Home ఎడిటోరియల్ కరుణానిధి సాహిత్యపయోనితి

కరుణానిధి సాహిత్యపయోనితి

Karunanidhi is basically a writer as he jumped into politics

మైకోవ్ స్కీ కవిత్వంలోంచి రాజకీయాల్లోకి దూకినట్టుగానే కరుణానిధి కూడా మౌలికంగా రచయిత. సాహి తీ రంగంలో కృషి చేస్తున్న క్రమంలోనే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. మొద ట ద్రవిడ కగజం, ఆ తర్వాత ద్రవిడ మున్నేట్ర కగజం (డి.ఎం.కె.) ఆయనను రాజకీయాల్లోకి దింపాయి. ద్రవిడ ఉద్యమం స్వాభిమాన ఉద్యమం. కరుణానిధి జన్మించింది అట్టడుగున ఉండే సామాజిక వర్గంలో కనక పెరియార్ రామస్వామి నాయకర్ నాయకత్వంలో కొనసాగిన స్వాభిమాన ఉద్యమం ఆయనను బాగా ప్రభావితం చేసింది. ద్రవిడ రాజకీయాలు సమయానుగుణంగా అనేక మలుపులు తిరిగి, కొత్త రూపు సంతరించుకున్నప్పటికీ కరుణానిధి తాత్విక ధోరణి కడదాకా ఆయనను ముందు సామాజిక కార్యకర్తగా తయారు చేసిన ద్రవిడ ఉద్యమంతోనే ముడివడి ఉంది. చిన్న నాట నాటకాలు రాసే వారు. ఆ తర్వాత సినిమా రంగంలో స్క్రిప్ట్ రచయితగా సుస్థిర స్థానం సంపాదించారు.

తమిళ భాష అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. మరో భాషలో మాట్లాడిన సందర్భాలు తక్కువ కనక ఆయనకు మరే భాష రాదనుకునే ప్రమాదం లేకపోలేదు. కాని ఆయనకు ఇంగ్లీషు బాగా వచ్చు. తెలుగు తెలుసు. విద్యాధికుడు కాకపోయినా తమిళంలో పాండి త్యం ఉన్న వారు. ద్రవిడ ఉద్యమ నాయకుల్లో చాలా మంది రచయితలున్నారు. చాలా మందికి సినిమా రంగంతోనూ పరిచయం ఉంది. అన్నాదురై కూడా సినీ రచయితే. కానీ కరుణానిధి ఆ రంగంలో అన్నా దురైకన్న ఎక్కువ ప్రసిద్ధుడయ్యారు. కౌమార దశలో చేతి రాతతో కరపత్రాలు రాసి పంపే వారు. ఆ కరపత్రాల పంపిణీయే తర్వాత మురసోలి (భేరీనాదం) పత్రికగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు డి.ఎం.కె తరఫున అనేక ప్రచురణలు వెలువడేవి. మురసోలి పత్రిక ఇప్పటికీ ఉంది. బడుగు జనాలకు చదువు విలువ తెలియజేయడంకోసం డి.ఎం.కె. పఠన మందిరాలు నిర్వహించేది. అక్కడకు వచ్చే వారు తీవ్ర రాజకీయ చర్చల్లో మునిగిపోయే వారు. ఆ రకంగా జనం మధ్య బంధం గట్టిపడేది.

1969లో కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా ప్రచురణలన్నీ ఆగిపోయాయి. మురసోలి డి.ఎం.కె. అధికార పత్రిక అయింది. అందులో కరుణానిధి నిరంతరం రాసే వారు. కార్యకర్తలకు లేఖలు రాసే వారు. ఆయన రచనా శైలి రమణీయంగా ఉండేది కనక డి.ఎం.కె. పార్టీకి చెందని వారు సైతం ఆయన రాతలను ఆదరించేవారు. రాతలోనే కాక మాటలోనూ ఆయనకు వాడి ఎక్కువ. మాటకుమాట బదులివ్వడంలో దిట్ట.
ముఖ్యమంత్రి అయిన దాదాపు నెలరోజులకు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ని కలుసుకుని అనావృష్టి పీడితులను ఆదుకోవడానికి అయిదు కోట్ల రూపాయలు కేటాయించాలని అడిగారు. ‘నా పెరట్లో చెట్లకు డబ్బులు కాయడంలేదు‘ అని మొరార్జీ అన్నప్పుడు చటుక్కున ‘డబ్బులు కాయని చెట్లు మీ పెరట్లో ఎందుకు?‘ అని మాటకుమాట బదులిచ్చారు. మరో సందర్భంలో 1971 శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు, డి.ఎం.కె.కు పొత్తు కుదిరింది. కానీ కాంగ్రెస్‌కు 15 సీట్లే కేటాయించినందుకు కాంగ్రెస్ నాయకుడు సి. సుబ్రహ్మణ్యం ‘ఇది మా ఆత్మ గౌరవానికి భంగం’ అన్నారు. ‘అసలు మా ఉద్యమమే ఆత్మగౌరవ ఉద్యమం’ అని కరుణానిధి చురక అంటించారు.

ఎమర్జెన్సీ సమయంలో జైళ్లల్లో ఉన్న పార్టీ నాయకుల కుటుంబాలకు పార్టీ తరఫున నెలకు రెండు వందల రూపాయలు పంపించేవారు. అద్వితీయమైన వక్తగా పేరున్న వెట్రికొండన్ తన భార్యకు నెలకు వందరూపాయలే అందాయని ఫిర్యాదు చేశారు. ‘మరో వంద రూపాయలు మీ రెండో భార్యకు పంపించాం’ అని కరుణానిధి తడుముకోకుండా సమాధానమిచ్చారు. ఈ ఉదంతాన్ని 2003 సెప్టెంబర్‌లో విల్లుపురంలో జరిగిన డి.ఎం.కె. మహాసభలో ఆయనే వివరించారు. ‘నాకూ ఇద్దరు భార్యలు ఉన్నారూ అని నవ్వుతూ చెప్పారు.

