Home కెరీర్ మీ శరీరాన్ని గౌరవించండి!

మీ శరీరాన్ని గౌరవించండి!

bringing change on public breastfeeding

పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్‌పై మార్పు తెస్తున్న కామనా గౌతమ్

కామనా గౌతమ్ ..ఈ పేరు సోషల్ మాధ్యమంలో ఈ మధ్య హల్‌చల్ చేస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్‌కు సంబంధించిన సంచలనాత్మకమైన చిత్రాలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అవగాహన కలిగిస్తోంది కామనా. ఈ నెల మొదటివారమంతా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిశువులకు తల్లిపాలను ఇచ్చే విషయంలో ప్రజల్లో పాతుకుపోయిన దృష్టికోణాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది ఈమె. అందుకనే తన పిల్లలకు బ్రెస్ట్‌ఫీడింగ్ ఇస్తున్న ఫొటోలను ప్రపంచానికి పరిచయం చేసి వార్తల్లోకెక్కింది. 

కామనా గౌతమ్ హైదరాబాద్‌కి చెందిన గృహిణి, సోషల్ వర్కర్, ఇద్దరు పిల్లల తల్లి. కామనాకి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. తల్లి అయిన తరువాత ఆరోగ్యంపై శ్రద్ధ మరింత ఎక్కువైంది. ల్యాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంది.

పబ్లిక్ హెల్త్ గురించి అందుకు సంబంధించిన అవగాహన కల్పించడం కోసం కొన్నాళ్లుగా పనిచేస్తోంది. 2014లో తల్లి అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్‌కి సంబంధించిన ప్రాముఖ్యతను తెలుసుకుంది. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్‌కి సంబంధించిన ఒక దృష్టికోణం ఆమెను బాగా కలచివేసింది. పబ్లిక్ ప్లేస్‌లో బిడ్డకు తల్లిపాలను ఇవ్వడమనే విషయాన్ని నార్మలైజ్ చేయాలనే ప్రయత్నం ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విషయంపై జర్నీ ప్రారంభించింది. పిల్లలకి పాలివ్వడం అంతగా దాచివుంచాల్సిన విషయం కాదు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి తనవంతు కృషి చేస్తోంది. స్పందించినవారు కొందరు ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

ఈ విషయంలో తన భర్త మద్దతు ఉన్నట్లు చెబుతోంది.ఇన్‌స్టాలో పిక్చర్‌ని పోస్ట్ చేసేటప్పుడు కూడా అయన అనుమతిని తీసుకోలేదు. ఎందుకంటే, ఆయన నా అభిప్రాయాన్ని గౌరవిస్తారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మొదటి బిడ్డకు జన్మనిచ్చాక ఎంతో మంది మాతృమూర్తులు పడుతున్న అవస్థలు నాకు అర్థమవడం మొదలైంది. బ్రెస్ట్ ఫీడింగ్‌ను ఒక అసాధారణ ప్రక్రియగా సమాజంలో భావన ఉండటం నన్ను కలచివేసింది.

తల్లి పాలే శిశువు ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. తల్లిపాలు శిశువుకు సవ్యంగా అందితే ఆరోగ్యంగా ఎదుగుతుంది. మరి అటువంటి నవసమాజ నిర్మాణం కోసం తల్లిపాలను శిశువుకు అందేలా చేసే బాధ్యత తల్లికి ఉంది. తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పు దృష్టితో చూడకూడదు. అనవసరపు కామెంట్స్ ను చేయకూడదు. ఈ విషయంపై అవగాహన పెరగాలి. శిశువులు తల్లిపాలను తప్పితే ఏదీ తీసుకోలేరు. మరి, శిశువుకు పాలిచ్చేటప్పుడు తల్లినీ బిడ్డను ఇబ్బందికి గురిచేస్తుంది ఈ సమాజం. తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఒక గదికే వారిని పరిమితం చేస్తున్నారు. శిశువుకు సమయానికి పాలు అందకపోతే జరిగే ప్రమాదం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. పాలు అందకపోతే శిశువు రోగనిరోధక శక్తిపై దుష్ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల తల్లిలో పాలు రావడం తగ్గిపోతుంది. శిశువుకు పోషకాలు సవ్యంగా అందవని చెబుతోంది కామనా.

పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్‌పై సమాజంలో ఉన్న అభిప్రాయం గురించి కామనా కలత చెందింది. అప్పుడే పుట్టిన పిల్లలకి గంట గంటకూ పాలివ్వాలి. ప్రతిసారి రూమ్ లోనే కూర్చుని ఉండి పాలివ్వడం కుదరకపోవచ్చు. కాబట్టి, శిశువులకు పాలందవు. పబ్లిక్‌లో తల్లి పాలిచ్చేటప్పుడు వికృతమైన చూపులకు మహిళలు భయపడతారు. బ్రెస్ట్స్ అనేవి శిశువుకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడేవని గుర్తించాలి. ఆడదాని శరీరాన్ని సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూసేవారి తీరు మారాలి. ఈ విషయంలో సమాజంలో అవగాహన రావడానికి ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోస్‌ను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువమంది మారతారని ఆశిస్తున్నాను అంటోంది.
కామనా గౌతమ్ పిక్చర్స్‌ని పోస్ట్ చేస్తున్న కొత్తలో అసభ్యకర మెసేజెస్ వచ్చేవి. ఒక మహిళ అర్థనగ్నంగా ఫోజులిస్త్తుందని భావించేవారు. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడవచ్చని భావించేవారు. నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే కామనా నెగెటివ్ కామెంట్స్‌ను పట్టించుకోలేదు. ఒక మార్పును తీసుకురావాలని చేసే ప్రయత్నంలో ఆమె విజయం సాధించింది.

సముద్రంలో ఒక నీటిబొట్టులాగా ఆమె ప్రయత్నం సాగుతోంది. గ్రామాల్లో ఎడ్యుకేషనల్ సెషన్స్, సెమినార్స్‌ను కండక్ట్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు మారుతున్నారు. వారి నుంచి మద్దతు వస్తోందని చెబుతోంది. ఆమె మాతృమూర్తులకు భరోసానిస్తూ ..
మిమ్మల్ని మీరు నమ్మండి. మీ జీవితాన్ని అందంగా మార్చుకునే సామర్థ్యం మీకుంది. మీ శరీరాన్ని గౌరవించండి! అంటోంది కామనా గౌతమ్.