Search
Saturday 22 September 2018
  • :
  • :

భవన్‌లకు ఓకె

KCR announces to construct Self Respect Building complexes

అణగారిన కులాల ఆత్మగౌరవ భవన్‌లకు 71 ఎకరాలు, రూ. 70 కోట్లు                                                                  గోపాలమిత్రల, రెండవ ఎఎన్‌ఎంల వేతనాలు పెంపు                                                                                            మిడ్‌మానేరు బాధితులకు పరిహారం                                                                                                                      ప్రగతిసభకు ముందు కేబినెట్ భేటీలో ఆమోదం                                                                                                          త్వరలో మరో మంత్రివర్గ సమావేశం, మరికొన్ని నిర్ణయాలు 

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు జరిగిన మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మగౌరవ భవన్’లకు ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల్లోని 36 కులాలకు 68.30 ఎకరాలతో పాటు మైనారిటీలకు 2 ఎకరాలు, గిరిజన తెగలకు మరో ఎకరం చొప్పున మొత్తం 71 ఎకరాలకుపైగా స్థలాన్ని, దాదాపు రూ.70 కోట్ల మేర ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రకటనకు మంత్రివర్గ ఆమోదం లభించింది. 2వ ఎఎన్‌ఎంల గౌరవ వేతనాన్ని రూ.21 వేలకు, జాతీయ పట్టణ ఆరో గ్య మిషన్‌లోని ఎఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులకు కూడా వేతనాల్ని పెంచడానికి ఆమోదం తెలిపింది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న సుమారు 27 వేల మంది ‘ఆశా’ వర్కర్లకు వేతనాన్ని పెంచేందుకు ఆమో దం తెలిపింది. మిడ్‌మానేరుకు గతంలో గండిపడినప్పు డు నష్టపోయిన కుటుంబాలకు తలా రూ. 4.20 లక్షల చొప్పున మొత్తం రూ. 28.40 కోట్లను ఇవ్వడాని కి మం త్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే మరోమా రు మంత్రివర్గ సమావేశం ఉంటుందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి లు ‘ప్రగతి నివేదన’కార్యక్రమంలో ఉండిహాజరుకాలేదు.

ఆత్మగౌరవ భవన్‌లకు స్థలం కేటాయింపు
వెనకబడిన తరగతుల్లోని 36 కులాలకు ఆత్మగౌరవ భవన్‌లను నిర్మించే నిమిత్తం 68.30 ఎకరాల స్థలాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరిస్తూ, రాష్ట్రంలో 50%కి పైగా జనాభా వెనకబడిన కులాలకు చెందినవారేనని, వీరికి హైదరాబాద్‌లో ‘ఆత్మగౌరవ భవన్’లను నిర్మించే నిమిత్తం ప్రభుత్వం స్పష్టమైన హామీని ఇచ్చిందని, ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించిందని, మంత్రివర్గ సమావేశంలో దాన్ని చర్చించి ఆమోదం తెలిపినట్లు వివరించారు. గతంలో రావ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్ట్‌కు పది ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ మరో ఐదు ఎకరాలు రెడ్డి హాస్టల్ నిమిత్తం కావాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తిని మంత్రిమండలి చర్చించి సానుకూలంగా స్పందించిందని తెలిపారు. సంచారజాతులకు ప్రస్తుతం హెచ్‌ఎండిఏ ఆధీనంలో ఉప్పల్ భగాయత్‌లో ఉన్న స్థలంలో గరిష్టంగా పది ఎకరాలతో పాటు పది కోట్ల రూపాయలను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 68.30 ఎకరాల స్థలలో ప్రస్తుతం ఒక్క ఎకరం మినహా మిగిలినదంతా సిద్ధంగా ఉందని తెలిపారు. మైనారిటీలకు రెండు ఎకరాలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో ఇవ్వనున్నామని,, గిరిజన సంక్షేమం కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో ఒక ఎకరం స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ముదిరాజ్, మున్నూరుకాపు, విశ్వబ్రాహ్మణ, కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ (గౌడ్)లకు ఐదు ఎకరాల చొప్పున, శాలివాహన (కుమ్మరి), అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్, రజక, గంగపుత్ర తదితర కులాలకు మూడు ఎకరాల చొప్పున, తెలంగాణ మరాఠా మడల్, పెరిక, సగర/ఉప్పర, దూదేకుల, నాయీబ్రాహ్మణ తదితర కులాలకు రెండు ఎకరాల చొప్పున స్థలాన్ని, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఈ కులాలకు చెందిన సంఘాలు వెయ్యి, రెండు వేల గజాల చొప్పున స్థలం కావాలంటూ పలుమార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు చలించలేదని, ఉద్యమ సమయంలో వెనకబడిన తరగతులకు ఇచ్చిన హామీ మేరకే ఇప్పుడు ముఖ్యమంత్రి పై నిర్ణయం తీసుకున్నారని, మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈటల రాజేందర్ వివరించారు. బిసిల సంస్కృతి అవసరాలు, వారికి భరోసా కల్పించే నిమిత్తం ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పది కులాలకు ఆత్మగౌరవ భవన్‌లకు రంగారెడ్డి జిల్లా కోకాపేటలో స్థలాలను కేటాయించగా 25 కులాలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇస్తున్నట్లు తెలిపారు.