ద్రవిడ ఉద్యమ నాయకులైన పెరియార్, అన్నా దురై కూడా వాడిగానే రాసే వారు. వీరి శైలితో పాటు సుబ్రహ్మణ్య భారతి ప్రభావం కూడా కరుణానిధి మీద ఉంది. అయితే ఆయన రచనల్లో ద్రవిడ సాహిత్య పలుకుబడి, నుడికారం పాళ్లెక్కువ. సాహిత్యం సామాజిక పరివర్తనకు తోడ్పడాలని ఆయన గట్టిగా నమ్మే వారు. ఆయన ప్రధానంగా సినీ రచయితగానే ప్రసిద్ధుడైనా అక్కడా తాను విశ్వసించిన సాంఘిక దురాచారాలకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగానే తన పదునైన కలాన్ని ప్రయోగించారు. సినిమా రచన స్వతంత్రమైంది కాదు. సినిమా అవసరాన్నిబట్టి రాయవలసి వస్తుంది కనక సహజంగానే పరిమితులు ఉంటాయి. అయినా కరుణానిధి తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా సినిమాల్లోనూ ప్రతిఫలించారు. తమిళ ప్రాచీన సాహిత్యాన్ని ఆయన సామాజిక దృక్కోణం నుంచి వ్యాఖ్యానించేవారు.

ఆయన వాక్యమూ కవితాత్మకమే. వచనంలో కవిత్వం తొణికిసలాడేది. ఆయన కవిత్వం చూస్తే తమిళ భాషపై ఆయనకున్న పట్టు ఏమి టో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, వక్తల హావభావాల గురించిన రచనలు మన్నన పొందా యి. ముఖ్యంగా పెరియార్, అన్నాదురై హావభావాల గురించి రాసినవి విశేష జనాదరణ పొందాయి.
ఆయన రాసిన స్క్రీన్ ప్లేలు, మాటలు కుల వ్యతిరేక, మతతత్వ వ్యతిరేక ధోరణులను ఎండగట్టడానికే వినియోగించుకున్నారు. ఎం.జి. రామచంద్రన్ సినీ నటుడిగా ప్రసిద్ధుడు కావడానికి ఆయన నటనా కౌశలం పాత్ర ఎంత ఉందో కరుణానిధి కలం దన్ను కూడా అంతే ఉంది. ఎం.జి.ఆర్. నటించిన తొమ్మిది సినిమాల రచయిత ఆయనే. ద్రవిడ కగజం నుంచి చీలిపోయి డి.ఎం.కె. అర్పాటు చేసిన తర్వాత అన్నాదురై, కరుణానిధి సినీ రంగాన్ని ఆసరాగా చేసుకుని తమ రాజకీయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినిమా ద్వారానే శిలప్పధికారం లాంటి ప్రాచీన రచనలు జనానికి అందాయి. కరుణానిధి సినిమాల్లో రాసిన మాటలు జనాన్ని ఉర్రూతలూగించాయి.

1972లో ఎం.జి.ఆర్. డి.ఎం.కె. నుంచి విడిపోయి అన్నా డి.ఎం.కె. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సినీ నటుడు ముత్తు సినిమాలకు కరుణానిధి రచయితగా ఉన్నారు.

రాజకీయాల్లో తలమునకలై ఉన్నా, వయసు మీద పడ్డా కరుణానిధి కలానికి విశ్రాంతి లేదు. టీవీలకూ రాసేవారు. ఆరేడేళ్ల కిందటి దాకా ఆయన రాస్తూనే ఉన్నారు. తమిళనాట రాజకీయాలకూ సినిమాలకూ బంధం ఉంది. సినిమాల్లో రాజకీయ, సామాజిక అంశాలకు స్థానం కల్పించినందువల్లే ఈ బంధం గట్టిపడి ఉంటుంది. కరుణానిధిని భాషను ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు. తమిళ భాష మీద ఆయనకున్న అపారమైన అభిమానం కారణంగానే 2004 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం తమిళానికి ప్రాచీన భాష హోదా కల్పించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా నిరంతరం ఈ దిశగా ఆయన చేసిన కృషి పాత్ర కచ్చితంగా ఉంది.

తిరుక్కురళ్ రాసిన తిరువళ్లువర్ అంటే కరుణానిధికి అపారమైన అభిమానం. 1970లో చెన్నైలో డి.ఎం.కె. ప్రభుత్వం తిరువళ్లువర్ స్మారక కేంద్రం ఏర్పాటు పని ప్రారంభించింది. ఆ స్మారక చిహ్నం పూర్తి కాక ముందే 1976 జనవరిలో డి.ఎం.కె. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత డి.ఎం.కె. మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అక్కడే జరిగింది. రెండవ సహస్రాబ్ది ఆరంభ సందర్భంలో కన్యాకుమారిలో 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

2006లో కరుణా నిధి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 10వ తరగతి దాకా అందరూ తప్పని సరిగా తమిళం చదవాలన్న నిబంధన అమలైంది. కరుణానిధి మౌలికంగా ద్విభాషా వాది. విద్యా సంస్థల్లో ఇంగ్లీషు తప్పని సరి అనే వారు. ఆయన శత్రువులు కూడా ఆయన రచనా నైపుణ్యాన్ని, తమిళ భాషాభిమానాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. రాజకీయాల్లో ఊపిరి సలపక పోయినా భాషాభిమానాన్ని, రచనను వదలకపోవడం కరుణానిధి విశిష్టత.

                                                                                                                                         – ఆర్వీ రామారావ్