Home ఆఫ్ బీట్ కార్తీకం ఆర్తి నాశకం

కార్తీకం ఆర్తి నాశకం

                 Shiva

తెలుగు మాసాలను అనుసరించి ఎనిమిదవది కార్తీకమాసం. దీపావళి మరునాటి నుంచే ఈ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు కృత్తికా నక్షత్రానికి సమీపంగా వచ్చే మాసం కావడం వల్ల దీనికి కార్తీకమాసం అని పేరు. కార్తీకం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈనెలలో ప్రతిరోజూ విష్ణుమూర్తిని శంఖపుష్పాలు, తులసీదళాలు, అవిసె పూలతో ఆరాధిస్తే జీవితం సుఖప్రదమవుతుంది. శివుని మారేడుదళాలతో, తుమ్మిపూలతో పూజిస్తే ఆయన కృపకు పాత్రులవుతారు.

కార్తీకమాసం నియమాలు: కార్తీకస్నానం అత్యంత ప్రధానమైంది. ఈ స్నానాలలోనూ నదీస్నానం, సముద్ర స్నానం ఉత్తమమైనవి. అలా కుదరకపోతే నుతజల స్నానం అంటే బావి నీటితో స్నానం చేయవచ్చు. అది కూడా లేకపోతే చన్నీటి స్నానం చేయవచ్చు. ఏ స్నానమైనా సూర్యోదయానికి ముందుగానే చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. శివభక్తులు శివుని దర్శించుకుని అభిషేక జలాన్ని శిరస్సున జల్లుకోవాలి. ఉపవాసాలుండడం, కార్తీకపురాణం వినడం లేదా చదవడం ఆచారం.

దీపదానం పుణ్యప్రదం: మాసంలో దీపారాధన, దీపదానం ప్రధానం. దీపాన్ని పరబ్రహ్మగా భావించి, దీపం వెలిగించగానే, ‘దీపంజ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం , దీపేన సాధ్యతే సర్వం ఉదయాదీపం నమోస్తుతే అని దీపానికి నమస్కరించాలి. సాయంత్ర సమయంలో దీపాన్ని వెలిగించినప్పుడు సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పుకోవాలి. కార్తీక సోమవారం నాడు కొందరు భక్తులు శివాలయంలో 11 లేదా 21 ఒత్తులతో ఆవునేతి దీపారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 366 ఒత్తులను ఆవు నేతిలో కలిపి, చిన్న మట్టిమూకుడులో ఆవు నెయ్యి పోసి, శివాలయంలో వెలిగిస్తారు.

దీపం పంచబ్రహ్మాత్మకం: సెమ్మె బ్రహ్మ, కింది భాగం విష్ణువు, పైభాగం శివుడు, ఒత్తి బిందువు, తైలం నాదం. ఈ విధంగా బ్రహ్మ, విష్ణువు, శివాత్మకమైన దీపాన్ని దానం చేయడం పుణ్యప్రదం. దీపకాంతిలో కనిపించే నీలపు రంగు విష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి, ఎరుపుకాంతి బ్రహ్మకి సంకేతం. కాగా ఈ దీపకాంతిని సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవికి ప్రతీకలని మరి కొందరు భావిస్తారు. ఈ మాసంలో అరటిదొప్పలో దీపాలను వెలిగించి చెరువుల్లో, నదుల్లో వదులుతారు. ఆకాశ దీపాలను వెలిగించడమన్నది కార్తీకంలో మరో గొప్ప సాంప్రదాయం. దీపదానం లాగానే సాలి గ్రామదానం కూడా ఈ మాసంలో విశేషమైనది. వస్త్రదానం, పుస్తకదానం, అన్నదానంలాంటి దానాలు కూడా చేస్తారు.

నక్తం వల్ల నానావిధ లాభాలు: శివాలయంలో అభిషేకం చేయించడం, వైష్ణవాలయాల్లో నైవేద్యం సమర్పించడం పుణ్యప్రదం. మాసమంతా దేవాలయ సందర్శనం చేయడం వల్ల భక్తిభావం పెంపొందుతుంది. కార్తీక సోమవారాలలో, కార్తీక పౌర్ణమి నాడు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ నిరాహారంగా ఉండి, ఇంట్లో పూజ చేసి, శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. మట్టి ప్రమిదలో ఆవు నేతి దీపాలను వెలిగించి, చంద్రదర్శనం, నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించి ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ భోంచేయడాన్ని నక్తం అంటారు. సామూహిక వనభోజనాలు ఈ మాసంలో మరో విశేషాంశం. ఉసిరిచెట్టు ఉన్న చోట, తులసిని పెట్టి పూజలు చేస్తారు. అందరూ కలిసి పనులను పంచుకుంటూ, ఆటపాటలతో సామూహికంగా గడపటం వల్ల, వారి మధ్య అనుబంధాలు, ఆదరాభిమానాలు, ఐకమత్యం మరింత వృద్ధిచెందుతాయి. శరదృతువులో వచ్చే ఈ కార్తీకాన్ని కౌముదీమాసం అని కూడా చెబుతారు. కార్తీకమాసమంతా ఉదయం, సాయంత్రం తులసి కోట ముందు, బయట ద్వారం దగ్గర దీపాలను వెలిగిస్తారు. కార్తీకమాసం మోక్షప్రదాయకం, పవిత్రం, పాపక్షయకరం.