Home కలం కబీరు సంఘ సంస్కరణ భావాలు

కబీరు సంఘ సంస్కరణ భావాలు

Kabir-Dasభావావేశంతో మానవుని మానసిక వికాసానికి, సమాజ శ్రేయస్సు కోసం సమాజ సంస్కరణాభిలాషతో కవిత్వం చెప్పిన ఉత్తమ సంఘ సంస్కర్త కబీరు. ఆయన కవిత్వానికి మూలం సమాజం. సమాజంలోని మంచి- చెడుల తారతమ్యాన్ని విశదపరచి మంచినే గ్రహించమని బోధించాడు. సమకాలీన సమాజంలో వ్యాప్తి చెంది ఉన్న జాతి – మత విద్వేషాలను అసమానతలను అంధ విశ్వాసాలను ఖండించి అరాచకాన్ని ఎదిరించి ప్రజల్లో ప్రేమతత్వాన్ని, సద్భావనలు పెంపొందించాడు కబీరు.

కబీరు హిందీ కవుల్లో పేరెన్నికగన్న నిర్గుణ భక్త కవి. ఆయన 15వ శతాబ్దంలో జీవించి ఉన్నట్లు హిందీ సాహిత్య చరిత్ర వలన స్పష్టం అవుతుంది. ఆధునిక హిందీ విమర్శకుల అభిప్రాయం ఎలా ఉన్నా ఆనాటి మత సాంఘిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కబీరు జీవితం పైన, ఆలోచనలపైన ఎక్కువగా పడింది. ఆ పరిస్థితులే కబీరును కవిగా, మత ప్రవక్తగా సంఘ సంస్కర్తగా వేదాంతిగా మార్చాయన్న విషయం కబీరు రచనలను పరిశీలిస్తే అవగతం అవుతుంది. భాయిరే దుయి జగదీస్ కహతె ఆయే

కహు కబ్‌నే భరయాయే
అల్లా రామ్ కరీమా, కేసో హరిహజరత్ నామ్ ధరాయా
(దేవుళ్లు వేరువేరు అని ఎవరు భ్రమింప చేశారు)
ముక్తి కోసం దేవుని పేరిట తీర్థ యాత్రలు చేయడం మూర్ఖం. భగవంతుడు దేవాలయంలోగాని, మసీదుల్లోగాని లేడు. భగవంతుని స్థిర చిత్తంతో వెదికితే అతడు ఒక్క క్షణంలో దర్శనం ఇస్తాడు.
“నామై దేవల్ నామై మసజిద్ నామై కైలాస్
నాతో కౌన్ క్రియ కర్మమ్ నహీయోగ్ వైరాగ్ మే”

అంతరంగంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకోలేక కస్తూరీ మృగమువలే వెదుకులాడిన ఏమీ ఫలం?” అంటాడు కబీరు.
“తేరా సాయి తఝమెజ్యోం పుహ ఏన్ మే వాస్

కస్తూరీ కామిరగ్ ఫెరిఫెరి డూండై ఘాస్‌” దేవుని పేరిట సాగే వ్రతాలు, పూజలు, జపతపాలు ఆచార వ్యవహారాలన్నీ మిథ్య” అంటారు కబీరు.
“హరి జిన్ ఝాఠై సబ్ వ్యవహార్
ఝా ఠా జప్‌తప్‌”

ఏకేశ్వర వాదాన్ని నిర్గుణ బ్రహ్మ సిద్ధాంతాన్ని మిళితం చేసి నిర్గుణ సంత్ పంథ్ అని క్రొత్త మత సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. అదే కబీరు సహజ మతంగా ప్రసిద్ధి చెందింది. “దేవుడు ఒక్కడే! అతడి వేర్వేరు పేర్లే అల్లా, రామ్, కరీం, ఇద్దరు దేవుళ్లు ఎక్కడ నుంచి వచ్చారు” అని కబీరు హిందువులను, మహమ్మదీయులను ప్రశ్నించాడు.

కబీరు నాటికి హిందూ సమాజంలో కులతత్వం రాజ్యం చేస్తూ ఉండేది. అగ్ర కులం వారు నిమ్న కులం వారిని దేవుని పేరిట – మతం పేరిట అణిచివేస్తూ ఉండేవారు. ప్రబలిపోతున్న కుల విభేదాలను, అంటరానితనాన్ని సునిశితంగా విమర్శించాడు కబీరు.
“ఏక్ జ్యోతిసే సబ్ ఉత్పన్నా
కౌన్ బ్రహ్మన్ కౌన్ సూద్రా?”

