Home సినిమా లవ్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ‘దేవ్’

లవ్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ‘దేవ్’

కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న విడుదల కానుంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా… రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ మాట్లాడుతూ “చాలా అందమైన కథతో తెరకెక్కిన సినిమా ‘దేవ్’. లవ్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులోని మేఘన పాత్రకు రకుల్ సరిగ్గా సరిపోయింది. రెండు వేర్వేరు ఆలోచనలు ఉన్న వ్యక్తుల ప్రేమకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేదే ఈ సినిమా కథ. హారిస్ జయరాజ్ మంచి సంగీతాన్ని అందించారు.

రజత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను పవర్‌ఫుల్ పాత్రలో నటించాను. ‘ఖాకీ’ సినిమా సమయంలో కార్తీతో మంచి అనుబంధం ఏర్పడింది. మళ్లీ ఈ సినిమా కూడా ‘ఖాకీ’లాగే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాను. దర్శకుడు రజత్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది”అని తెలిపారు. దర్శకుడు రజత్ రవిశంకర్ మాట్లాడుతూ “ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. హారిస్ జయరాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Karthi Dev movie Audio launch event