Home తాజా వార్తలు గోదావరికి వరద

గోదావరికి వరద

కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత 

ఎగువ నుంచి భారీగా నీరు

ఆదిలాబాద్ జిల్లాలో ముంపు

Kaddam

మన తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తుండగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొం డ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.
గోదావరికి జలకళ : భారీవర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. నిన్నటి వరకు ఇసుక తిన్నెలతో వెలవెలబోయిన గోదావరి తీరం ఇప్పుడు ఎర్రటి నీటితో నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతుండటంతో పాటు వాగులు, వంకల్లో నుండి గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు సుమారు 5 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 15 అడుగులకు చేరుకుంది. గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రాజమండ్రి నుండి లాంచీలను తెచ్పించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అదే విధంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో గల వాగులు, వంకలు నీటితో నిండుకున్నాయి. కాకతీయ చెరువుల్లో సైతం పెద్ద ఎత్తున నీరు చేరింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ప్రాంతాల్లు నీరు అలుగులు పారుతున్నాయి. గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధర్మపురి వద్ద గోదావరి నదిలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గత ఎప్రిల్ మాసం నుండి గోదావరి నది పూర్తిగా ఎండి పోయి శని వారం వరకు భక్తులు స్నానాలకు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ధర్మపురి క్షేత్రానికి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి నీరు వచ్చి చేరుతుంది. ధర్మపురి క్షేత్రం వద్ద ఆదివారం సాయంత్రం వరకు శివ పంచాయతనం చుట్టూ నీరు ప్రవహిస్తున్నది. దీంతో క్షేత్రానికే వచ్చే భక్తుల స్నానాలకు ఇబ్బందులు తప్పాయి.
కడెంలో 17వ గేటు ఎత్తివేత: ఆదిలాబాద్‌లోని కడెం ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరిగి జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరుద నీరు వచ్చి చేరడంతో రాత్రి సమయంలో 17వ నెంబర్ గేట్ ద్వారా నీటిని వదిలారు. కడెం పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.575 అడుగులుగా నమోదు అయింది. ఎగువ నుండి భారీగా వరుద నీరు రావడంతో 518 క్యూసెక్యూల నీరు వచ్చి చేరుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లోతట్టు ప్రాంతాలలో పంట చేలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో అత్యధికంగా 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా వరద నీరు రావడంతో కుంటాల జలపాతం వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతుండగా, జలపాతం అందాలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చుతున్నారు. సాథ్‌నాల ప్రాజెక్టు సాధారణ పూర్తి స్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 285.80గా ఉంది. మత్తడి వాగు పూర్తి స్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 274.400 మీటర్లుగా ఉండగా, ఇన్‌ఫ్లో 1017.59 క్యూసెక్కులు నమోదవుతోంది. మంచిర్యాల, కుమరం భీం అసిఫాబాద్ జిల్లాల్లో గత మూడు రోజులుగా వానలు ముంచెత్తుతుండడంతో దాదాపు 60 గ్రామాలకు రవాణ సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోగా, వాగుల్లో వరదల ప్రవాహం తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం సైతం భారీ వర్షాలు కురియడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూలిపోగా, వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో గ్రా మాలు ఆంధకారమయ్యాయి. జిల్లా సరిహద్దుల్లోని ప్రాణహిత నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు జలుల్లు నల్లగొండ రైతులను కొంత సంతోషాన్ని, మరికొంత దు:ఖాన్ని కలిగిస్తున్నాయి. రైతులు దుక్కులకు దున్నుకొని సిద్దంగా ఉన్న వారు పత్తి విత్తనాలు నాటుతుండగా, మిగిలిన రైతాంగం దుక్కులు దున్నుకునే పనుల్లో నిగమ్నమయ్యారు. దీంతో ఇంతకాలం మందకోడిగా సాగిన ఖరీఫ్ సాగు, ప్రధానంగా పత్తిపంటల సాగు రెండు రోజుల పాటు కురిసిన ఓ మోస్తారు వర్షాలతో ఊపందుకోనుంది. ఇదిలా ఉండగా మరో 4రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశమున్నం దున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.