(ఒకే జ్యోతి నుండి జన్మించిన వారిలో ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు?)
“వక్తి కులం కంటే గుణం ప్రధానం. పెద్ద కులంలో పుట్టినంత మాత్రాన చేతలు గొప్పగా ఉండవు” అన్నాడు కబీరు.
“ఊంచే కుల్‌కా జనమియా కరణే ఊంచ్ నహోయ్‌”
“వ్యక్తి గుణాన్నే ప్రశ్నించాలిగాని కులాన్ని ప్రశ్నించడం వెర్రితనం” అన్నాడు కబీర్.
“జాతిన పూఛో సాధుకే పూచ్ లీజియే జ్ఞాన్ మోల్ కరో తలవార్ కా పడా రహన్ దో మ్యాన్‌”
సాధు పురుషుల జాతికంటే జ్ఞాన సారాన్ని గూర్చి తెలుసుకోవడమే ఉత్తమం.

హిందువుల విగ్రహారాధనను కబీరు వ్యతిరేకించాడు. “భగవంతుడు అవతారాలను ధరించడం అబద్ధం, అది పురోహితుల కట్టు కథ” అన్నాడు కబీరు.
“పాహన్ పూజై హరిమిలై మైపూజూం పహార్
తాతే యా చాకీ భలీపేస్ భాయ్ సంసార్‌”
(రాళ్లను పూజించినంత మాత్రాన దేవుడు ప్రసన్నుడయితే నేను పర్వతాన్నే పూజిస్తాను. రాయి అయిన దేవుని కంటే పది మందికి సరిపడే పిండి తిరుగలి రాయి శ్రేష్టం)

తీర్థ ప్రదేశాల్లో దేవుని పేరిట శిరో ముండనం చేసుకోవడాన్ని కబీరు హేళన చేశాడు. భగవంతునికి కావలిసింది ఆత్మ సమర్పణగాని, ఆడంబరం కాదని కబీరు చెప్పాడు.

“కేసోం కహా బిగాడియా జో మూండై సౌ బార్ /మన్ కా కాహేన్ మూడియై జాయై విషై వికార్‌”
(వెంట్రుకలు ఏం పాపం చేశాయని వందల సార్లు ముండనం చేయించుకుంటారు, మనస్సులోని విషయ వాంఛలకు చేయించరాదా ముండనం!)
హిందువుల ఆచార వ్యవహారాలను ఖండించినట్లే కబీరు మహమ్మదీయుల మూఢ నమ్మకాలను ‘నమాజ రోజా విధానాన్ని సునిశితంగా విమర్శించి వ్యతిరేకించాడు.

“దిన్ మే రోజా రఖ్‌తాహై రాత్ హనత్ హైగాయ్/ హిరదే కపట్ మిలై క్యోం సాయి క్యా హజ్ కాబే జాలే”
(మనస్సు మలినంగా ఉంచుకొని ఉపవాసం చేస్తే ఏం లాభం? హృదయంలో కపటం ఉంచుకొని రోజా చేసినా, హజ్, కాబా సందర్శించినా, అల్లా అనుగ్రహిస్తాడా?)

ఈ విధంగా కబీరు సమాజ శ్రేయస్సును కాంక్షించి, సంఘ సంస్కరణాభిలాషతో తమ జీవిత కాలంలో ఉద్యమించాడు. సమాజంలో పాతుకుపోయిన జాతి, మత విద్వేషాలను బాహ్యాడం బరాలను విగ్రహారాధనను, మూఢ నమ్మకా లను వ్యతిరేకించి తమ కవిత్వం ద్వారా సంఘ సంస్కరణ భావాలను ప్రచా రం చేసి ప్రజల్లో ప్రేమ తత్వాన్ని , సామర స్యాన్ని పెంచుకోవడం కోసం కబీరు కృషి చేశారు. ప్రజల కోసం వారి భాషలోనే కవిత్వం చెప్పారు. సమాజం కోసం దాని శ్రేయస్సు కోసం కవిత్వాన్ని సాధనంగా చేసు కొని కవిత్వం చెప్పిన కబీరు గొప్ప సంఘ సంస్కర్త” అని అనడం అతిశయోక్తి కాదు.

Dr.YVSSN మూర్తి

9701026727