Home తాజా వార్తలు గోపీచంద్ కథ వింటున్న ఎన్టీఆర్

గోపీచంద్ కథ వింటున్న ఎన్టీఆర్

9966మూడు నెలల పాటు విదేశాల్లో ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ జరుపుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి సినిమా కోసం స్క్రిప్టులు వింటున్నాడు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండే ఈ స్టార్ హీరో తిరిగి సుకుమార్ దర్శకత్వంలోని సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇందుకోసం అక్టోబర్ 15న ఎన్టీఆర్ స్పెయిన్‌కు వెళ్లనున్నాడు. అక్కడ 16 లేదా 17 తేదీలలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆతర్వాత మిగిలిన చిన్నచిన్న బిట్స్‌ని హైదరాబాద్‌లో షూట్ చేస్తారు. ఇక ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని రాసిన స్క్రిప్టును ఎన్టీఆర్ వింటున్నట్టు తెలిసింది. బలుపు, పండగ చేస్కో సినిమాల హిట్లతో దూకుడు మీదున్న గోపిచంద్ మలినేని… ఎన్టీఆర్‌కు ఓ మంచి స్టోరీ లైన్‌ను వినిపించాడు. ఎన్టీఆర్ ఓకే అంటే ఆతర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ స్వయంగా ఈ స్టోరీని డెవలప్ చేస్తాడట. దిల్‌రాజు నిర్మాతగా ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఇదివరకే సరేనన్నాడు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్, గోపిచంద్ మలినేనిల మధ్య సమావేశాన్ని దిల్‌రాజే ఏర్పాటుచేశాడు. అన్నీ ఓకే అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది.
‘షేర్’కు గెస్ట్‌గా…: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా మల్లిఖార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షేర్’. ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సినిమా ఆడియో వేడుకను అక్టోబర్ 10న నిర్వహించనున్నారు. తన సోదరుడి ఈ సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. కల్యాణ్‌రామ్‌కు జంటగా సోనాల్‌చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
మహేష్‌కు కంగ్రాట్స్…: మహేష్‌బాబు హీరోగా చేసిన ‘శ్రీమంతుడు’ ఘన విజయం సాధించి భారీ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు డైరెక్టర్ కొరటాల శివ, హీరో మహేష్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్… ‘శ్రీమంతుడు’ సినిమాను చూసి ఈ మూవీ తనకు బాగా నచ్చిందని చెప్పాడట. ఆతర్వాత వెంటనే మహేష్‌బాబుకు ఫోన్ చేసి ఇలాంటి సూపర్ ప్రాజెక్ట్‌లో నటించినందుకు కంగ్రాట్స్ చెప్పాడు