Home ఎడిటోరియల్ వైవిధ్యభరితం కాళోజీ కవిత్వం

వైవిధ్యభరితం కాళోజీ కవిత్వం

Kaloji_manatelanganaప్రజాకవి కాళోజీ పంచ కావ్యాలు, సాహిత్య శాస్త్రాలు చదువుకున్నవాడు కాకపోయినా, పండిత పామరుల మధ్య తిరుగాడిన వాడు కావటం వల్ల ఆయనలో సాహిత్య ప్రయోజనానికి సంబంధించిన తిరుగులేని అవగాహన ఏర్పడింది. అధ్యయనశీలికావటం వల్ల తగు మాత్రం వ్యుత్పన్నత అలవడింది. మరాఠీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల పరిజ్ఞానం ఆయన వ్యక్తిత్వానికి మరో చేర్పు. ఒక పండితుడు ఆధునిక కవిత్వంలోని వ్యావహారిక భాషను విమర్శించినప్పడు. “మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు మీ రచనంతా వ్యాకరణం తప్ప మరేమీ కాదు” (1952) అంటూ వ్యాకరణశాస్త్ర విధేయతను ప్రశ్నించాడు. “సరస్వతీ భక్తులారా! బ్రహ్మనే వెక్కిరిస్తారా?” అని వ్యంగ్యంగా చురకలంటించాడు. అయితే భాషాజ్ఞానాన్ని, ఆలంకారికతను పప్పులో ఉప్పులాగా వాడుకోవ టానికి కాళోజీ వెనుకాడలేదు. 1965 లో రష్యావాళ్లు ‘లాయిక’ అనే కుక్కను ప్రయోగాలలో భాగంగా రోదసికి పంపిస్తారు. అది ఆ ప్రయోగాలకు బలైపోతుంది. అప్పుడు విజ్ఞాన శాస్త్ర వ్యవస్థలోని హృదయరాహిత్యాన్ని కాళోజీ జీవకారుణ్య దృష్టిలో విమర్శిస్తారు.
“కుక్కతోక వంకర యని…
కూతలు కూసే మనిషీ
నీ మనస్సులో మెలికలు
నింగి ముట్టుచున్నాయి.”
అంటూ కవితను ప్రారంభిస్తాడు. మనిషి “మనుసులో మెలికలు” కుక్కతోకలోని మెలికల కన్నా క్రూరమైనవని మూర్తాన్ని అ మూర్త భావనతో పోల్చి చెప్పటం కవిగా కాళోజీ సామర్థానికి గీటురాయి.
“స్వమేధ యాగానికి
శ్వమేధ యాగంబిది”
అంటూ ఈ కవితను ముగించాడు. మనిషి స్వార్థపు తెలివి తేటల యజ్ఞానికి (స్వమేధం) కుక్కను బలి యిచ్చే యాగం (శ్వమేధం) చేయటంగా వర్ణించాడు. ‘మేధ’ శబ్దానికి ఉన్న యజ్ఞం, తెలివి అన్న వేరేవేరే అర్థాలలో అదీ ఆలంకారికంగా వాడటం కాళోజీ వ్యుత్పన్నతకు నిదర్శనం. లోటు (1966) అనే కవితలో భిన్న వర్గాల వారు కలిసి ప్రమిదల్లో వత్తులు వేసి వెలిగించే యత్నం చేస్తారు. అవి వెలగవు. ఆ వైఫల్యానికి బాధ్యత నీదంటే నీ దంటూ కాట్లాడుకుంటారు. ప్రమిదలను పగలగొట్టుకుంటారు. ఈ కవిత ముగింపులో. “స్నేహం వుంటే యింతటి చీకటి వుండేదేనా?” అని ప్రశ్నిస్తున్నాడు కవి. ‘స్నేహం’ అనే మాటకు మైత్రి అనే అర్థంతో పాటు నూనె అనే అర్థం కూడా ఉంది. అందుకే ప్రమిదల్లో నూనె ఉండి వుంటే వెలుతురు ప్రసరిస్తుంది. అనే భావంతో పాటు మనుషుల మధ్య స్నేహం వుంటే ప్రపంచశాంతి నెలకొంటుంది. అన్న