Home ఎడిటోరియల్ బహుజన పాలన సాధకుడు

బహుజన పాలన సాధకుడు

Kanshi Ram

 

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేవరకు అందుకోసం పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్. పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేద్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరామ్. ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయాలును ఒక మలుపు తిప్పి ఆధిపత్య కులాల పెత్తనాన్ని నిరోధించడానికి బహుజన కులాలను సమీకృతం చేసి పీడిత కులాలకు రాజ్యాధికార రుచిని చూపించినవాడు కాన్షీరామ్.

పంజాబ్ రాష్ట్రంలోని రోఫార్ జిల్లా, కావాస్ పూర్ గ్రామంలో 1934 మార్చి 15న జన్మించారు. తండ్రి హరిసింగ్, తల్లి బిషన్ సింగ్ కౌర్. కాన్షీరామ్ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, స్వాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం కలిగి ఉండేవారు. చదువులోనూ ముందుండేవారు. 1956లో డెహ్రాడూన్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాస శిక్షణ అనంతరం అక్కడి భారతీయ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు.

1959లో పూనే లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు. ఒక రామదాసీ చమర్ కులంలో పుట్టి సైంటిస్ట్‌గా ఎదిగి తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అసమాన వ్యక్తి కాన్షీరామ్. అంబేద్కర్ గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించిన ఆయన అంబేద్కర్ సామాజిక, రాజకీయ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. కుల నిర్మూలన పుస్తకం కాన్షీరామ్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. 1963లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పనిచేస్తున్న కాలంలో దీనాబానా అనే నాల్గవ తరగతి ఉద్యోగిని బర్తరఫ్ చేయడాన్ని కాన్షీరామ్ తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన ప్రారంభించారు. ఆయన చేసిన చట్టబద్ధ పోరాటం వల్ల ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోడం జరిగింది. అదే విధంగా ఒక దళిత స్త్రీని ఉద్యోగంలోకి తీసుకోకుండా వివక్ష చూపుతుంటే ఆయన ఉద్యోగంలోకి చేర్చడానికి పోరాటం జరిపారు. ఈ రెండు ఘటనలు కాన్షీరామ్‌లో పోరాటం స్ఫూర్తి నింపాయి. తమ జాతిజనులకు ఏదో చేయాలనే తపన ఆయనలో పెరిగింది.

అంబేద్కర్ నడిపిన ఉద్యమాలను, గ్రంథాలను శోధించడం, పరిశీలించడం ప్రారంభించిన కాన్షీరామ్ అంబేద్కర్‌తో పాటు మహాత్మ జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి వంటి నాయకుల పోరాటాలను అధ్యయనం చేశారు. పీడిత ప్రజలు కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉండటం వల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, ఈ చిన్నచిన్న సమూహాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోడం సాధ్యమవుతుందని గ్రహించిన కాన్షీరాం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, ప్రజలను చైతన్యవంతం గావించచాలనే దృఢసంకల్పానికి వచ్చారు. కుల ప్రాతిపదికన అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని మార్చడానికి, నిజాయితీతో కూడిన సమరశీల శక్తిగా ఎదగడానికి బ్రహ్మచర్యం పాటించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.

కాన్షీరామ్‌కి పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయిస్తే బహుజన సమాజమే తన కుటుంబం అని, అంబేద్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం తన జీవిత లక్ష్యమని, తాను చనిపోయినట్లు తన కుటుంబ సభ్యులందరూ భావించాలని 1965లో తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. దళితుల విముక్తే లక్ష్యంగా ఒక భుజాన సంచితో, పాత సైకిల్‌తో కాళ్లకు చెప్పులు లేకుండా ఊరూరా కరపత్రాలు పంచుతూ ఆకలి, దాహం మరచిపోయి అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. విద్యార్థులను, ఉద్యోగులను పోగేసి మీటింగులు పెట్టి అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని వారితో పంచుకునేవారు. కాన్షీరామ్ ఆలోచనా విధానం నచ్చిన ఉద్యోగులు ఆయన వెంట నడవడానికి సిద్ధపడ్డారు.

బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో 1978, డిసెంబర్ 6న ‘బామ్ సెఫ్’ను స్థాపించాడు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ ఉద్యోగులను ఏకం చేసి దోపిడీకి గురవుతున్న తమ జాతి ప్రజల రుణం తీర్చుకోవడమే ధ్యేయంగా ఏర్పడింది. ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే నినాదంతో సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు తమ మేధస్సును, డబ్బును, ప్రతిభను అందించాలని కాన్షీరామ్ కోరారు. కాన్షీరామ్ కోరిక మేరకు ఎంతో మంది ఉద్యోగులు ‘బామ్ సెఫ్’ కార్యక్రమాలలో పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేశారు. 1981 డిసెంబర్ 6న ప్రజలను పోరాటం వైపు నడపడానికి డి.ఎస్.ఎస్.ఎస్.ఎస్ (దళితా సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి)ను స్థాపించారు.

ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత చేరారు. రాజ్యాధికారం కోసం కృషి చేయండి అని అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తు చేస్తూ యువతను చైతన్య పరుస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సమానత్వం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించి బాబా సాహెబ్ ఆశయ సాధకుడిగా చరిత్రలో నిలిచారు. ‘మన టిక్కెట్లు మనమే ఇచ్చుకుందాం మన ఓటు మనమే వేసుకుందాం’ అనే ఉద్దేశంతో 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కశ్మీర్ ఎన్నికలలో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని పోటీ చేసిన పార్టీలలో నాలుగవ స్థానాన్ని సాధించింది. ఎన్నికలలో బహుజనులు పూర్తిగా మద్దతు తెలిపారు. బహుజనులకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని తెలుపుతూ ప్రచారం చేశారు.

1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు లక్షలాది ప్రజల ముందు కాన్షీరామ్ పార్టీ పేరు బహుజన సమాజ్ పార్టీ, ఎన్నికల గుర్తు ఏనుగును ప్రకటించారు. ఫూలే ఉద్యమం నుండి బహుజన సమాజ్ పేరును, అంబేద్కర్ ఉద్యమం నుండి నీలి జెండా, ఏనుగు గుర్తును తీసుకున్నట్లు ప్రకటించారు. 1984 నుండి జరిగిన ఎన్నికలలో బిఎస్‌పి తన అభ్యర్థులను నిలబెడుతూ జాతీయ పార్టీలకు గట్టిపోటీని ఇస్తూ ముందుకు సాగింది. 1989లో బిఎస్‌పి ఉత్తరప్రదేశ్‌లో రెండు లోకసభ, 13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. 1993 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిఎస్‌పి, ఎస్‌పి సంకీర్ణకూటమి విజయం సాధించి ములాయం సింగ్ ప్రభుత్వంలో బిఎస్‌పి సభ్యులు మంత్రులుగా ఉండడం దేశ ప్రజలను ఆశ్చర్యంలోకి నెట్టడమే కాక బ్రాహ్మణీయ శకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బహుజన సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరామ్ నిరంతరం శ్రమించి విజయం సాధించారు. ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిని చేశారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి మాయావతిని ముఖ్యమంత్రి చేయడం మామూలు విషయం కాదు. కాన్షీరామ్‌కే అది చెల్లింది.

బహుజన ఉద్యమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ జేబులో చిల్లి గవ్వ కూడా లేని నిరుపేద కాన్షీరామ్. తన కోసం ఏమీ కొనుక్కునే వాడు కాదు. తనది కాని డబ్బు లోంచి పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. జేబులో ఐదు పైసలు లేకుండా జాతి జనుల కోసం పోరాటం చేసిన యోధుడు. ఉద్యమం పట్ల తన జాతి పట్ల తనకున్న నిబద్ధత ముందు ‘లేమి‘ ఓడిపోయింది. 1988 సెప్టెంబర్ 17 పెరియార్ జన్మదినాన సామాజిక పరిణామ ఉద్యమంగా ప్రారంభించారు. 1988లో భారతీయ శరణార్థి ఆందోళన ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ కూలీల కోసం కిసాన్ మజ్దూర్ ఉద్యమం, అదే విధంగా సఫాయి మజ్దూర్ ఆందోళన, భాగీదారి ఆందోళన వంటి ఉద్యమాలు నడిపారు. క్రింది కులాల వారిని చైతన్య పరుచుకోవాలని రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సైకిల్ ర్యాలీలు చేశారు. ‘బహుజన హితం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే’ అనే నినాదంతో 1989 మార్చి 15న ఢిల్లీలో గొప్ప బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహించి బహుజనులకు హక్కులు ఎంత అవసరమో పాలకులకు తెలిసేలా చేశారు.

మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుంటే గద్దె దిగిపోండి అనే నినాదంతో 1989లో ఉద్యమం చేశారు. ఇలా అనేక ఉద్యమాలు చేసిన కాన్షీరాం బహుజనుల్లో ధైర్యం నింపారు. ఓటు ఒక పోరాట సాధనం దాన్ని అమ్ముకోవడం తమను తాము అమ్ముకోడం అవుతుందని, బహుజనులు ఓటును పదునైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలని, పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ నిర్మాణమే నా కర్తవ్యం అని, రాజ్యాధికారం ద్వారానే బహుజనులకు భద్రత ఉంటుందని కాన్షీరామ్ చెప్పేవారు. అక్టోబర్ 9, 2006న కాన్షీరామ్‌కి తీవ్రమైన గుండెపోటు రావడంతో అదే రోజు రాత్రి మరణించారు. అంబేద్కర్ తర్వాత ఆయన వదిలివెళ్లిన ఉద్యమ స్ఫూర్తిని భుజాలకెత్తుకొని అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్. మనువాద రాజకీయ పార్టీలను, నాయకులను ఎదుర్కొని భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలు, పీడిత వర్గాలు ఆయన వేసిన పునాదులను ఆసరాగా చేసుకొని రాజ్యాధికార దిశగా కృషి చేయాల్సి ఉంది.

Today Kanshi Ram Birthday