Home తాజా వార్తలు రామ రగడ

రామ రగడ

పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరణ, గృహ నిర్బంధం
నిరసనగా అర్చక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆత్మాహుతి యత్నం
భజరంగదళ్, విహెచ్‌పి నాయకుల అరెస్టు
స్వామి నివాసం వద్ద భారీగా హిందూ సంస్థల నేతలు, కార్యకర్తలు
కత్తి మహేశ్ నగరంలోకి అడుగుపెడితే మూడేళ్ల జైలు : డిజిపి
మహేశ్‌ను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన పోలీసులు

Katti-mahesh

హైదరాబాద్: శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఒక వర్గం ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మహేశ్‌ను హైదరాబాద్ నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తున్నట్లు డిజిపి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సమాజంలో ఉద్రిక్తతకు కారణమయ్యే వారిపై కఠిన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో మహేశ్‌ను అరెస్టు చేయాలంటూ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. అనుమతి లేకున్నా కార్యక్రమం నిర్వహించి తీరుతామని పరిపూర్ణానంద స్వామి ఉదయం ఆరు గంటలకే పూజలు నిర్వహించేందుకు బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మి గుడికి బయలుదేరడానికి ముం దే ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకుని ఆయనను గడప దాటనీయకుం డా గృహ నిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విహెచ్‌పి, ఇతర హిందూ సంస్థల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ముందుజాగ్రత్త చర్యగా స్వామి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిపూర్ణానంద స్వా మిని గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలని, ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి ఇవ్వాలని భజరంగ్ దళ్, విహెచ్‌పి నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్టా కార్యక్రమానికి అనుమతి నిరాకరించామని పోలీసులు చెప్పడంతో రెచ్చిపోయిన నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమయ్యా రు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసులతో తోపులాట జరిగింది. సుమారు వంద మందిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఈ క్రమంలోనే స్వామి ఇంటి వద్ద తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్ పాండె తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విష యం గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోపక్క మల్కాజ్‌గిరి, ఉప్పల్‌లో బిజెపి కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించాల్సి వచ్చిందో పోలీసు అధికారులు పరిపూర్ణనందస్వామి కి వివరించారు. యాత్రతో శాంతిభద్రతల సమస్య ఏర్పడవచ్చని, అందువల్ల యాత్రను
కొనసాగనివ్వలేమని పోలీసులు స్పష్టంచేశారు. శ్రీరాముడుపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, ఆయనపై పలు పోలీసు స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి.కత్తి మహేష్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ, సోమవారం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు మూడు రోజుల పాదయాత్ర చేయనున్నానని పరిపూర్ణానంద స్వామి పాదయాత్రను ప్రకటించిన సంగతి తెలిసిందే. భక్తులతో కలిసి వెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనుకుంటే తాను ఒక్కడినే పాదయాత్ర చేస్తానని, తన ఒక్కడికి భద్రత కల్పించాలని, ఈ విషయంపై గంటలోపు నిర్ణయం తీసుకోకపోతే భోజనం మానేసి దీక్షలో కూర్చుంటానని స్వామి హెచ్చరించారు. కొద్ది సేపటికే కత్తి మహేష్‌పై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేయడంతో ఆయన శాంతించారు.
కత్తి మహేష్‌కు 6 నెలలపాటు నగర బహిష్కరణ :
అడుగుపెడితే మూడేళ్ల జైలే: డిజిపి మహేందర్‌రెడ్డి
భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని డిజిపి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. శ్రీరాముడిపై వివాదస్పద కత్తి మహేష్ వివాదస్పద వాఖ్యలు చేయడం, వారం రోజులుగా దీనిపై పలు హిందు సంఘాలు, నేతలు పరస్పర ప్రకటనలు చేయడం, చివరకు స్వామి పరిపూర్ణానంద ‘ఆగ్రహ యాత్ర’కు శ్రీకారం చుట్టడంతో డిజిపి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ వివాదంపై వారం రోజుల నుంచి నడుస్తున్న తంతును గమనించిన ఆయన సోమవారం అత్యవసరంగా తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై ఆరు నెలల పాటు ‘హైదరాబాద్ బహిష్కరణ’ వేటు వేసినట్లు ప్రకటించారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కత్తి మహేశ్‌ను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు యత్నిస్తే అది నేరమవుతుందని తెలిపారు. అలా చేస్తే మూడేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారని చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాద్‌లో ప్రశాంతంగా బతకొచ్చని కానీ, సమాజంలో ఉద్రిక్తలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని డిజిపి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోతున్నామని తెలిపారు. పోగ్రామ్ కోడ్‌ను అతిక్రమించిన ఛానళ్లకు నోటీసులిచ్చామని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయని, ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలని మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్దిని అడ్డుకున్నవారు అవుతారని చెప్పారు.
ఆంధ్రకు తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు…
కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు పడగానే టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కత్తి మహేష్‌ను అప్పగించినట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీసులు వారితో కలిసి ప్రత్యేక వాహనంలో భారీ బందోబస్తు మధ్య శంషాబాద్ మీదుగా చిత్తూరుకు తరలించినట్లు తెలిసింది.
కత్తి మహేష్‌ని జీవితకాలం నిషేధించండి: ఎమ్‌ఎల్‌ఎ రాజాసింగ్
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై ఆరు నెలల నగర బహిష్కరణ సరిపోదని, అతనిపై జీవితకాలం బహిష్కరణ వేటు వేయాలని బిజెపి ఎమ్‌ఎల్‌ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు తమను పోలీసులు అనుమతించలేదని, దీనిపై డిజిపికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ధర్మాగ్రహ యాత్ర చేస్తానన్న పరిపూర్ణానందను హౌస్ అరెస్టు చేశారని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం ఎమ్‌ఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిజెపి ఎమ్‌ఎల్‌ఎ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు.
మండిపడ్డ కత్తిమహేష్ తండ్రి ఓబులేసు…
తన కుమారుడు కత్తిమహేష్‌పై నగర బహిష్కరణ వేటు పడగానే అతని తండ్రి ఓబులేసు తిరుపతిలో మీడియాతో మాట్లాడాడు. పరిపూర్ణనందస్వామిపై మండిపడ్డాడు. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణనందను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. రాముడు గురించి కత్తి మహేష్ మాట్లాడింది నూటికి నూరుశాతం నిజమేనన్నారు. సామాజిక మాధ్యమాల్లో కావాలనే కొంతమంది కత్తి మహేష్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నాడు.