Search
Wednesday 21 November 2018
  • :
  • :

కర్ణాటకలో కమలానికి షాక్…

Karnataka By-Election Results 2018

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడతున్న వేళ భారతీయ జనతా పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. మూడు లోక్‌సభ స్థానాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపెన్నికలు జరగ్గా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మిగతా నాలుగు స్థానాల్లో అధికార జెడి(ఎస్)కాంగ్రెస్ కూటమి విజయ కేతనం ఎగురవేసింది. బిజెపి ఓడిపోయిన స్థానాల్లో గత 15 ఏళ్లుగా ఆ పార్టీకి కంచుకోటగా ఉండిన బళ్లారి లోక్‌సభ స్థానంకూడా ఉండడం గమనార్హం. బళ్లారి, శివమొగ్గ, మాండ్య స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర స్థానాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి వదులుకోవడం, జమఖండి అసెంబ్లీ నియోజకవర్గం ఎంఎల్‌ఎ మృతి చెందడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమైనాయి. శనివారం ఉప ఎన్నికలకు పోలింగ్ జరగ్గా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ వచ్చిన బళ్లారి లోక్‌సభ స్థానంలోను ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. బళ్లారిలో 2004నుంచి బిజెపినే గెలుస్తూ వస్తోంది. అంతే కాక ఇది గాలి జనార్ధన్ రెడ్డి సోదరులకు గట్టి పట్టు ఉన్న నియోజక వర్గం.2014లోక్‌సభ ఎన్నికల్లోను గాలి సోదరుల ముఖ్య అనుచరుడు, బిజెపినాయకుడు బి శ్రీరాములు ఈ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన శ్రీరాములు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున శ్రీరాములు పోదరి శాంత పోటీ చేయగా, కాంగ్రెస్ జెడి(ఎస్) కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్ బరిలోకి దించింది. తొలిరౌండ్‌నుంచే ఆధిక్యత కనబరిచిన ఉగ్రప్ప 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. మరో లోక్‌సభ నియోజక వర్గం మాండ్యలో జెడి(ఎస్) అభ్యర్థి శివరామగౌడ గెలుపొందారు.

ఈ నియోజకవర్గంనుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన జెడి(ఎస్)ఎంపి సిఎస్ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. ఉప ఎన్నికలో జెడి(ఎస్) అభ్యర్థిగా శివరామగౌడ పోటీ చేయగా, కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇచ్చింది. బిజెపినుంచి బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో ఆయన ఎన్నిక దాదాపు ఏకపక్షమైంది. కాగా శివమొగ్గ లోక్‌సభ స్థానాన్ని బిజెపి నిలబెట్టుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడినించి గెలుపొందిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగగా, జెడి(ఎస్) అభ్యర్థిగా మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు.ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో రాఘవేంద్ర 47 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
సిఎం సతీమణి గెలుపు
కాగా రామనగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జయభేరి మోగించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి రామనగర, చెన్నపట్న నియోజక వర్గాలనుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల వెల్లడి తర్వాత ఆయన రామనగర స్థానానికి రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో జెడి(ఎస్) తరఫున బరిలోకి దిగిన ముఖ్యమంత్రి సతీమణి అనితా కుమార స్వామి లక్ష ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంనుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ ఆ తర్వాత పోటీనుంచి తప్పుకొన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఉప ఎన్నిక జరిగిన మరో అసెంబ్లీ స్థానం జమఖండిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ న్యామగౌడ బిజెపి అభ్యర్థి శ్రీకాంత్ కుల్కర్ణిపై 39 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంనుంచి గెలుపొందిన సిద్దు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది, ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయంతో 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌జెడి(ఎస్) కూటమి బలం 120కి పెరగ్గా, బిజెపి బలం 104గా ఉంది.

Karnataka By-Election Results 2018

Telangana News

Comments

comments