Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కంటి వెలుగుకు రెడీ

mini

799 బృందాలు, 40 లక్షల అద్దాలు
ఉచిత ఆపరేషన్లు, మందులు
వారానికి 5 రోజులు శిబిరాలు
నోడల్ అధికారులుగా డిఎంహెచ్‌ఒలు
కలెక్టర్లకే పూర్తి బాధ్యతలు
రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా కరుణ

మన తెలంగాణ/ హైదరాబాద్ : అందరికీ కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 15వ తేదీన గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ట్రయల్న్ కూడా శనివారం వెంగళరావు నగర్‌లో నిర్వహించారు. శిబిరాలకు వచ్చిన ప్రజలకు ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి, వారికి కావల్సిన ఏర్పాట్లపై అధికారులకు అవగాహన క్పలించారు. ప్రతిష్టాత్మకంగా కంటి పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఎక్కడా ఏర్పాట్లలో లోపాలు లేకుండా ప్రణాళికా బద్ధంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో కంటి అద్దాల పంపిణీ తో పాటు నేత్ర వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే బాధ్యతను ప్రభుత్వం భుజస్కంధాలపై వేసుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డాక్టర్ల, సిబ్బంది కొరత ఉంటే పక్క రాష్ట్రాల నుంచి వారి సాయం తీసుకొని దీనిని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కంటి పరీక్షల అనంతరం ప్రతి ఒక్కరి వివరాలను డాటాబేస్‌లో పొందుపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి అవసరమైన సిబ్బందిని కూడా తాత్కాలికంగా నియమించుకుంది.
రెవెన్యూ అధికారులకే ఏర్పాట్ల బాధ్యతలు : గ్రామీణ ప్రాంతాల్లో కంటికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో కంటి వైద్యానికి సరైన చికిత్సా సౌకర్యం లేదు. కంటికి సంబంధించి సరోజినీ ఆస్పత్రి తప్ప మరో ఆస్పత్రి లేదు. ప్రైవే టు ఆస్పత్రులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజలందరికీ మెరుగైన కంటి పరీక్షలు నిర్వహించి వారి కి అద్దాలను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. చాలామంది అద్దాలను కొనలేని స్థితిలో ఉన్నారని వారికి ఉచితంగా అద్దాలను పంపిణీ చేయాలని ప్రభు త్వం భావించింది. ఈ నేపథ్యంలో శిబిరాల నిర్వహణ కు సంబంధించి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. శిబిరాలకు సంబంధించి స్థానికం గా రెవెన్యూ అధికారులే ఏర్పాట్లను చూసుకోనున్నారు.
11౩ బఫర్ టీంలు అదనంగా ఎంపిక : రాష్ట్ర వ్యాప్తం గా 799 టీమ్‌లను కంటి పరీక్షలకు సంబంధించి ఎంపికచేశారు. ఈ టీంలతో పాటు 113 బపర్ టీంలను అదనంగా ఎంపిక చేశారు. రెగ్యులర్‌గా పనిచేసే టీంలో ఎవరైనా విధులకు హాజరుకాకపోతే బపర్ టీంలో నుంచి ఎంపిక చేసిన వారిని అక్కడకు పంపిస్తారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కళ్ల అద్దాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ వాకాటిని ప్రభుత్వం నియమించింది. పాత పది జిల్లాలకు ఒక నోడల్ ఆఫీసర్‌ను జిల్లా నోడల్ ఆఫీసర్‌గా డీఎంహెచ్‌ఓలను ప్రభుత్వం నియమించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల వైద్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓలు, కలెక్టర్లకే ప్రభుత్వం పూర్తి బాధ్యత అప్పగించింది. ఎంపిక చేసిన ప్రతి టీంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. అందులో ఒక డాక్టర్, ఆఫ్తామాలజిస్టు, ఫార్మాసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు నర్సు ఉంటారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు
ప్రతి టీంకు ఒక వెహికిల్‌ను ఏర్పాటు చేశారు. ఆ రోజు టీంకు కేటాయించిన సమయానికి శిబిరం వద్ద టీం సభ్యులను వదిలిపెడతారు.ఉ.9గంటలకు వదిలి సాయ ంత్రం 5 గంటలు దాటిన తరువాత మళ్లీ వారిని ఇంటి దగ్గర దించేస్తారు. కంటి పరీక్షలను ప్రభుత్వ కార్యాలయాల వద్దనే నిర్వహించనున్నారు. అందులో ఎమ్మా ర్వో, ఎంపీడీఓ, ప్రభుత్వ పాఠశాలలు,గ్రామ పం చాయతీలు, మున్సిపాలిటీల తదితర వాటి వద్ద పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు నిర్వహించే చోట ముందుగా 5 ఏర్పాటు చేసుకుంటారు. మొదటి టేబుల్ దగ్గర పేర్లను నమోదు చేసుకుంటారు. రెండో టేబుల్ వద్ద కళ్లలో మందు వేస్తారు. మూడో టేబుల్ వద్ద కళ్లను చెక్ చేస్తారు. నాలుగో, ఐదో టేబుల్ వద్ద డాక్టర్ వారి నుంచి వివరాలను సేకరించి వారికి మందులు లేదా అద్దాలను అందిస్తారు. కంటి ఆపరేషన్‌లు అవసరమైన వారికి జిల్లా ఆస్పత్రి లేదా గుర్తించిన ఆస్పత్రులకు పంపిస్తారు. 40 లక్షల మందికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు అవసరమని ప్రభుత్వ గుర్తించింది. ఈనేపథ్యంలోనే ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అవసరమైన వారికి చికిత్సలు
కంటికి సంబంధించి రెఫరల్ ఆస్పత్రులు సరోజినీ కంటి ఆస్పత్రి, రీజనల్ ఆస్పత్రి వరంగల్ లో కూడా కంటికి సంబంధించి చికిత్సలు నిర్వహించడానికి మెరుగైన పరికరాలను సమకూర్చనున్నారు. ఈ వైద్య శిబిరాలు సోమవారం నుంచి శుక్రవారం వరకే నిర్వహిస్తారు. ఈ శిబిరాలను మొదటగా 100 రోజులు మాత్రమే నిర్వహించాలని భావించినా ప్రస్తు తం మాత్రం అందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యే వరకు ఆరునెలలైనా ఈ శిబిరాలను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. స్థానిక అధికారులు ఏ గ్రామాల్లో ఏ తేదీల్లో శిబిరాలను నిర్వహిస్తారో ప్రజలకు తెలియచేస్తారు.
హైదరాబాద్ జిల్లాకే 12 లక్షల అద్దాలు అవసరం…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. 40 లక్షల అద్దాలకు గాను ఇప్పటికే 30 లక్షల అద్దాలను ప్రభుత్వం తెప్పించింది. మిగతా 10 లక్షల అద్దాలు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఇది చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి లకా్ష్మరెడ్డి

అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు. దీనిని విజయవంతం చేయడానికి వైద్య ఆరో గ్య శాఖ పూర్తి స్థాయి కసరత్తును ప్రారంభించింది. కచ్చితంగా దీనిని సక్సెస్ చేస్తాం. మందులతో పాటు అద్దాలను కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా అందచేస్తాం. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను కూడా చేయిస్తాం. శాశ్వత అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిబరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.కలెక్టర్లు ఆధ్వర్యంలో జిల్లాలో ఈ శిబిరాలను నిర్వహిస్తారు. ప్రాథమిక స్థాయిలోనే కంటికి సంబంధించి చికిత్స చేస్తే ఇబ్బం ది ఉండదని ప్రభుత్వం ఈ శిబిరాలను నిర్వహిస్తోంది.

Comments

comments