Home జాతీయ వార్తలు తూటాలకు బెదిరేది లేదు..

తూటాలకు బెదిరేది లేదు..

jornalist

కశ్మీర్ రైజింగ్ పత్రిక ప్రతిన 

జర్నలిస్టు బుఖారీ అంత్యక్రియలు 

మొదటి పేజీ అంతా విషాద సంకేతం 

క్రీరి (జమ్మూ కశ్మీర్) : తూటాకు బలి అయిన అక్షరానికి కశ్మీర్ లోయ కన్నీటి నివాళులు అర్పించింది. శ్రీనగర్‌లో రైజింగ్ కశ్మీర్ ప్రధాన సంపాదకులు షుజాత్ బుఖారీని పత్రికా కార్యాలయం వెలుపలనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిజాలను నిర్భయంగా తన పత్రిక ద్వారా లోకానికి తెలియచేస్తూ వచ్చిన బుఖారీకి దేశ వ్యాప్తంగా ప్రముఖ జర్నలిస్టుల నుంచి పలు సం ఘాల నుంచి సంతాపాలు వ్యక్తం అయ్యాయి. కశ్మీర్‌ను ఇంతకాలం వార్తలతో మేలుకొలుపుతూ వచ్చిన రైజింగ్ కశ్మీర్ శుక్రవారం నాటి సంచిక అత్యంత విషాదభరితంగా తన పాఠకులను పలకరించింది. పత్రికను తీర్చిదిద్దుతూ వచ్చిన ప్రధాన సంపాదకుడి స్మృతి సూచకంగా పత్రిక మొదటి పేజీ పూర్తిగా నల్లటి నేపథ్యంలో ఎడిటర్ ఇన్ చీఫ్ నిలువెత్తు ఫోటోను మధ్యలో ప్రచురించింది. ఇక భోరున కురుస్తున్న వర్షం మధ్యనే బుఖారీ పూర్వీకుల స్వగ్రామం క్రీరీలో వేలాది మంది స్నేహితులు , అభిమానులు స్థానికుల సమక్షంలో అంత్యక్రియలు జరిగా యి. ఘర్షణల కాలంలో శాంతిని ఆకాంక్షిస్తూ, కశ్మీర్‌పై బాధ్యతాయుతంగా స్పందిస్తూ వచ్చిన బుఖారీ వెలువరించిన పలు సంపాదకీయాలు అన్ని వర్గాలను తట్టిలేపేవిగా నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ మొదలుకుని, దాల్‌లేక్‌ను కబ్జాదారుల కోరల నుంచి విముక్తం చేయడం. ఫేక్‌న్యూస్‌తో జర్నలిజానికి వాటిల్లుతున్న ముప్పును వార్తలతో అంతకు మించి తమ సంపాదకీయాలతో విశ్లేషిస్తూ వచ్చిన ఈ సంపాదకులు నిజాలను రాసినందుకే హత్యకు గురయినట్లుగా స్పందనలు వెలువడ్డాయి.
కాల్పుల ఘటనలో ఎడిటర్‌తో పాటు ఆయన వ్యక్తిగత అంగరక్షకులు ఇద్దరు తూటాలకు బలి అయ్యారు. సంపాదకుడు బలి అయినా పత్రిక వేకువ జామునే దూసుకువచ్చింది. పిరికిపందల చర్యలకు తాము తలొగ్గేది లేదని, తమ ఎడిటర్‌ను తమ నుంచి దుష్టశక్తులు లాక్కువెళ్లినా ఆయన సం కల్పం చెక్కుచెదరకుండా ఉంటుందని, దీనితోనే తాము అంకితభావంతో పనిచేస్తామని పత్రిక సందేశం వెలువరించింది. వృత్తిపట్ల నిబద్ధత, స్పూర్తిదాయక ధైర్యం తమ కు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎడిటర్ తమకు కాంతిపుంజంగా నిలుస్తారని తెలిపారు. నిజాలు కంటగింపుగా ఉన్నా, వాటిని వెలుగులోకి తేవాల్సిందే, అప్పుడే వాటికి పరిపూర్ణత, అంతకు మించి శాంతి సిద్ధిస్తుందనే తమ సంపాదకుడి సిద్ధాంతాలకు అనుగుణంగా ముం దుకు సాగుతామని పత్రికలో తెలిపారు. అంత్యక్రియల దశలో అక్కడ పంపిణీ అయిన పత్రికతో పలువురిలో ఉద్వేగం, ఆవేదన నెలకొంది. కశ్మీర్ లోయ నుంచి తరలివచ్చిన వేలాది జనంతో బారాముల్లా జిల్లాలోని చిన్న నిర్మానుష్యపు గూడెంలో విషాద కెరటాలు కదిలినట్లు అయింది. శ్రీనగర్‌కు అతి కొద్ది దూరంలోనే ఆయన స్వ గ్రామం ఉంది. గతంలో హిందూ పత్రిక సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేసిన బుఖారీకి పలువురు జాతీయ స్థాయి జర్నలిస్టులు, నేతలు పరిచయం ఉండటంతో వారంతా కూడా అంత్యక్రియలకు తరలివచ్చారు. మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా, పిడిపి, బిజెపి ఇతర పార్టీల నేతలు వచ్చారు. 50 సంవత్సరాల బుఖారీకి భార్య, కూతురు కుమారుడు ఉన్నారు. రంజాన్‌కు ముందు రోజే అందులోనూ ఇఫ్తార్‌కు వెళ్లుతున్న దశలోనే ఎడిటర్‌ను కాల్చిచంపడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అయింది. కశ్మీర్ లోయ లో శాంతి ప్రక్రియకు,పాకిస్థాన్‌తో సాధారణ స్థితికి మధ్య వర్తుల ప్రయత్నాలలో ఆయన కీలక పాత్ర పోషించారు.
మూడు దశాబ్దాల కశ్మీర్ హింసాకాండలో ఇప్పటికీ నలుగురు జర్నలిస్టులు తూటాలకు బలి అయ్యారు. 1991లో అల్‌సఫా ఎడిటర్ మహమ్మద్ షాబాన్ వకీల్‌ను హిజ్బుల్ ముజాహిద్దిన్‌లు చంపివేశారు. నాలుగేళ్ల తరువాత 95లో బిబిసి మాజీ కరస్పాండెంట్ యూసుఫ్ జమీల్‌పై హత్యాయత్నం జరిగింది. కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో ఎఎన్‌ఐ కెమెరామెన్ ముస్తాక్ అలీ ప్రాణాలు కొల్పొయ్యారు. 2003లో నాఫా ఎడిటర్ పర్వజ్ మహమ్మద్ సుల్తాన్‌ను ప్రెస్ ఎన్‌క్లేవ్‌లోని ఆయన కార్యాలయంలోనే హిజ్బుల్ ముజాహిద్దిన్‌లు కాల్చి చంపారు.

