Home ఎడిటోరియల్ కమలానికి కర్ణాటక సంకేతాలు

కమలానికి కర్ణాటక సంకేతాలు

Karnataka By-Election Results 2018 Highlights

ముందున్నది ముసళ్ల పండగ అనిపించే రీతిలో కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాలను చవిచూసింది. దేశాధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు పీడకలలు రప్పించడం ఖాయం. కర్ణాటకలో ఆ పార్టీకి, దాని ప్రధాన మద్దతుదారుడైన గాలి జనార్ధన్ రెడ్డికి కంచుకోటవంటి బళ్లారి లోక్‌సభ స్థానాన్ని గణనీయమైన ఓట్ల తేడాతో అది కోల్పోవడం దానికి ప్రమాద సంకేతం. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో జెడి(ఎస్) చేతిలో ఓటమి దానికి అవమానహేతువే. శివమొగ్గ లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ మెజారిటీతో యడ్యూరప్ప కుమారుడు బి.వై రాఘవేంద్ర గెలుచుకోవడమొక్కటే కమలనాథులకు ఊరట. రామనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత ఘన విజయం పొందడమూ మరో శాసన సభ స్థానం జంఖండిని కాంగ్రెస్ గెలుచుకోవడం కర్ణాటకలో బిజెపి వ్యతిరేక పాలక కూటమి ఘనతను చాటుతున్నాయి.

ఉప ఎన్నికలు జరిగిన మాండ్యా, రామ్‌నగర్, జంఖండి స్థానాలు పూర్వం కూడా జెడి (ఎస్),కాంగ్రెస్‌వే. అదనంగా బళ్లారిని బిజెపి నుంచి కాంగ్రెస్ గెలుచుకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించి గవర్నర్ సహకారంతో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సభా పరీక్షలో వీగిపోయి గద్దె దిగిపోవలసి వచ్చిన భారతీయ జనతా పార్టీ గత ఆరు మాసాలుగా ప్రతిపక్ష స్థానంలో ఏమాత్రం రాణించలేదని కాంగ్రెస్, జెడిఎస్‌ల కూటమిని అక్కడి ప్రజలు బాగా ఆదరిస్తున్నారని ఈ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలలో ఓటు రాష్ట్రప్రభుత్వం పట్ల ప్రజలలో ఉండే అనుకూలత లేదా ప్రతికూలతను ప్రతిబింబిస్తుందని, లోక్‌సభ సీట్లకు జరిగే పోటీలో ప్రజలు కేంద్రంలో ఉన్న పాలక పక్షంపట్ల తమ తీర్పును ప్రకటిస్తారని అనుకోవడం మామూలే. ఈ కొలబద్దతో చూసినప్పుడు కర్ణాటకలో జరిగిన ఈ ఉప ఎన్నికలు అటు కేంద్రంలోని పాలక పక్షానికి వ్యతిరేకంగానూ, ఇటు రాష్ట్రంలోని అధికార కూటమికి అనుకూలంగానూ వచ్చినట్టు భావించకతప్పదు.

గత మే 12వ తేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 224 స్థానాలలో భారతీయ జనతా పార్టీకి 104, కాంగ్రెస్‌కు 80, జెడి(ఎస్) బిఎస్‌పి కూటమికి 40 స్థానాలు లభించాయి. నానావిధ ఉపాయాలను ప్రయోగించిన బిజెపికి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి గవర్నర్ పాలన పగ్గాలు అప్పజెప్పినప్పటికీ కాంగ్రెస్ జెడి(ఎస్)లు పొత్తు కలసి సభా పరీక్షలో దానిని ఓడించి అధికారం సాధించుకున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యప్రతిపక్ష విజయానికి దానిని తిరుగులేని చిహ్నంగా బిజెపియేతర పార్టీలు భావించాయి. తక్కువ స్థానాలు గెలుచుకున్న జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి దానితో కలిసి అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధపడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బిజెపిని ఓడించేవైపు తొలి అడుగు వేసింది అనిపించింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలను ఆ వ్యూహానికి లభించిన విజయంగా భావించాలి.
దాదాపు నాలుగున్నరేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా తన సొంత ఎజెండా అమలుకు ప్రాధాన్యం ఇచ్చినందుకు జనహృదయాల్లో వ్యతిరేకత గూడుకట్టుకున్నది. ఈ ఫలితాలు దానికి సంకేతాలని అనుకోవలసి వస్తున్నది. ఆకాశమెత్తున సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని నెలకొల్పడం, సుప్రీంకోర్టు తీర్పును వమ్ముచేయిస్తూ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం, అలహాబాద్ తదితర చారిత్రక నగరాల పేర్లను మార్చి హైందవీకరించడంవంటి కార్యక్రమాలను మొండిగా జరిపించడం ద్వారా ప్రజల మనసులను గెలవలేమనే విషయాన్ని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ గమనించవలసి ఉంది. ఆర్థిక రంగంలో కేంద్రం బహు విధ వైఫల్యం, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయలేకపోవడం, పెద్ద నోట్ల రద్దు ద్వారా జనాన్ని నానాకష్టాలకు గురిచేయడం, జిఎస్‌టిని హేతుబద్ధత లేకుండా దూకుడుగా అమలు చేయడం వంటి చర్యలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బలు తినిపించగలవని కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రజల కలలు పండించడానికి దివి నుండి దిగి వచ్చిన దివ్య పురుషుడు మాదిరిగా చూపించి అందులో వందోవంతయినా ఆచరణలో రుజువు చేయలేకపోయిన చేతగానితనాన్ని బిజెపి ముఖమ్మీద ప్రజలు స్పష్టంగా తిలకిస్తున్నారు. సిబిఐ, ఆర్‌బిఐ వంటి వ్యవస్థల స్వయం నిర్ణయాధికార ప్రతిపత్తిని బలి తీసుకుంటున్న వైనాన్నీ గమనిస్తున్నారు.

Karnataka By-Election Results 2018 Highlights

Telangana News