Home మంచిర్యాల రెచ్చిపోతున్న బెల్లం మాఫియా

రెచ్చిపోతున్న బెల్లం మాఫియా

bellam

* అధికార పార్టీ నేతల అండతో అక్రమ నిల్వలు
* అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దందా
* కాగజ్‌నగర్ కేంద్రంగా ఇతర ప్రాంతాలకు తరలింపు
* దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల సామూహిక దాడులు
* మూడు రోజుల్లో 8 కేసులు, 12 మంది అరెస్టు

బెల్లం మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డూ అదుపులేకుండా బెల్లంనిల్వలు ఏర్పాటు చేస్తున్నారు. టన్నుల కొద్దీ బెల్లాన్ని తీసుకువచ్చి గోడౌన్‌లలో నిల్వ ఉంచి గుడుంబా తయారీదారులకు సరఫరాచేస్తున్నారు. గత మూడురోజుల క్రితం పెద్ద ఎత్తున బెల్లం లారీలో దిగుమతి చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లారీలో ఉన్న బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్‌నగర్ కేంద్రంగా బెల్లం వ్యాపారం జోరుగా సాగుతుంది. వివిధ ప్రాంతాల్లోని గుడుంబా తయారీదారులకు సరఫరా చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం జాతరలు, ఉత్సవాలకు సడలింపును ఇచ్చి బెల్లం విక్రయాలు జరపవచ్చునని చెప్పడం వ్యాపారులకు కలసి వచ్చింది. ఇదే అదనుగా భావించి టన్నుల కొద్దీ బెల్లాన్ని తెప్పించి అమ్మకాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున బెల్లం తీసుకురావడంతో ఎక్సైజ్ అధికారులు అడ్డగించగా వ్యాపారులకు, ఎక్సైజ్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్పకు చేరడంతో ఆయన ఆగ్రహంతో అక్కడికి వచ్చి ప్రభుత్వమే బెల్లం అమ్ముకోమంటుంది. మీరు ఎందుకు కల్పించుకుంటున్నారని ఒక దశలో ఎక్సైజ్ అధికారులపై దాడికి యత్నించారు. దీంతో వ్యాపారులు మరింత రెచ్చిపోయి బెల్లం నిల్వలను ఏర్పాటు చేసుకోగా ఎంఎల్‌ఏతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఏకమై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు అందరు కలసి కాగజ్‌నగర్ పట్టణంలోని ఒక్క దుకాణాన్ని కూడా వదలకుండా జల్లెడ పట్టి దాడులు నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న దాడుల్లో 8 కేసులు నమోదు చేసి, అధికార పార్టీ కౌన్సిలర్ ఆర్.గిరీష్‌తో పాటు 11 మందిని అరెస్టు చేశారు.  అదే విధంగా 33 టన్నుల బెల్లం స్వాధీనం చేసుకొని 35 లీటర్ల గుడుంబా, 810 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఎక్సైజ్ అధికారులు వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తూ దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఎంఎల్‌ఏతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో అధికారులు అక్కడే మకాం వేసి, దాడులు జరుపుతుండగా వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాగజ్‌నగర్ కేంద్రంగా వ్యాపారులుగా గత కొన్ని ఏళ్లుగా బెల్లంతో పాటు పటికను కూడా విక్రయిస్తున్నారు. మంచిర్యాల, కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతాలకు సైతం పటికను సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో గుడుంబా విక్రయాలు తగ్గుముఖం పట్టగా సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బెల్లం అమ్మకాలకు వెసులుబాటు కల్పించడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు భారీ నిల్వలు ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో నల్లబెల్లం విక్రయించి కేసులో ఇరుక్కున్న వ్యాపారి సైతం కేసులో ఉండడం గమనార్హం. ఏదిఏమైనా కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌ను గుడుంబా రహిత స్టేషన్‌గా మారుస్తామని ఎక్సైజ్ అధికారులు అంటుండగా మరోవైపు వ్యాపారులు పెద్దఎత్తున అధికార పార్టీ నేతల అండదండలతో నిల్వలను ఏర్పాటు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో గుడుంబా విక్రయాలను అరికట్టడం ఎక్సైజ్ ధికారులకు సవాల్‌గా మారింది.