Home జాతీయ వార్తలు కశ్మీర్ అసెంబ్లీలో బీఫ్ పార్టీ లడాయి

కశ్మీర్ అసెంబ్లీలో బీఫ్ పార్టీ లడాయి

ఇండిపెండెంట్ సభ్యుడిని
తీవ్రంగా కొట్టిన బిజెపి ఎంఎల్‌ఎలు

main6శ్రీనగర్ : బీఫ్ పార్టీ ఇచ్చాడనే ఆగ్రహంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేను బిజెపి శాసనసభ్యులు గురువారం తీవ్రంగా కొట్టారు. ఇండి పెండెంట్ ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ గోవధపై ఆంక్షలకు నిరసన వ్యక్తం చేసేందుకు కొందరికి గోమాంసంతో విందు ఇచ్చాడని బిజెపి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. గురువారం రషీద్ సభలోకి ప్రవేశించగానే ఒక్క ఉదుటున బిజెపి సభ్యులు ఆయనను చుట్టుముట్టి కొట్టారు. అప్పటికి ఇంకా సభా కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. రషీద్‌పై బిజెపి సభ్యులు దౌర్జన్యం జరుపుతున్న ఫోటోలు టీవీ న్యూస్‌ఛానల్స్‌లో ప్రసారం అయ్యా యి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఒమర్ అబ్దుల్లా ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. జమ్మూ కశ్మీర్‌లో పిడిపి-బిజెపిల సంకీర్ణం అధికారంలో ఉంది. రషీద్ చర్యపై అభ్యంతరాలు ఉంటే దానిపై సభలో చర్చించడానికి వీలుందని, అంతేకాని ఆయన తిండి గురించి ఏకంగా దాడికి దిగడం తగదని అబ్దుల్లా మండిప డ్డారు. దాద్రీలో చేసిన పనినే వీరు ఇక్కడ చేయాలని యత్నించారని విమర్శించారు. దాద్రీలో బీఫ్ సాకుతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన అంశాన్ని ప్రస్తావించారు. ఇండిపెండెంట్ సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే అవామీ ఇత్తేహాద్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. కొందరు ఎమ్మెల్యేలు సకాలంలో అడ్డుకుని, రషీద్‌ను బిజెపి ఎమ్మెల్యేల నుంచి దూరంగా తీసుకుపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పిందని లేకపోతే తీవ్రంగా గాయపడి ఉండేవారని తెలిసింది. ఈ దాడి ఘటనను ఖండిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ గురువారం సభ నుంచి వాకౌట్ జరిపాయి.
బిజెపి నుంచి క్షమాపణలు ఇప్పిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాత ప్రతిపక్షాలు సభకు హాజరు అయ్యాయి. తరువాత సభలో బిజెపి సీనియర్ నాయకులు నిర్మల్ సింగ్ జరిగినదానికి చింతిస్తున్నట్లు తెలిపారు. అయితే రషీద్ బీఫ్ పార్టీ ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గోవధ , బీఫ్ అమ్మకాలు, బీఫ్‌ను కలిగి ఉండటాన్ని నిషేధించే 1862 చట్టాన్ని రద్దు చేయాలని రషీద్, ఎన్‌సి, సిపిఎం ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన బిల్లుపై గురువారమే చర్చ జరగాల్సి ఉంది.