Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గురుకులాల్లో టీచర్ కొలువులు

Job notification gurukulam in telangana

2,932 పిజిటి, టిజిటి పోస్టులకు నోటిఫికేషన్లు
దరఖాస్తుకు ఆగస్టు 8 వరకు అవకాశం
మూడు పేపర్లు…300 మార్కులు
కొత్తగా నెగెటివ్ మార్కుల విధానం
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గింప

నిరుద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రులు ఆసక్తిగా ఎదురుచూసే గురుకుల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. రాష్ట్రంలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టిజిటి), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పిజిటి) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టిఆర్‌ఇఐఆర్‌బి) ప్రకటనలు విడుదల చేసింది. గతంలో గురుకుల టీచర్ పోస్టులు టిఎస్‌పిఎస్‌సి భర్తీ చేయగా, ఈ సారి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల ఉమ్మడి నియామక బోర్డ్ అయిన టిఆర్‌ఇఐ-ఆర్‌బి ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 2,932 టిజిటి,పిజిటి పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేసే ఈ పోస్టులకు సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా సంకల్ప బలంతో సాధన చేస్తే ఉద్యోగం సొంతం చేసుకోగలుగుతారు. ఈ పోస్టుల నియామక ప్రక్రియలో సిలబస్‌లో పొందుపరిచిన అన్ని అంశాలపై పట్టు సాధిస్తూ ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా www.treirb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ. 1,200, ఎస్‌సి,ఎస్‌టి,వికలాంగ అభ్యర్థులకు రూ.600
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08.08.2018
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పిజిటి)
మొత్తం పోస్టులు : 1,972
అర్హత : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బి.ఇడి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయసు : 18 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టిజిటి)
మొత్తం పోస్టులు : 960
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బి.ఇడి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో అర్హత సాధించి ఉండాలి.

వయసు : 1844 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : పిజిటి పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే టిజిటి అభ్యర్థులను రాతపరీక్షకు 80 శాతం వెయిటేజి, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజి కల్పించి ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం : పిజిటి, టిజిటి నియామకాలలో మూడు పేపర్లు ఉంటాయి. ఒఎంఆర్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌లో ఒక ప్రశ్నకు ఒక మార్కు వంతున 100 ప్రశ్నలు ఉంటాయి. మూడు పేపర్లకు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. గురుకుల నియామకాలలో ఈసారి కొత్తగా నెగెటివ్ మార్కులను గురుకుల బోర్డ్ ప్రవేశపెట్టింది. అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు. సరైన సమాధానం తెలియని ప్రశ్నకు సమాధానం గుర్తించకుండా వదిలేస్తే, ఆ ప్రశ్నకు ఎలాంటి మార్కుల తగ్గింపు ఉండదు. భాషా సబ్జెక్టులు మినహా మిలిగిన అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి.
పేపర్-1 : జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్, బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లీష్
పేపర్ -2 : సంబంధిత సబ్జెక్టులో పెడగాజి
పేపర్-3 : సబ్జెక్ట్ డిసిప్లైన్ నాలెడ్జ్

సిలబస్‌పై పట్టు సాధించాలి
పిజిటి, టిపిజి పోస్టుల నియామకానికి గురుకుల బోర్డ్ నిర్థేశించిన సిలబస్‌పై పట్టు సాధించాలి. ముందుగా సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొదించుకుని, పేపర్లు, సబ్జెక్టులవారీగా పరీక్షలకు సిద్దం కావాలి. గత గురుకుల నియామకాలలో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నల సరళిని గ్రహించి, అందుకు అనుగునంగా పరీక్షలకు సన్నద్దమవ్వాలి. పేపర్-1 ప్రత్యేకంగా బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని పేర్కొన్న నేపథ్యంలో తెలుగు మీడియం అభ్యర్థులు ఆంగ్ల భాషపై కొంచెం ఎక్కువగా శ్రద్ద వహించాలి. కరెంట్ అఫైర్స్‌లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలను అధ్యయనం చేయాలి. పేపర్-2లో పెడగాజికి సంబంధించి బి.ఇడి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా అభ్యసించాలి. భాషా బోధన, అభ్యసనం ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన, విలువలు, బాలబాలికల వికాసం, భాషా విద్యా ప్రణాళిక, భాషా నైపుణ్యాలు, బోధన నైపుణ్యాలు అధ్యయనం చేయాలి. పేపర్-3లో భావనాత్మక అధ్యయనం కీలకం. అభ్యర్థులు తమ సబ్జెక్టు సిలబస్‌ను అనుసరించి ప్రాథమిక భావనలు, సూత్రాలు, నిజనీవితంలో వాటి అనువర్తనాలు అభ్యసించాలి. కవులు, రచయితలు, బిరుదులు,పురస్కారాలు, సందర్భ నేపథ్యాలు, పాత్రలు, విశేషాంశాలు, సాహిత్య ప్రక్రియలునిర్వచనాలులక్ష్యాలు అభ్యసించాలి. గతంలో జరిగిన మోడల్ స్కూల్స్, టిజిటి, పిజిటి పరీక్షల ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను లోతుగా గమనించడం ముఖ్యం.

స్వీయ మదింపు అవసరం
గురుకుల టీచర్ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎప్పటికప్పుడు స్వీయ మదింపు చేసుకోవడం అవసరం. సిలబస్‌లోని పొందుపరిచిన అంశాలను ఛాప్టర్లవారీగా మోడల్ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తూ, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అభ్యర్థులు సొంతంగా టైం చార్ట్‌ను రూపొందించుకుని అందుకు అనుగుణంగా నిరంతరం చదువుతూ ఉండాలి. సమయాన్ని వృథా చేయకుండా నిరంతరం శ్రమిస్తూ సిలబస్‌లో పొందు పరిచిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి. వీటితోపాటు సమయపాలన, నిరంతర ప్రేరణ విజయానికి చేరువచేస్తాయి. పరీక్షలకు 15-20 రోజుల ముందు వరకు అన్ని సబ్జెక్టులు అధ్యయనం చేస్తూ ఉండాలి. పరీక్షలకు సుమారు నెల ముందు నుంచి వివిధ ఇన్‌స్టిట్యూట్, సంస్థలు నిర్వహించే గ్రాండ్ టెస్ట్‌లకు హాజరుకావడం మంచిది. మాక్ టెస్ట్‌లకు హాజరుకావడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి తెలుసుకోగలుగుతారు. గ్రాండ్ టెస్టులలో పాల్గొనడం ద్వారా అభ్యర్థులు ఎవరికి వారే పరీక్షించుకోవచ్చు.
ఎం.భుజగేందర్

Comments

comments