Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జలరాలు కాని జూరాల

  • జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్ ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం

Jurala

గద్వాల /ధరూరు: బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్న కర్నాటక యథేచ్ఛగా జల చౌర్యానికి పాల్పడుతుంది. ప్రసుత్తం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నప్పటికీ అదనంగా ఉన్న నీటిని దిగువనున్న జూరాలకు విడుదల చేయకుండా అక్కడే ఎత్తిపోతలు, పవర్‌హౌస్‌లకు వినియోగించుకుంటుంది. ప్రసుత్తం వానాకాలంలో ఆగస్టు మొదటి వారం ముగుస్తు న్నా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీరు వచ్చి చేరలేదు. తెలంగాణలో తొలి ప్రాజెక్టు అయిన జూరాలలో శనివారం కేవలం 5.65 టిఎంసిలు ఉండగా, 1.98 టిఎంసిలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. దీంతో ఎగువ ప్రాంతమైన కర్నాటక నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో రాష్ట్రంలో సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూరాలలో పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 కాగా, ప్రస్తుతం 5.65టీఎంసీలు, శ్రీశైలం పూర్తి నీటిమట్టం 215.807 టీఎంసీలు కాగా, ప్రసుత్తం 19.62 టీఎంసీలు, నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 116.10టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.045టీఎంసీలు మాత్రమే నీరు జలాశయాల్లో అందుబాటులో ఉన్నాయి. అదే కర్నాటకలోని ఆల్మట్టిలో పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 కాగా, ప్రస్తుతం జలాశయంలో 128.19 టీఎంసీలు ఉంది. అధేవిధంగా నారాయణపూర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం 37.44 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.12 టీఎంసీలు ఉంది.
అంటే ఈప్రాజెక్టులన్నీ పూర్తి నీటిమట్టాలతో నిండి ఉన్నాయి. మరోవైపు జూరాలా ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాస్తవానికి కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టాలు ఉన్నపుడు మిగిలిన నీటిని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మిగిలిన నీటిని దిగువనున్న ప్రాంతాలకు విడదుల చేయాలని చెబుతుంది. బచావత్ ట్రిబ్యునల్ 75శాతం నీటి నిల్వ ఆధారంగా మొత్తం 2130టీఎంసీలల్లో మహరాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు నీటి కెటాయింపులను చేసింది. మహరాష్ట్రకు 585టీఎంసీలు, కర్నాటకకు 734టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కెటాయించింది. అయితే మనం ఎపుడు కూడ కెటాయించిన నీటిని వినియోగించుకోలేదు. కారణం ఎగువనున్న కర్నాటక యథేచ్ఛగా జల చౌర్యానికి పాల్పడుతూ ట్రిబ్యునల్ కేటాయింపులకే తూట్లు పొడుస్తుంది. గతేడాది తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా కర్నాటక ప్రభుత్వానికి వినతి చేసినా కేవలం ఒక టీఎంసీని మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం జూరాల కింద 50వేలు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద 2లక్షల ఎకరాలకు సాగునీరు పారడం సందేహంగానే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి రోజుకు 11వేల క్యుసెక్కులు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే వారం రోజుల్లో పూర్తి స్థాయి అంటే 9.85టీఎంసీలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి కేవలం 6వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిచేరుతుంది. ఇది కూడా ఎప్పటి వరకు వస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు జూరాల నుంచి ఎడమ, కుడి ప్రధాన కాలువలు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, సమాంతర కాలువలకు ప్రతిరోజూ 4వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంటే వస్తున్న నీటిని వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు.

Comments

comments