అనుమానితుడి అరెస్టు

ind1

శ్రీనగర్: ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్యకు సంబంధించి జ మ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. హత్య ఘటనతో ఆ వ్యక్తికి సం బంధం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ఆ వ్యక్తిని జుబె ర్ ఖాద్రీగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజి స్వయం ప్రకాశ్ పానీ తెలిపారు. అక్కడున్న సిసిటీవీ కెమెరాల వీడియోల పరిశీలనలో ఈ వ్యక్తి అనుమానాస్పద వైఖరి వెల్లడైందని వివరించారు. ఆ వ్యక్తి ఘ టనా స్థలిలో పడి ఉన్న బాడీగార్డు నుంచి పిస్టల్‌ను తీసుకుంటున్నట్లుగా వీడియోలో ఉందని వివరించారు. ఆ వ్యక్తి నుంచి పిస్టల్‌ను స్వాధీనపర్చుకున్నా రు. ఆయను విచారిస్తున్నామని ఐజి తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపినట్లు, వీటికి సెంట్రల్ కశ్మీర్ డిఐజి వికె విర్దీ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుపై దాడిని ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నామని ఐజి వివరించారు. మొత్తం నలుగురు దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నట్లు, మిగిలిన ముగ్గురి గుర్తింపు గురించి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.