Home ఎడిటోరియల్ సంపాదకీయం : కశ్మీర్‌లో వాతావరణం మారింది!

సంపాదకీయం : కశ్మీర్‌లో వాతావరణం మారింది!

Sampadakeeyam-Logoదాదాపు నాలుగు మాసాలుగా అలజడితో అట్టుడుకుతున్న కశ్మీర్ లోయలో ప్రకృతి సిద్ధమైన వాతావరణంతోపాటు కల్లోల వాతావరణం కూడా చల్లబడింది. 10 వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించాలన్న అధికారుల సాహసోపేత నిర్ణయం కారణమా లేక వేర్పాటు వాదులు సుదీర్ఘ కాల ఆందోళనతో అలసిసొలిసి పోయారా లేక పెద్ద నోట్ల చలామణీని రద్దు చేసిన ప్రధాని మోడీ చర్య వల్ల తీవ్రవాదులకు నిధుల మార్గాలు మూసుకుపోవటం కారణం కావచ్చా? అన్నది మున్ముందుగాని తెలియదు. ప్రస్తుతానికైతే పరీక్షల నిర్వహణ విజయవంతంగా ప్రారంభమైంది. దీర్ఘకాలం స్కూళ్లు మూతపడటంవల్ల 50 శాతం సిలబస్‌నే పరీక్షలకు ప్రాతిపదికగా తీసుకున్నారు. మంగళవారం నాడు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షకు 55,500 మంది విద్యార్థులు – అనగా పేర్లు నమోదు చేసుకున్న వారిలో 98.61 శాతం హాజరైనట్లు స్కూలు విద్య డైరెక్టరేట్ ప్రకటించింది. ఇదొక రికార్డు. చదువుకుని, కెరీర్ నిర్మించుకోవాలని విద్యార్థుల్లో ఉన్న ఆసక్తికిది నిదర్శనం.
పరీక్షల షెడ్యూలును అధికారులు ప్రకటించినపుడు కొన్ని శక్తుల నుంచి తీవ్ర వ్యతి రేకత వ్యక్తమైంది. విద్యార్థుల మిత్రులు అనేక మంది చనిపోవటం, గాయపడటం, అరెస్టు అయి జైల్లో ఉండటంవల్ల పరీక్షలు రాసే మానసిక స్థితిలో వారు లేరనే వాదనలు లేవనె త్తారు. అంతేగాక విద్రోహ శక్తులు స్కూళ్లు తగలబెట్టే దుశ్చర్యలకు పాల్పడ్డారు. మొత్తం మీద 37 స్కూళ్లకు నిప్పు పెట్టి పూర్తిగానో, పాక్షికంగానో నష్టం కలుగజేశారు. పరీక్షల కారణంగా కశ్మీర్ లోయలో చాలా కాలం తర్వాత బస్సులు రద్దీగా తిరిగాయి. అంతర్ జిల్లా బస్సులు కూడా పెరిగాయి. వేర్పాటు వాద శక్తులు,మిలిటెంట్లు వాటిని ఎందుకు అడ్డగించలేకపోయారు?
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని జులై 8న భద్రతా దళాలతో ఎదురు కాల్పుల్లో మరణించిన దరిమిలా వేర్పాటు వాదులు ప్రజలను ముఖ్యంగా యువతను రెచ్చగొట్టారు. గుంపులుగా రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలపై రాళ్లు విసిరే కార్యక్రమం చేపట్టారు. భద్రతా దళాల పెల్లెట్ కాల్పుల్లో 100 మందికి పైగా ఆందోళనకారులు మరణించారు, అనేక వందల మంది గాయపడ్డారు, కొన్ని డజనుల మంది కంటి చూపు కోల్పోయారు. నిరవధికంగా కర్ఫూ అమలు జరిగింది. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా వేర్పాటు వాదులు నిరసన బంద్‌ను వారాల తరబడి పొడిగిస్తూ వచ్చారు. ప్రజల కష్టాలు వర్ణనాతీతం.
వేర్పాటువాద నాయకులు జైళ్లలోనే, గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బుర్హాన్ వనీని ‘అమరజీవి’గా అభివర్ణించి, ఐరాస వేదిక దాకా తీసుకెళ్లిన పాకిస్థాన్ ప్రభుత్వం టెర్ర రిస్టులను మన దేశంలోకి ప్రవేశపెట్టటంతో పాటు కశ్మీరీ యువత మిలిటెన్సీకి అన్ని విధాలుగా తోడ్పడటం తెలిసిందే. అయితే భారత సైన్యం సర్జికల్ దాడి తదుపరి దాని దృష్టి భద్రత వైపు మళ్లింది. సరిహద్దు వెంట, ఆక్రమిక కశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వెంట అనునిత్యం రేంజర్ల కాల్పులు, భారత సైన్యం వాటిని సమర్థతతో తిప్పికొట్టటం, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడితో పాకిస్థాన్ ఒక అడుగు వెనక్కివేయక తప్పలేదు. ఇదే సమయంలో భారత్‌లో పెద్దనోట్ల చలామణీ రద్దు వల్ల మిలిటెన్సీని ప్రోత్సహించే శక్తులకు నిధులు నిలిచిపోవటంతో రాళ్లు విసిరే ఆందోళన సమసిపోయిందంటున్నారు మన రక్షణ మంత్రి మనోహర్ పారీక్కర్. రాళ్లు వేసే ఆందోళనలో పాల్గొంటే రూ. 500 లు, విధ్వంస చర్యలకు పాల్పడితే రూ. 1000 ఇచ్చేవారని అంటూ ఆయన ప్రధాని నిర్ణయాన్ని సమర్థించటానికి దీన్ని ఉపయోగించుకున్నారు.
కశ్మీర్‌లో ప్రశాంతత తిరిగి నెలకొనటం ఆహ్వానించదగింది.అయితే ఇది శాశ్వతమని భావిస్తే పొరపాటవుతుంది. పరీక్షల కాలంలో వేర్పాటు వాదులు తమ నిరవధిక బంద్ పిలుపులను పునరుద్ధరించకపోవచ్చు. ప్రభుత్వం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయ చర్యలకు చొరవ చూపాలి.