ఎంత ఉండొచ్చు…?
విఆర్‌ఒ, గ్రూప్4 పోస్టులకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రశ్నలు క్లిష్టంగా వచ్చే అవకాశం ఉంది. ప్రశ్నలు అప్లికేషన్ పద్దతిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు సిలబస్‌లోని అంశాలపై మంచి పట్టు ఉంటే తప్ప సరైన సమాధానాలను గుర్తించలేని పరిస్థితి ఉండొచ్చు. విఆర్‌ఒ పోస్టులకు మొత్తం 150 మార్కులకు 130పైన మార్కులు వస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రూప్4 పోస్టులకు మొత్తం 300 మార్కులకు 230 మార్కులు సాధిస్తేనే ఉద్యోగం వస్తుందని ఆశించవచ్చు. అయితే ప్రశ్నపత్రాలు సులభంగా ఈ మార్కులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

గ్రాండ్ టెస్టులతో ఎంతో మేలు

పరీక్షలకు 1520 రోజుల ముందు వరకు అన్ని సబ్జెక్టులు అధ్యయనం చేస్తూ ఉండాలి. పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తూ, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. పరీక్షలకు సుమారు నెల ముందు నుంచి వివిధ ఇన్‌స్టిట్యూట్, సంస్థలు నిర్వహించే గ్రాండ్ టెస్ట్‌లకు హాజరుకావడం మంచిది. మాక్ టెస్ట్‌లకు హాజరుకావడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి తెలుసుకోగలుగుతారు. గ్రాండ్ టెస్టులలో పాల్గొనడం ద్వారా అభ్యర్థులు ఎవరికి వారే పరీక్షించుకోవచ్చు.

సిరికొండ లక్ష్మినారాయణ
మేనేజింగ్ డైరెక్టర్, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్
దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్. ఫోన్ నెం. 8885555202.

యం.భుజేందర్