Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) కాయ్ రాజా కాయ్

కాయ్ రాజా కాయ్

శివారు పల్లెల్లో పందెపు కోళ్లు సిద్ధం
బడాబాబుల ఫాంహౌజ్‌లే అడ్డాలుగా పోటీలు
ఎస్‌ఒటి దాడులు చేసేవరకు స్థానిక పోలీసుల మౌనరాగం

HEN

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రాలో ప్రతి సంవత్సరం నిర్వహించే కోడి పందాల సంస్కృతి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సైతం పాకింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. ఆంధ్రాలో నిర్వహించే కోడిపందాలకు తెలంగాణ నుంచి ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రజలు తరలిపోయి కోడి పందాలు ఆడుతుండటంతో పాటు లక్షల రూపాయలు అక్కడ వెచ్చిస్తున్నారు. అంధ్రా కోడి పందాలను తెలంగాణలో సైతం నిర్వహించి అడ్డగోలుగా సంపాదించుకో వాలన్న లక్షంతో గత రెండు సంవత్సరా లుగా రంగారెడ్డి జిల్లా పరిధిలో గల పలు ఫాంహోజ్‌లు, రిసార్టులలో సంవత్సరం ముందు నుంచే పందెపు కోళ్లను పెంచుతు న్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ఫాంహౌజ్‌లలో ఇప్పటికే పందెపు కోళ్ళు సిద్ధంగా ఉన్నాయని రాజ కీయ నాయకుల కనుసైగలలో పందాలు కాయడానికి చూస్తున్నట్లు ప్రచారం జరుగు తుంది.

సంక్రాంతి వరుస సెలవు దినాలలో అధికారుల కళ్ళుకప్పి పందాలు నిర్వహించ డానికి రహస్య ప్రాంతాలను ఎంచుకుని తతంగం నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగు తుంది. స్థానిక పోలీసులు కొంత వరకు దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నా ఎస్‌ఒటి పోలీసులు నిర్వహిస్తున్న దాడులతో కొంత వరకు ప్రతిష్టంభన ఉన్నా చివరి నిమిషంలో అంతా సర్దుకుంటుందని సమాచారం. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్, దుండిగల్ , మేడిపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయన్న ప్రచారంతో రాచకొండ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఘట్‌కేసర్ మండలంలో శుక్రవారం నాడు ఎస్‌ఒటి పోలీసులు నిర్వహించిన దాడులలో 20 కోళ్లు పట్టుబడినా ఇలాంటి స్థావరాలు పదుల సంఖ్యలో మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, మొయినాబాద్, కొత్తూర్, ఫరూఖ్‌నగర్, కందుకూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, గండిపేట్ మండలాలతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాంహౌజ్‌లు, రిసార్టులతో పాటు పలు ఇతర రహస్య ప్రాంతాలలో పెద్ద ఎత్తున పందాలు కోళ్లను పెంచుతున్నట్లు వాటితో సంక్రాంతి పండుగ సమయంలో పోటీలు నిర్వహించి అడ్డగోలుగా దంచుకోవడానికి చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
బడాబాబుల ఫాంహౌజ్‌లే అడ్డాలుగా…
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని పలువురు బడానేతలు, అధికారుల ఫాం హౌజ్‌లలో గత కొంత కాలంగా పందెపు కోళ్లను పెంచుతున్నట్లు ప్రచారం జరుగు తుంది. కొంత మంది  కూలీలు సైతం పండుగ సమయంలో పందేపు కోళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోళ్లను పెంచుతున్నారు. విశ్వసనీయ వర్గాలతో సమాచారం మేరకు ఆంద్రాలో నుంచి ఇటివల కాలంలో పెద్ద ఎత్తున కోళ్లను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఎస్‌ఓటి పోలీసులు గత 10 రోజుల నుంచి నిర్వహించిన దాడులలో కుషాయిగూడ, యాచారం, మీర్‌పేట్, హయత్‌నగర్ తదితర ప్రాంతాలలో 123 వరకు కోళ్లతో పాటు వాటి నిర్వాహకులను ఆదుపులోకి తీసుకున్న చాలా ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారంతో దాడులు నిర్వహిస్తుండటంతో చాలా మంది ఇప్పటికే రహస్య ప్రాంతాలకు వాటిని తరిలించి సంక్రాంతి పండుగ సమయంలో బయటకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోడి పందేపు రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటికి సహకరిస్తున్న వారిపై సైతం వేటు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఎస్‌ఓటి దాడులు చేసేవరకు…
పందేపు కోళ్ల పెంపకంతో పాటు పోటిలకు సిద్దం అవుతున్నవారిపై ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించేవరకు స్థానిక పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాచకొండ, సైబారాబాద్ పరిధిలో గత పది రోజులుగా ఎస్‌ఓటి పోలీసులు దూకుడుగా దాడులు నిర్వహిస్తున్నారు. తమ పోలీసు స్టేషన్ పరిధిలో కోళ్ల పందేళ్లతో పాటు వాటిని పెంచుతున్న వారి వివరాలు స్థానిక పోలీసులకు తెలియకుండా జరిగే అవకాశాలు చాలా తక్కువ. స్థానికుల అండదండతోనే కోడి పందేళ్లు నిర్వహిస్తున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కావలసిన వారికి నజరానాలు సైతం అప్పగించడానికి నిర్వహకులు సిద్దంగా ఉండటం వలన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఓటి దాడులు చేసి పట్టుకునేంతవరకు స్థానిక పోలీసులు స్పందించకపోవడంపై ఉన్నతాధికారులు ఇప్పటికే క్రింది స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వారిలో మార్పు రావడం లేదు.