Home తాజా వార్తలు కాళేశ్వరంలోకి కడెం

కాళేశ్వరంలోకి కడెం

Kadem Projectకడెం నదికి ఏటా వరద
మిడ్ మానేరుకు మళ్లింపే లక్షం
సిద్ధంగా నంది
మేడారం పంపులు…
మిగతా పనుల పూర్తిపై అధికారుల కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్: కడెం నుంచి వచ్చే వరదను ఎల్లంపల్లి మీదుగా మళ్లించి, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తొలకరి వర్షాలతో కడెం రిజర్వాయర్ నిండడం సాధారణమే. తదుపరి వచ్చే వర్షపు నీళ్లన్నీ గోదావరిలో కలిసి, ఎల్లంపల్లి వద్ద నిల్వ అవుతాయి. మేడిగడ్డ వద్ద గోదావరి నది నుంచి ప్రాణహిత నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పంతోనే ప్రాజెక్టును ప్రభుత్వం రీడిజైన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ గ్రావిటీతో ఎగువ నుంచి వచ్చే నీటిని సైతం దిగువకు వెళ్లకుండా ఒడిసిపడుతూ అనుకూలంగా మార్చుకునే సౌలభ్యం రీడిజైన్‌లో ఉంది.

కడెంకు దాదాపుగా ప్రతి ఏటా వరదలు రావడం సాధారణమైంది. కడెం నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లికి ఎగువన గోదావరి నదిలో కలుస్తుంది. ఫలితంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచే నీటిని నందిమేడారంలోని పంపుహౌజ్ (ప్యాకేజీ 6), తర్వాత జంట సొరంగాలు (ప్యాకేజీ 7), లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ (ప్యాకేజీ 8) మీదుగా వరద కాలువలో పోసి, మిడ్ మానేరుకు మళ్లించే సౌలభ్యం ఉంది. దీనికి తోడు శ్రీరాంసాగర్ అధికంగా నీరు వస్తే వరద కాలువ ద్వారా నేరుగా మిడ్ మానేరుకు తరలించవచ్చు. అయితే కడెం వరద కోసం ఇరిగేషన్ శాఖ యంత్రాంగం, ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. ఎల్లంపల్లికి ఎగువ నుంచి నీరు వస్తే దిగువ నుంచి ఎత్తిపోసే అవసరం తగ్గుతుంది. గోదావరి నదిపై ప్రాణహిత నది సంగమం తర్వాత కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయితే బ్యాక్‌వాటర్ పూర్తిస్థాయిలో నిలుస్తాయి. దీంతో కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద దండిగా నీరు లభిస్తుంది. కన్నెపల్లి వద్ద ఎత్తిపోస్తే నీరు గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజికి చేరుతుంది. అన్నారం పంపుహౌజ్ వద్ద నీటిని ఎత్తిపోస్తే, సుందిళ్ల బ్యారేజికి నీరు చేరుతుంది. సుందిళ్ల పంపుహౌజ్ వద్ద ఎత్తిపోస్తే నీరు నేరుగా ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు చేరుతుంది. కడెం నీరు వస్తే, ఈ మూడు దశల ఎత్తిపోతలు తగ్గుతుంది. కడెం వరద రాని పక్షంలో మేడిగడ్డ నుంచి రివర్స్ ఎత్తిపోతల తప్ప దు. మూడు, నాలుగేళ్లలో ఒకసారి శ్రీరాంసాగర్‌కు పెద్ద ఎత్తున వరద రావడం ఆనవాయితీగా జరుగుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 6లో నందిమేడారం వద్ద రెండు పంపుల వెట్ రన్ విజయవంతంగా ముగియడంతో ఇరిగేషన్ శాఖ సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో మరో రెండు పంపులు వెట్న్ పూర్తిచేస్తామని అధికారులు విశ్వాసంగా ఉన్నారు. మూడు పంపుల బిగింపు పనులు కూడా ఈ ఖరీఫ్‌లోపు పూర్తిచేసి, నీటిని లిఫ్టు చేస్తామని ధీమాగా ఉన్నారు.

మే 15వ తేదీ లోపు ప్యాకేజీ 7లో మిగిలిన పనులు పూర్తిచేసి, లైనింగ్ పూర్తిచేయాలని గడువువిధించారు. 15వ తేదీ తర్వాత ప్యాకేజీ 7లోని జంట సొరంగాలలో ఏ క్షణం నీరు పారించినా, అందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఓ వారం రోజులు, అటూ ఇటూగా నీరు పారడానికి సిద్ధంగా సొరంగాల పనులు పూర్తిచేస్తామని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఇవి పూర్తయితే ప్యాకేజీ 8 లో బాహుబలి పంపులు వెట్న్ చేస్తారు. ఇప్పుడు పంపులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే పనులు లక్ష్మీపూర్ పంపుహౌజ్‌లో వేగంగా జరుగుతున్నాయి.