వేతనాల పెంపు
రాష్ట్రంలో పనిచేస్తున్న ‘గోపాలమిత్ర’లకు ప్రస్తుతం ఇస్తున్న మూడున్నర వేల రూపాయల గౌరవ వేతనాన్ని రూ. 8,500కు పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈటల రాజేందర్ వివరించారు. హిందు ఆలయాల్లో ఇటీవలికాలంలో అర్చకులు (పురోహితులు) దొరకడంలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యం ధూపదీప నైవేద్యాలు కొనసాగేలా వారి పదవీ విరమణ వయసును 58 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళకు పెంచుతున్నట్లు తెలిపారు. వైద్యారోగ్య రంగంలో పనిచేస్తున్న సుమారు 27,045 మంది ‘ఆశా’ కార్మికులకు ప్రస్తుతం అందుకుంటున్న రూ. 6,500 వేతనాన్ని రూ. 7,500కు పెంచుతున్నట్లు తెలిపారు. సెకండ్ ఏఎన్‌ఎంలుగా కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ప్రస్తుతం అందుకుంటున్న రూ. 11 వేల వేతనాన్ని రూ. 21 వేలకు, వైద్యుల వేతనాన్ని రూ. 36 వేల నుంచి రూ. 40 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పథకం కింద పనిచేస్తున్న సుమారు తొమ్మిదివేల మంది ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్స్‌లు ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల వేతనాలను కూడా పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులు తెలిపారు. మిడ్‌మానేరుకు గతంలో వరదలు వచ్చి గండి పడినప్పుడు ఇబ్బందులు పడిన మనువాడ గ్రామస్తులు తమను వేరే ప్రాంతానికి తరలించవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, పరిశీలించిన ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 4.20 లక్షల చొప్పున మొత్తం రూ. 28.40 కోట్లను చెల్లించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హరీశ్‌రావు వివరించారు.

మరోమారు మంత్రివర్గ సమావేశం
ప్రస్తుత మంత్రివర్గంలో చర్చించిన అంశాలకు అదనంగా చర్చకు వచ్చినవాటి గురించి పాత్రికేయులు ప్రశ్నించగా, ముఖ్యమైన అంశాలపై మరోమారు మంత్రివర్గ సమావేశం ఉంటుందని, త్వరలోనే అది జరిగే అవకాశం ఉందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి బదులిచ్చారు. ముందస్తు ఎన్నికల నిమిత్తం అసెంబ్లీని రద్దు చేయడంపై ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి గుర్తుచేయగా, త్వరలోనే మరోమారు సమావేశం ఉంటుందని బదులిస్తూ స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు. మరోమారు మంత్రివర్గ సమావేశం గురించి మంత్రులు చెప్పిన గంట వ్యవధిలోనే ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ తరఫున ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి నుంచి అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సర్కులర్ జారీ అయింది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశానికి ఆయా శాఖల తరఫున ప్రతిపాదనలను ఈ నెల 4వ తేదీ సాయంత్రంకల్లా సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ఆ సర్కులర్‌లో జోషి పేర్కొన్నారు. ‘సర్కులేషన్’ పద్ధతిలో అనుమతి పొంది మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందేలా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకల్లా అందేలా పంపాలని, అప్పుడే మంత్రివర్గ సమావేశం ముందు పెట్టడానికి వీలవుతుందని జోషి పేర్కొన్నారు.

Comments

comments