Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

క్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి

kashyapజపాన్ ఓపెన్‌లో భారత ప్రాతినిధ్యం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ కశ్యప్.. ఆరోసీడ్ చౌ తైన్ చెన్(చైనీస్ తైపి) చేతిలో ఓటమి చెందాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత షట్లర్ 14-21, 18-21తో పరాజయం చవిచూశాడు. చెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో 2-5తో వెనుకబడిన కశ్యప్ తరువాత పుంజుకొని స్కోరును 9-9తో సమంచేశాడు. అయితే లాంగ్ ర్యాలీలు ఆడిన చెన్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండోగేమ్ మొదట్లో పాయింట్ల కోసం ఇద్దరూ పోటీపోటీగా తలపడడంతో స్కోరుబోర్డు 4-4 వరకు సమంగానే నడిచింది. ఈస్థితిలో మరోసారి బలమైన స్మాష్‌లతో విరుచుకుపడిన చెన్ క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మధ్యమధ్యలో కశ్యప్ పాయింట్లు సాధించినా.. చెన్ ఆధిక్యాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో తియాన్(చైనా)ను చిత్తుచేసిన లీన్‌డాన్(చైనా) సెమీస్‌కు చేరగా, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.2 కరోలిన మారిన్(స్పెయిన్).. వాంగ్ షిజియాన్(చైనా) చేతిలో ఓడింది. మాజీ ప్రపంచ నెం.1లు వాంగ్ యిహాన్, లీ జురుయ్ కూడా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు.

Comments

comments