Home రాష్ట్ర వార్తలు రాష్ట్రమంతటా కాళేశ్వరం సంబురాలు…

రాష్ట్రమంతటా కాళేశ్వరం సంబురాలు…

Kaleshwaram project

 

రేపు ప్రాజెక్టు ప్రారంభ సందర్భంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పండుగ చేసుకోవాలి : కెసిఆర్

మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు సంబురాల్లో పాలుపంచుకునేలా చూడండి : టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామా ల్లో, నగరాలు, పట్టణాల్లో సంబురాలు నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే తెలంగాణ భవన్ పక్కన నూతనంగా నిర్మిస్తున్న క్యాంటీన్, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీజ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారని, కాళేశ్వరం ప్రారంభోత్సవం పండుగలా జరగాలని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు సంబరాలలో భాగస్వా మ్యం అయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.

27న మరోసారి భేటీ

ఈ నెల 27న ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ రాష్ట్ర కమిటీతో పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. అదే రోజు నుంచి నెల రోజుల పాటు టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. గత ప్లీనరీకి ముందు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించామని, ఆ తర్వాత వరుస ఎన్నికలు రావడంతో సభ్యత్వ నమోదు చేపట్టలేదని, ఈ సారి ప్రతి జిల్లాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించి ఆ తర్వాత ప్రతి గ్రామంలో కమిటీలను నియమించాలని సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. త్వరలోనే టిఆర్‌ఎస్ కమిటీల నియామకం చేపడతామని సిఎం కెసిఆర్ చెప్పినట్లు తెలిసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులను నిర్వహించాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

దసరా నాటికి పార్టీ కార్యాలయాలు

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పార్టీ నేతలకు సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ నెల 24న జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ చేసి, దసరా నాటికి జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు పూర్తి కావాలని తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ నిధుల నుంచే పార్టీ కార్యాలయాల నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 19.20 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్కో జిల్లాలో టిఆర్‌ఎస్ భవనానికి రూ.60 లక్షలు కేటాయించారు. ఖమ్మంలో ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించామని, మిగతా జిల్లాల్లో దసరా రోజు ప్రారంభించేలా వేగంగా కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది.

పార్టీ కార్యాలయాల ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు టిఆర్‌ఎస్ కార్యవర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడిండారు.

Kaleshwaram Inauguration Ceremonies across State