Home తాజా వార్తలు కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీరు

కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీరు

Harish-Rao

మన తెలంగాణ/కామారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డికి వచ్చిన మ్రంతి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణంకోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పాజెక్టుల నిర్మాణాలకు ఎంత వ్యయమైనా వెనుకాడమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందిస్తామన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టేవారని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణంతో వలసలను నియంత్రించడం జరిగిందన్నారు.

ఒకప్పుడు మహబూబ్‌నగర్ నుంచి వలసలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం వలసలను నివారించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో వలసలను పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవ పనులు చురుగ్గా సాగుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. వరద కాలువల ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీటి కేటాయింపునకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాణహిత, చేవెళ్ల పథకం కాంగ్రెస్ నాయకులకు కాసుల వర్షాన్ని కురిపించిందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి మండలం టేక్రియల్ గ్రామంలోని వడ్లూర్‌ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు రూ.64 కోట్లను మంజూరు చేసినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇక్కడ బోటింగ్, పార్కు అభివృద్ధి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.