Home తాజా వార్తలు గిన్నెస్ రికార్డు దిశగా కాళేశ్వరం

గిన్నెస్ రికార్డు దిశగా కాళేశ్వరం

Kaleshwaram Project

 

ఈ నెలాఖరులో భారీ స్థాయిలో కాంక్రీటు పనులు
దరఖాస్తు చేసిన ఎల్ అండ్ టి సంస్థ

హైదరాబాద్: సిమెంటు కాంక్రీట్ పనుల్లో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెలాఖరులో మరో భారీ రికార్డును సొంతం చేసుకోబోతోంది. గిన్నెస్ రికార్డుతో పాటు లిమ్కా రికార్డును సాధించేలా ఇప్పటికే ఆ రెండు సంస్థలకు ఎల్ అండ్ టి సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు 24 గంటల వ్యవధిలో 24 వేల ఘనపు మీటర్ల మేర సిమెంటు కాంక్రీటు పనులను మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర చేపట్టేలా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 7,212 ఘనపు మీటర్ల కాంక్రీటు పనులతో రికార్డును సృష్టించిన కాళేశ్వరం గత నెల 23న 24 గంటల వ్యవధిలో 16,722 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేసి మరో రికార్డును సృష్టించింది. ఈసారి వాటిని అధిగమించే తీరులో రికార్డు స్థాయి ప్రయత్నాలు మొదలయ్యాయి. “తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెల 24న పనులు మొదలుపెట్టాలా లేక 25వ తేదీనా అనేదానిపై నిర్ణయం ఇంకా జరగలేదు. 24 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు పనులు అని అనుకుంటున్నాం. కానీ ఎల్ అండ్ టి సంస్థ ఇంజినీర్లు మాత్రం పాతిక వేల ఘనపు మీటర్ల వరకు సాధించవచ్చు అనే ధీమాతో ఉన్నారు. వచ్చే వారంలో దీనిపై స్పష్టత వస్తుంది” అని ఒక అధికారి వివరించారు.

ఈ నెల చివరి వారంలో మాత్రం రికార్డు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఇటీవల సృష్టించిన రికార్డు గురించి ఆ అధికారి ప్రస్తావిస్తూ, అది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీటు పనులకు వచ్చిన గుర్తింపు అని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టించిన రికార్డులుగానీ, ఇకపైన సృష్టించబోయే రికార్డుగానీ ‘రీ ఇన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్’ (ఆర్‌సిసి) పనులకు సంబంధించినది అని వివరించారు. ఈ రికార్డు సృష్టించాలంటే కనీసంగా పది రోజుల ముందు నుంచే కసరత్తు ప్రారంభం కావాల్సి ఉంటుందని, కాంక్రీటును కలిపే యంత్రాలు, బూమ్ ప్లేసర్లు, ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులతో పాటు సిమెంటు, కంకర, స్టీలు తదితరాలన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరాల్సి ఉంటుందని ప్రాజెక్టు వ్యవహారాలు చూస్తున్న ఇంజనీర్ ఒకరు వ్యాఖ్యానించారు. గత నెల మూడవ వారంలో సాధించిన రికార్డుకు అవసరమైన ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకుని దానికంటే ఎక్కువ మొత్తంలో ఈసారి తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గిన్నెస్ ప్రతినిధుల సమక్షంలో పనులు :
గత నెల 22 నుంచి జరిగిన 24 గంటల సిమెంటు కాంక్రీటు పనుల్లో 1.21 లక్షల బస్తాల సిమెంటు (6238 టన్నులు)ను, 1,070 టన్నుల స్టీల్ (ఇనుము)ను, 15,384 ఘనపు మీటర్ల కంకరను వినియోగించి 16,722 ఘనపు మీటర్ల సిమెంటు కాంక్రీటుతో పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇరవై బూమ్ ప్లేసర్లను, 120 ట్రాన్సిట్ మిల్లర్లను, 8 కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లను ఇంజనీర్లు వినియోగించారు. దీనికి తోడు ఇంజనీర్లు, స్కిల్డ్ వర్కర్లతో కలిపి మొత్తం 4824 మంది కార్మికులు పనిచేశారు. సగటున ప్రతీ గంటకు 870 ఘనపు మీటర్ల చొప్పున సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయ్యియి. ఈ నెల చివరి వారంలో లక్ష్యాన్ని పాతికవేల ఘనపు మీటర్లుగా నిర్దేశించుకున్నందువల్ల కనీసంగా 8,800 టన్నుల సిమెంటును, 22 వేల ఘనపు మీటర్ల కంకర, 1600 టన్నుల మేర ఇనుమును వాడడంతో పాటు యంత్ర సామాగ్రిని కూడా అదనపు సంఖ్యలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

కార్మికుల సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న యంత్ర సామాగ్రిని అక్కడికి తరలించడంతోపాటు కాంక్రీటుకు అవసరమైన ముడి పదార్ధాలను కూడా తరలించే పని ప్రారంభమైంది. ప్రతీ మూడు గంటలకు ఒకసారి చొప్పున మొత్తం ఎనిమిది దశల్లో కాంక్రీటు పనుల్లో సాధించిన ప్రగతిని గిన్నెస్ రికార్డు సంస్థ ప్రతినిధులు విశ్లేషిస్తారు. మొత్తం 24 గంటల వ్యవధిలో సాధ్యమైన పనిని లెక్కిస్తారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 31,800 ఘనపు మీటర్ల రికార్డు ‘ప్లెయిన్ కాంక్రీటు’ విభాగంలో లభించినదికాగా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం అది ‘రీ ఇన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్’ విభాగానికి చెందినది. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ సుధాకరరెడ్డిలతో పాటు ఎల్ అండ్ టి ప్రతినిధులు సమన్వయంతో ఈ నెలాఖరు పనుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Kaleshwaram Lift Irrigation Project Sets Many Records

Related Images: