Home కలం గాంధీజీతో కాళోజీ

గాంధీజీతో కాళోజీ

స్వాతంత్య్రానంతరం అధికార వర్గాలలో గాంధీజీ సిద్ధాంతాలు నిరాదరణకు గురవుతూ వచ్చాయి. కాళోజీ వంటి నిజమైన గాంధేయ వాదులకు ఈ పరిణామం ఎంతో ఆవేదనకు గురి చేసింది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షానకాక కమ్యూనిస్టు పార్టీ పక్షాన కాళోజీ పోటీ చేసి వుంటే తప్పకుండా గెలిచి వుండేవాడు. కాని గాంధీ సిద్ధాంతాల పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయాడు. కాళోజీ ‘నా గొడవ’లో గాంధీ తాత్వికత అంతర్లీనంగా ఉన్న కవితలు చాలా కనిపిస్తాయి. అయితే సూటిగా గాంధీని సంబోధిస్తూ రాసిన కవితలు పదిదాకా ఉన్నాయి.

                        Gandhi-vs-Kaloji

ఎన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలు తత్వశాస్త్రంలో చోటు చేసుకుంటున్నా, మరెన్ని వాదోపవాదాలను, చర్చా గోష్ఠులను విభిన్న సామాజిక రంగాల్లో నిర్వహించుకుంటున్నా గాంధీజీ చేసిన ప్రబోధాల విలువ రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. శాంతి, అహింస, సత్యం అన్న సిద్ధాంతాలు రాజకీయాలలో ప్రాసంగికతను సంతరించుకోవటం వల్ల అవి ఒక మహాదార్శనికుని సందేశాలుగా, విశ్వాసాలుగా స్థిరపడ్డాయి. అవి మార్గదర్శకాలుగా ప్రచారం పొందటమే కాదు, సామాన్యుల విషయంలో అవి జీవితాదర్శాలుగా కూడా రూపొందాయి.
గాంధీజీ జన్మించి శతాబ్దం వరకు చేరువవుతున్నా ఇప్పటికీ ప్రపంచ వ్యా ప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా గాంధీజీనే పేర్కొనటం జరుగుతున్నది. వారికి నోబెల్ బహుమతి రాకున్నా గ్లోబెల్ బహుమతి వచ్చేసింది!
భారత దేశంలోని పెద్ద, చిన్న రాజకీయ నాయకులంతా పార్టీలకతీతంగా లాభార్జనాపరులు, స్వార్థ జీవులు, ప్రజా వ్యతిరేకులు, కుల మతాలను, మూఢ విశ్వాసాలను కూడా తమ ఓట్ల రాజకీయాల కోసం వాడుకునే వారు కావటం వల్ల స్వాతంత్య్రానంతరం అధికార వర్గాలలో గాంధీజీ సిద్ధాంతాలు నిరాదరణకు గురవుతు వచ్చాయి. కాళోజీ వంటి నిజమైన గాంధేయ వాదులకు ఈ పరిణామం ఎంతో ఆవేదనకు గురి చేసింది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షానకాక కమ్యూనిస్టు పార్టీ పక్షాన కాళోజీ పోటీ చేసి వుంటే తప్పకుండా గెలిచి వుండేవాడు. కాని గాంధీ సిద్ధాంతాల పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయాడు. కాళోజీ ‘నా గొడవ’లో గాంధీ తాత్వికత అంతర్లీనంగా ఉన్న కవితలు చాలా కనిపిస్తాయి. అయితే సూటిగా గాంధీని సంబోధిస్తూ రాసిన కవితలు పదిదాకా ఉన్నాయి.
1963 నాటి గాంధీ జయంతికి రాసిన ‘ఓ బాపు’ అన్న కవిత ‘నీ వారసు రాజ్యంలో నీతికి తావేది బాపు’ అని మొదలవుతుంది. నీ వారసుడంటే అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ. నెహ్రూ పరిపాలన నాటికే ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకున్నదని, దీంతో గాంధీజీ ‘ఆత్మకు అగచాట్లు’ తప్పలేదని వాపోయాడు.
1965లో రాసిన ‘ఓ గాంధీ!’ కవిత పై కవిత లాగా సూటిగా కాక వ్యంగ్యంగా భాసిస్తుంది.
‘ఇంకేమి కావాలె? ఇంకేమి చేయాలె? బ్రతికినన్నాళ్ళు నిను బాపు అని పిలిచితిమి
చచ్చిపోయిన నిన్ను జాతిపిత జేసితిమి’ అంటున్నాడు. ‘బాపు’ (తండ్రి) ను ‘జాతి పిత’ను చేయటంతో తమ బాధ్యత తీరిపోయిందంటున్నాడు. పితలో ‘పితృపక్షాలు’ ధ్వనిస్తున్నాయి. ఎన్ని రకాలుగా ‘చెక్క’ టానికి వీలుందో అన్ని రకాలుగా చెక్కి ఏసుక్రీస్తును వేసినట్లు శిలవ వేసి ‘వేడ్కతో ఇంటింట వేలాడ దీసితిమి’ అంటున్నాడు. ‘కాళోజీ మాటలకు కడుపుబ్బ నవ్వితిమి’ అన్నది ఈ కవిత ముగింపు. ఈ నవ్వు నిజానికి నవ్వు కాదు. అపహాస్యం. అపహాస్యం చేస్తున్నవాడు కాళోజీ, చేయబడుతున్న వాళ్ళు స్వార్థపరశక్తులు. కాని తాము అపహాస్యానికి గురవుతున్నామని వాళ్లు గుర్తించటం లేదు. ఇది వ్యంగ్యం. దాదాపు ఇదే పద్ధతిలో సాగిన మరో కవిత ‘జాతి పితా! ఓ మహాత్మా’ అన్నది.