భావం కూడా సాధ్యమయింది. ఇది కాళోజీ వ్యుత్పన్నతకు మరో నిదర్శనం. ప్రతి సంవత్సరం వచ్చే పండుగల సందర్భంగా చాలా మంది కవులు మొక్కుబడిగా రాస్తుంటారు. కాని కాళోజీ మాత్రం సమకాలీన రాజకీయ సామాజిక విమర్శ లేకుండా పండుగ కవిత్వం రాయలేదు. నాయకులు వినాయకులై బొజ్జలు పెంచే పనిలో పడితే, వారి అనుయాయులు వినాయకుని వాహనమైన మూషికం లాగా ధాన్యాన్ని కొల్లగొడుతూ సమాజంలో ఉపద్రవం సృష్టిస్తున్నారంటున్నారు. ‘గణనాయకా!’ (1965) అన్న కవితలో, సంపద సృష్టించే నిరంతర శ్రమజీవి నందీశుడు ఈ స్థితిలో నిస్సహాయుడై పోయాడంటూ అన్యాపదేశంగా దోపిడీదార్లను, రైతులను ప్రస్తావించాడు. 1945 నాటి ‘దీపావళి దీపాలు’ కవితలో అలనాడు రాక్షసుని చావుకు ఆనందించి ప్రజలు కోటి దీపాలు వెలిగించుకున్నారు. కాని
“రక్కసులు బాధింప రక్షణే లేదంచు
కోటి రీతుల చెప్పు నేటి దీపాలు”
అంటూ భద్రతలేని సమాజాన్ని ప్రస్తావించాడు. 70 సంవత్సరాల తర్వాత కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైన ప్రాసంగికత ఉన్న మంచి కవిత.
1964 నాటి ‘కొత్త చీపురు’ ప్రాసంగికత వున్న మరో మంచి కవిత.
“కొత్త చీపురొస్తున్నది
చెత్తకేడు పొస్తున్నది”
అన్న ప్రారంభ పాదాలు చదివిన ఎవరికైనా ‘చీపురు’ గుర్తులో రాజకీయాలలోకి వచ్చి ఢిల్లీ పీఠం అధిష్ఠించిన ఆప్ పార్టీ స్ఫురిస్తుంది. ఈ కవిత ప్రధాన ధ్యేయం ‘పాత పరుగు తీస్తున్నది/ నవత తరుముకొస్తున్నది” అని చెప్పటమే. ‘ నా గొడవ’లో ‘ఎవరనుకున్నారు ఇట్లౌనని” అన్న శీర్షికలో రెండు కవితలు కనిపిస్తాయి. మొదటిది 1953 నాటిది. స్వాతంత్య్రం సిద్ధించిన ఆరేండ్లకే “కాంగ్రెస్ వాదుల చేతనే గాంధీయిజం చస్తుందని” ఎవరనుకున్నారు? అని ప్రశ్నిస్తున్నాడు కవి. పార్టీ సిద్ధాంతాలకు రాజకీయ ఆచరణకు మధ్య అధికార దాహం అగాథాన్ని సృష్టించటాన్ని గ్రహించిన కవి కంఠస్వర మది.
1956లో సమైక్య రాష్ట్రం ఏర్పడిన ఒకటి రెండు సంవత్సరాలకే
“హామీలిచ్చిన వారే అంతా స్వాహా చేస్తారని అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని” ఎవరనుకున్నారని అంటున్నాడు కాళోజీ. దోపిడి పునాది మీద రూపొందే ఏ ఒప్పందమైనా ప్రజల నిరసనకు, ఘర్షణకు, తిరుగుబాటుకు విచ్ఛిన్నం కాకతప్పదని చారిత్రక సత్యం. కాళోజీ కవిత్వ భాషలో, భావనలో తెలంగాణ సంస్కారంతో కూడిన ఆవేదన ధ్వనిస్తున్నది. మనస్విగా, మానవతావాదిగా కాళోజీని ఉన్నతస్థానంలో నిలిపే కవితలివి.

Ammangi Venugopalఅమ్మంగి వేణుగోపాల్, ప్రథమ కాళోజీ అవార్డు గ్రహీత
9441054637