Search
Wednesday 26 September 2018
  • :
  • :

హైకోర్టును వెంటనే విభజించండి

Joint High Court should be quickly divided

జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపండి

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి
ఇరువురు మధ్య గంటకుపైగా సాగిన భేటీ
నేటి సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీని కలవనున్న సిఎం
కోటా పెంపుపై రాజ్యాంగ సవరణ సహా గతంలో సమర్పించిన పది కీలకాంశాలను గుర్తుచేసి తక్షణ చర్యలు కోరే సూచన 

మన తెలంగాణ /న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు ను సత్వరం విభజించాలని, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర న్యాయశాఖమంత్రికి ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడి నాలుగేళ్ళయినా ఇప్పటికీ హైకోర్టు మాత్రం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగానే కొనసాగుతుందని, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును నెలకొల్పాల్సి ఉందని కేంద్రమంత్రికి వివరించా రు. తెలంగాణ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా పాత జోనల్ వ్యవస్థ విధానంలో కొత్త విధానాన్ని రూ పొందించామని, దీన్ని ఆమోదించి 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సుమారు గంటసేపు భేటీ అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ హైకోర్టు విభజన తక్షణ అవసరాన్ని, ప్రస్తుత స్థితిగతులను, గతం లో ఇచ్చిన హామీలను వివరించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకత, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాలన్నింటినీ వివరించారు. గత నెలలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో భేటీ అయిన సమయంలోనూ, అంతకుముందు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన భేటీ సందర్భంగానూ జోనల్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రధాని కార్యాలయానికి చేరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శనివారం ప్రధానితో జరిగే సమావేశం సందర్భంగా దీన్ని కెసిఆర్ మరోమారు ప్రస్తావించే అవకాశం ఉంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కోసం చొరవ తీసుకోవాల్సిందిగా రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేయడంతో పాటు శనివారం ప్రధానితో భేటీ సందర్భంగా కూడా కోరనున్నారు.

నేడు ప్రధానితో భేటీ : రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీని ఆయన నివాసంలోనే కెసిఆర్ కలవనున్నారు. గతనెల లో పది అంశాలపై చేసిన విజ్ఞప్తుల గురించి మరోమారు గుర్తుచేయనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కాస్త లోతుగానే విడమరిచి చెప్పనున్నారు. హైకోర్టు విభజన అంశంపై ప్రధానమంత్రితో చర్చించి సత్వరం విభజించాల్సిందిగా కోరనున్నారు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం, రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి అవసరమైన రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని కేటాయించడం, రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యంగ సవరణ చేయడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన సమస్యలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, రెండు రాష్ట్రాలతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చిస్తున్న విషయాన్నీ ప్రధానికి సిఎం వివరించే అవకాశం ఉంది.

ప్రధానితో ప్రస్తావించే పది అంశాలు ఇవే :
1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు వివిధ మంత్రి త్వ శాఖల నుంచి త్వరిత గతిన అనుమతులు వచ్చా యి. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు రూ.25వేల కోట్లతో పాటు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.22 వేల కోట్ల రుణం కూడా పొందాం. ఇంకా నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతనుగుర్తించి,రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించడం.

2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత జోనల్ విధానమే కొనసాగుతున్నది. ఆర్టికల్ 371 డి ఇంకా అమలవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6జోన్ల వ్యవస్థ ఉం డేది. తెలంగాణలో 5,6 జోన్లున్నాయి. మిగతావి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుచేశాం. కాబట్టి జోనల్ వ్యవస్థలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడం.

3. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల విభజన పూర్తయినా, హైకోర్టు విభజన మాత్రం పూర్తి కాలేదు. హైదరాబాద్ లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నది. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు తమ హైకోర్టు తమకుండాలని బలంగా కోరుకుంటున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి న్యాయవాదులు కూడా తమ హైకోర్టు తమకు కావాలని కోరుకుంటున్నారు.కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా హైకోర్టు విభజన పూర్తి చేస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారు. కానీ ఇంకా అమలు కాలేదు. హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే, అందులో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ వారున్నారు. 60:40 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ న్యాయమూర్తులుండాల్సి ఉండగా, అదీ అమలు కాలేదు. కాబట్టి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం.

4. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే లైన్లు జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయగలరు. అక్కన్నపేట్- మెదక్ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేడంతో పాటు భద్రాచలం రోడ్ -సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైను నిర్మించడం. కాజీపేట- విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం -మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్ -నిర్మల్- ఆదిలాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం చేపట్టడం. సికింద్రాబాద్- మహబూబ్ నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వేలైన్లను ను డబుల్ లైన్‌గా మార్చడం, హుజురాబాద్ మీదుగా కాజీపేట- కరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించడం.

5. హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరినందున ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడం. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు స్టేట్ హైవే విస్తరించడానికి అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించినందున ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుంది. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన తక్షణావసరం.

6. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సి ఉంది. కానీ, 201718 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయగలరని మనవి చేస్తున్నాను.

7. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) మంజూరు చేయడం.

8. కేంద్ర ప్రభుత్వం 2013 సంవత్సరంలో హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజన్ (ఐటిఐఆర్) మంజూరు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ కూడా సమర్పించింది. కానీ హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల ద్వారా తెలిసింది. ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించడం.

9. కరీంనగర్ పట్టణంలో ఐఐఐటి స్థాపించడం. దీనికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయి. వరంగల్‌లో నిట్ ఉంది. కరీంనగర్ నగరంలో ఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత బాగా విస్తరించినట్లవుతుంది.

10. ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. రంగారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం,కరీంనగర్,కామారెడ్డి జిల్లాల్లో మాత్ర మే ప్రస్తుతం నవోదయ విద్యాలయాలున్నాయి. మిగతా జిల్లాలయిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, యాదా ద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పగలరు. ఈ విద్యాలయాలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Comments

comments