మరో కవిత ‘ఓ బాపూ! జాతి పితా! కవిత. గాంధీజీ శత జయంతి (1969) సందర్భంగా రాసింది. గాంధీజీ ప్రచారం చేసిన సిద్ధాంతాలను, జీవితంలోని ముఖ్య ఘట్టాలను స్పృశిస్తూ రాసిందికావటం వల్ల భిన్న వస్తువుల సముదాయం అయింది. అందుకే పెద్ద కవితగా రూపొందింది.
‘నీ జీవితము ఆసాంతము సత్యంతో ప్రయోగాలు
నీతి నిజాయితీ మనుగడ నమూనాగ నీ నడవడి’ అంటూ గాంధీజీ స్వీయ చరిత్ర ప్రస్తావనతో ప్రారంభమవుతుందీ కవిత. అనేక విలువలకు మాదిరిగా గాంధీజీ ప్రవర్తన వుండేదని కూడా అంటున్నాడు. గాంధీజీ బాగా ఇష్టపడ్డ నరసింహ మెహ్తా గుజరాతీ భాషలో రాసిన ‘వైష్ణవ జనతో’ పాటలోని
‘వైష్ణవ జనతో తేనే కహియే
జోపీడ పరాయీ బాణేరే’ అన్న పంక్తులను
‘పేదవాని బాధనెవడు తన బాధగ గుర్తించునో వాడే పో వైష్ణవుడ’ంటూ తెనిగించాడు.
‘తలచి, చెప్పి, చేసి చూపి’ త్రికరణ శుద్ధితో
‘బానిసత్వం బాసి బ్రతుకగ
పెత్తనాలను రూపు మాపగ
రక్తము చిందని విప్లవ
మార్గము ఏర్పరచినావు’ అంటూ అహింసా మార్గంలో సమాజంలో సమానత్వం సాధించాలన్న గాంధీజీ సంకల్పాన్ని కాళోజీ ప్రశంసించాడు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని, దాని సాఫల్యాన్ని, స్వాతంత్య్ర సిద్ధిని ప్రస్తావించాడు. నాథూరాం గాడ్సే చేతిలో దారుణ హత్యకు గురయినప్పుడు
‘చుక్కలన్ని భూగోళం కన్నీరౌచు ఏడ్చినట్లు
ఆకాశం మొగం నిండా దిగులు అచ్చు కమ్మినట్లు
ఆ క్షణాన సాగరాల హోరంతయు
మానవ మాత్రుని దుఃఖమె’ అంటూ కరుణ రసార్ద్రంగానే కాదు కవితాత్మకంగా కూడా వర్ణించాడు కాళోజీ. ఈ భావోద్వేగంతో కూడిన అనుభూతిని మరిచిపోలేక పోయాడు గనుక మరో ఏడేండ్ల తర్వాత రాసిన ‘అమాయకం’ కవితలో కూడా ఈ పంక్తులు పునరుక్తమయ్యాయి.
‘ఎవరెస్టు శిఖరంపై పతాక నెత్తి
నిన్ను తలచుకుంటూ దిగుతుంటే
అడుగడుగు మా అపరాధ హిమాలయాలు
గోచరిస్తాయి బాపూ’ అంటాడు. టెన్సింగ్ నార్కే 1953 లోను ఆ తర్వాత ఇతరులు అనేకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఉదంతాలను గుర్తు చేస్తాడు. వీరులు ఒకవైపు ప్రాణాలకు తెగించి గొప్ప పనులు చేస్తుంటే రాజకీయ నాయకులు భూమాత భారాన్ని పెంచే పనులు చేస్తున్నట్లు ఆవేదనతో కథనం చేస్తాడు.
అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు మనవి మేరకు 1992లో కాళోజీ ‘పద్మ విభూషణ్’ ను స్వీకరించాడు. అయినా, 1994లో పాణ్యం నగరంలో ఆధునిక యంత్ర పరికరాలతో గ్రామగ్రామాన లఘు పరిశ్రమలు స్థాపించి గ్రామీణుల ఉపాధిని పెంచటమే తమ లక్షమంటూ, ఈ పాలసీని
‘నవ గాంధేయ మార్గం’ గా నిర్వచించాడు పి.వి.
‘గాంధీ మాజీ కలలన్నీ
కల్లలు కథలైపోతే
గ్రామాల ఉద్ధరణకు
కట్టాలిక మనం నడుము
భేష్ భేష్ పి.వి. భేష్
అంటున్నాడు కాళోజీ. గాంధీజీ ప్రతిపాదించి ప్రచారం చేసిన గ్రామ స్వరాజ్ సిద్ధాంతాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పి.వి. ప్రతిపాదించిన కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలోని చేతి వృత్తులను పునరుద్ధరించలేవన్నది కాళోజీ విమర్శ.
ఇట్లా ఛిద్రమవుతున్న వ్యవస్థను చూసి, పాలకుల దృష్టిలో విలువను కోల్పోతున్న గాంధీ ఆదర్శాలను తలుచుకొని కుమిలిపోయిన తరానికి చెందిన వాడు కాళోజీ. ఏ మహానాయకుడు అస్తమించినా, ఏ ఉద్యమం గూర్చి ప్రస్తావించినా గాంధేయ వాదం అంతర్లీనంగా ధ్వనించేది. నిరంతరం తన వ్యక్తిత్వాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగినవాడు కాళోజీ. గాంధీ విశ్వాసాలు సరిపోవని భావించినపుడు ఆచరణాత్మకమైన నూతన మార్గాన్ని అన్వేషించటానికి కాళోజీ ఎప్పడూ వెనుకాడలేదు.

అమ్మంగి వేణుగోపాల్
9441054637