Search
Wednesday 26 September 2018
  • :
  • :

కరుణ.. రీల్ లైఫ్

 Chief Minister of Tamil Nadu

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. మంచి సాహితీవేత్తగా పేరుగాంచిన ఆయన రచయితగా తన సినీ కెరీర్‌లో 39 సినిమాలకు స్క్రిప్ట్ అందించారు. పలు విజయవంతమైన సినిమాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసిన కరుణానిధి రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు. తన 14వ ఏట నుంచే ఆయన నాటకాలు, కవిత్వం రాయడం మొదలెట్టారు. పెళ్లయిన తర్వాత ద్రావిడ నడిగర్ కళగం అనే నాటక బృందంలో రచయితగా తన జీవితాన్ని ప్రారంభించారు. అయితే నాటకంలో కరుణానిధి కూడా నటించాలని షరతు పెట్టడంతో నెల రోజుల ముందే తన ఇద్దరు మిత్రులతో కలిసి వెల్లుపూర్ వెళ్లారు. అక్కడ నాటక బృందం మేనేజర్ చూపించిన ఓ చిన్న గదిలో ఉన్నారు. ఆయన చేసిన ‘పళనియప్పన్’ నాటకాన్ని పెరియార్ రామస్వామి, అన్నాదురైలు కూడా వచ్చి తిలకించారు. ఆ విధంగా రచయితగా తన జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలానికి కోయంబత్తూర్‌లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘జుపిటర్ పిక్చర్స్’ నుంచి కరుణానిధికి పిలుపువచ్చింది. ఆ సంస్థలో స్క్రిప్ట్ రైటర్‌గా కొత్త జీవితాన్ని ఆయన ప్రారంభించారు.

రచయితగా 1947లో తొలిసారిగా ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఎంజిఆర్ నటించారు. ఈ తర్వాత ‘అభిమన్యు’ చిత్రానికి మాటలు రాశారు. అయితే 1952లో విడుదలైన ‘పరాశక్తి’ సినిమా మాటల రచయితగా కరుణానిధి ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇందులో నటించిన హీరో శివాజీ గణేశన్‌కు ఈ చిత్రం ఎంతో పేరును తెచ్చిపెట్టింది. ఆతర్వాత ‘మనోహర’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో రచయితగా కరుణానిధికి సుస్థిర స్థానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన పూంబుహార్, పుదైయల్, మంత్రి కుమారి, నీతిక్కుదండనై, చట్టం ఒరు విలయాట్టు, పాసం పరవైగల్ తదితర విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. కరుణానిధి చివరగా 2011లో ప్రశాంత్ కథానాయకుడిగా త్యాగరాజన్ దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నార్ శంకర్’ చిత్రానికి కథ అందించారు. తన కెరీర్‌లో మొత్తం 39 సినిమాలకు ఆయన స్క్రిప్ట్ రాశారు. సాహిత్య, సినీ రంగంలో చేసిన సేవలకుగాను కరుణానిధి ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1971లో అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా కరుణానిధికి ‘తమిళ్‌వేల్’ పురస్కారం దక్కింది.
సినీ ప్రముఖుల సంతాపం…
కరుణానిధి మృతి పట్ల పలువురు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ “ఇది బ్లాక్‌డే. ఈ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. రాధిక మాట్లాడుతూ “ఇది మాకు చీకటి రోజు. నా మనసు మొత్తం ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు”అని తెలిపారు. హన్సిక మాట్లాడుతూ “దేశంలోనే ఓ గొప్ప నాయకుడు కరుణానిధి. ఆయన మృతి తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను”అని చెప్పారు. ఖుష్బూ మాట్లాడుతూ “నెల రోజుల క్రితం కరుణానిధిని కలిశాను. గొప్ప నాయకుడైన ఆయనను కలవడం అదే చివరిసారి అవుతుందని ఊహించలేదు. ఆయన మనకు దూరం అవడంతో ఎంతో బాధగా ఉంది”అని అన్నారు.

Comments

comments