హైదరాబాద్ : ఉమ్మడి ఎపి మాజీ సిఎం, దివంగత నటుడు ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టిఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టిఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఎన్టిఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పాత్రలో హీరో దగ్గుబాటి రానా, చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి పాత్రలో మంజిమో మోహన్, అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్‌లతో పాటు ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత హెచ్‌ఎంరెడ్డి పాత్రలో కైకాల నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్‌టిఆర్‌కు డూప్‌గా కైకాల సినిమారంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 1949 జులై 5న ఎన్టిఆర్ తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఇదే రోజు ఎన్టిఆర్ బయోపిక్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎన్టిఆర్ తొలిసారి సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.