Home జాతీయ వార్తలు ‘కనిష్క్’ కుంభకోణం..!

‘కనిష్క్’ కుంభకోణం..!

Kanishk

చెన్నై: ప్రముఖ జ్యూయలరీ సంస్థలు ఇటీవల కాలంలో బ్యాంకులను భారీగా మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.842.15కోట్ల మేర రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) సహా మరో 14 బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేశాయి. చెన్నైలో టీ నగర్‌లో రిజస్టర్ అయిన కనిష్క్ గోల్డ్ సంస్థకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న భూపేశ్ కుమార్ జైన్ ఆయన భార్య నీతా జైన్‌పై ఫిర్యాదు చేసింది ఎస్‌బిఐ. వారి ఆచూకీ తెలుసుకోలేకపోతున్నామని, వాళ్లు ప్రస్తుతం మారిషస్‌లో ఉంటున్నారని భావిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాత్రికి రాత్రే షాపులను మూసివేసి, రికార్డులను కూడా మాయం చేసినట్లు సిబిఐకి ఎస్‌బిఐ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జనవరి 25న సిబిఐకి ఎస్‌బిఐ ఫిర్యాదు చేసింది. రుణం మొత్తానికి వడ్డీతో కలుపుకుంటే మొత్తం రూ.1000కోట్లపైనే ఉంటుందని తెలిసింది. కనిష్క్ గోల్డ్ రుణాలు చెల్లించకపోవడంతో యాజమానిని రుణ ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ ఎస్‌బిఐ 2017 నవంబర్ 11న తొలిసారి ఆర్‌బిఐ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.