Search
Saturday 22 September 2018
  • :
  • :

25 నుంచి కంటి వెలుగు?

mimistr

అన్ని జిల్లాల్లో 4న ట్రయల్ క్యాంపు 

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వంప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మే 25వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాధమికంగా ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సోమవారం అన్ని జిల్లా వైద్యాధికారులతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ‘కంటివెలుగు’ నిర్వహణపై సుధీర్ఘంగా చర్చించిన వైద్యశాఖ అధికారులు మే 25వ తేదీ నుంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల అధికారులకు సూచించారు. సిఎం కెసిఆర్ ప్రారంభ తేదీపై స్పష్టతనిస్తారని సూచించారు. కార్యక్రమాన్ని 25వ తేదీ నుంచే నిర్వహించేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
భారీ ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు వీలుగా ప్రయోగాత్మకంగా ఒక ట్రయల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మే 4వ తేదీన అన్ని జిల్లాల్లో ట్రయల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి పరీక్షల నిర్వహణ, ఇతర కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రజలకు సంబంధం లేకుండా కేవలం అధికారులు, సిబ్బంది మాత్రమే ఈ ట్రయల్ రన్‌ను అన్ని జిల్లాల్లో కొనసాగించాలన్నారు. పరీక్షల నిర్వహణలో తలెత్తే సమస్యలు, ఇతర అవసరాల్లో లోపాలు ఈ ప్రయోగాత్మక రన్‌లో తెలిసిపోతాయని, అధికారికంగా ప్రారంభమయ్యేనాటికి వీటిని సరిదిద్దుకోడానికి వీలవుతుందని తెలిపారు.
కంటి పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలను మే నెలలో రెండవ వారంకల్లా అన్ని జిల్లాలకు పంపిణి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కళ్ళజోళ్ళు, మందులను జిల్లాలకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత దాదాపు పది లక్షల వరకు కళ్ళద్దాలను అందుబాటులోకి తెచ్చేలా టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సింగపూర్‌కు చెందిన ఎస్‌ఎల్‌ఆర్ కంపెనీకి టెండర్ ఖరారు కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దాలను అందించనుంది. ‘రీడింగ్’ అద్దాలతో పాటు మందులను, అవసరమైన వారికి బై ఫోకల్ అద్దాలను వారం, పది రోజుల్లో అందజేయాలని నిర్ణయించారు. అపరేషన్లు అవసరమైనట్లయితే జిల్లాలవారీగా అప్పగించడంపై జిల్లా వైద్యాధికారులే నిర్ణయించాలని ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి అధికారులు సూచించారు. అపరేషన్లను ఉచితంగా చేసేలా జిల్లా వైద్యాధికారులు ట్రస్టులు, స్వచ్చంధ సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. క్లిష్టమైన అపరేషన్లు అవసరమైతే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి పంపించాలని ఉన్నతాధికారులు సూచించారు.జిల్లాల్లో ఎన్ని కంటి పరీక్షా శిబిరాలను నిర్వహించాలనే దానిపై జిల్లా వైద్యాధికారులు చేసే నిర్ణయానికి అనుగుణంగా సిబ్బందిని సమకూర్చడంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ప్రతీ పరీకా శిబిరంలో 12 ఏర్పాటు చేయాలని, ఒక్కొక్కరు ముగ్గురు లేదా నలుగురు చొప్పున సిబ్బంది అవసరముండవచ్చని అంచనా వేశారు. పరీక్ష శిబిరాల సంఖ్య తేలితే దాని ప్రకారం సిబ్బందిని సమకూర్చడంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికారులు ఈ వివరాలను వీలైనంత త్వరగా వైద్యారోగ్య శాఖకు చేరవేయాలని సూచించారు.

Comments

comments