Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ పిపి నేతగా కెకె

టిఆర్‌ఎస్ పిపి నేతగా కెకె

లోక్‌సభాపక్ష సారథి నామా

లోక్‌సభలో ఉపనేతగా కొత్త ప్రభాకర్ రెడ్డి, విప్‌గా బిబి పాటిల్
రాజ్యసభలో ఉపనాయకుడు బండ ప్రకాశ్, విప్ జోగినపల్లి సంతోష్

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా డాక్టర్ కె. కేశవరావు, లోక్‌సభా పక్ష నేతగా ఖమ్మం ఎం పి నామా నాగేశ్వరావు నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. రాజ్యసభలో టిఆర్‌ఎస్ నాయకుడిగా కేశవరావు వ్యవహరించనున్నారు. తొలిసారిగా రాజ్యసభ, లోక్‌సభల్లో ఒక్కో ఉపనేత, ఒక్కో విప్‌లను నియమించారు. లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష ఉప నాయకుడిగా మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడిగా బం డ ప్రకాష్‌ను, విప్‌గా జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను నియమించారు. గతంలో లోక్‌సభాపక్ష నేత గా జితేందర్ రెడ్డి, ఉప నేతగా వినోద్ వ్యవహరించారు. వారిద్దరూ ఈసారి లేకపోవడంతో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సిఎం కెసిఆర్ ఎంపిలతో చర్చించారు. సామాజిక సమీకరణాలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కె.కేశవరావును పార్లమెంటరీ పక్ష నేతగా కొనసాగించగా, టిడిపి తరఫున లోక్‌సభా పక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉండటంతో నామా నాగేశ్వరరావుకు ఈ అవకాశం దక్కింది. ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉభ య సభల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో చర్చించారు.పార్లమెంట్ సమావేశాలకు ఎంపిలందరూ హాజరు కావాలని సిఎం కెసిఆర్ సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో రాజీలేని ప్రయత్నం చేయాలని సిఎం కెసిఆర్ ఎంపిలకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిసింది. ఇతర విషయాలలో అంశాలవారీగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాష్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, నేతకాని వెంకటేష్‌లు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన తొమ్మిది ఎంపిలు పార్లమెంట్‌లో ప్రమాణం చేయనున్నారు.

k.keshava rao elected as TRS parliamentary party leader