Home వరంగల్ తెలంగాణ పథకాలు దేశానికే మార్గదర్శకాలు

తెలంగాణ పథకాలు దేశానికే మార్గదర్శకాలు

Kadiyam Srihari Speech About TS Goverment Schemes

మన తెలంగాణ/వరంగల్ అర్భన్ జిల్లా ప్రతినిధి : వ్యవసాయరంగం పురోభివృద్ధికి రైతాంగ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హన్మకొండ విష్ణుప్రియ గార్డెన్స్‌లో రైతు సమన్వయ సమితి సభ్యులకు, వ్యవసాయ శాఖ అధికారులకు రైతుబంధు, జీవిత బీమా పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో డిప్యూటీ సిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగలా చేయడం కోసం రైతాంగాన్ని బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి ఇటీవల రూపొందించిన రైతుబంధు పథకాన్ని గత మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు అమలు చేయడం జరిగిందన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం చేపట్టిన పలు సంస్కరణలను ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని అనంతరం ప్రధానమంత్రితో సహా పలువురు ముఖ్యమంత్రులు మన ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాల పట్ల ముఖ్యమంత్రిని అభినందించారని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతాంగానికి అత్యధిక రాయితీలు కల్పిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమన్నారు.

రైతు జీవిత భీమా ముఖ్యమంత్రి మానసపత్రిక అని ఈ అంశంపై ఈ నెల నాలుగవ తేదీన ముఖ్యమంత్రి హైద్రాబాద్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో రైతు సమన్వయ సమితి జిల్లా స్థాయి కో ఆర్డినేటర్లు తదితర సంబంధిత అధికారులతో రైతు జీవిత భీమా సాధ్యాసాధ్యాలపై, విధి విధానాలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్ధేశం చేయడం జరిగిందని తదనుగుణంగా జిల్లా స్థాయిలో రైతు సమన్వయ సమితి సభ్యులందరికీ రైతు జీవిత బీమాపై అవగాహన కల్పించటానికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాల వయస్సు నుం డి 60 సంవత్సరాల వయస్సు కలిగి పట్టాదార్ పాసు బుక్ కలిగిన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. రైతు తరపున ప్రభుత్వమే ఒక సంవత్సరానికి రూ.2271-00లు ఇన్సూరెన్స్ సంస్థను ప్రీమియం చెల్లిస్తుందని వచ్చే సంవత్సరం 2019 ఆగస్టు 14వ తేదీ వరకు దీని గడువు వుంటుందని అనంతరం ఆగస్టు 15వ తేదీన మళ్లీ ప్రభుత్వం రైన్యూవల్‌గా ప్రతీ రైతుకు సంబంధించిన ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. ఇందుకు ప్రధానంగా వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి రైతు ఇంటికి వెళ్లి నిర్ధేశించిన ప్రొఫార్మాలో రైతు యొక్క నామినీ పేరు, ఆధార్‌కార్డు నెంబర్, సెల్ నెంబర్ వివరాలను పొందుపరచాలని ఈ ప్రక్రియ ఈ మాసాంతానికి పూర్తి చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం మొత్తం రైతాంగానికి సంబంధించి ఇన్సూరెన్స్ సంస్థకు ప్రీమియం చెల్లిస్తుందని ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రిచే రైతు జీవిత భీమా బాండ్లను రైతులకు అందజేసే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందని అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భీమా బాండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఒక వేళ దురదృష్టవశాత్తు రైతు మరణానికి గురైతే 10 రోజులలోగా సంబంధిత రైతు నామినీకి రూ.ఐదు లక్షల భీమా సొమ్మును చెక్కు రూపంలో అందజేయడం జరుగుతుందని ఇందుకుగాను స్థానిక గ్రామ పంచాయితీ సెక్రటరీ రైతు మరణించినట్లు దృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుందని అతడు జాప్యం చేసినా, ఇన్సూరెన్స్ సంస్థ జాప్యం చేసిన ప్రభుత్వం ద్వారా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ రైతు జీవిత భీమా పథకం వలన రాష్ట్రంలోని 55 లక్షల 40 వేల మంది సన్నకారి రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 5,34,969 రైతులకు పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని అదే విధంగా 1,54,132 మందికి భీమా ప్రక్రియ కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు. రైత సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్, నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆశయంతోనే రైతు భీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, రైతాంగ సంక్షేమమే ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలోని 2638 క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ జరుగుతుందని తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్‌నాయక్ రైతు బంధు పథకం ద్వారా తనకు మంజూరైన రూ.50, 700 ల చెక్కును ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన, సాంస్కృతిక శాకమంత్రి ఆజ్మీరా చందులాల్, రాజ్యసభ్యులు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, చైర్మన్లు రాజయ్య యాదవ్, గాంధీనాయక్, వాసుదేవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్లు ఆమ్రాపాలి కాటా, యం.హరిత, వ్యవసాయ శాఖ అధికారులు ఉషాదయళ్, ఆర్డీవోలు మహేందర్ జి, జి.రవి తదితరులు పాల్గొన్నారు.