Home తాజా వార్తలు అబద్ధాల మోడీ…

అబద్ధాల మోడీ…

Modi Vs Kcr

మోడీ : నిజామాబాద్ పట్టణాన్ని లండన్ నగరంలా మారుస్తానని కెసిఆర్ చెప్పారు. స్మార్ట్ సిటీ చేస్తాననీ అన్నారు. పట్టణంలో తాగునీటికి ప్రజలు అలమటిస్తున్నారు. హెలికాప్టర్‌లో వస్తూ పట్టణాన్ని చూశా. వెనకబడిన ప్రాంతంగా ఉంది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లండన్ ఎలా ఉంటుందో ఐదేళ్లు అక్కడ ఉండి చూసి రండి.
కెసిఆర్ : మోడీ ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అని నేను అనుకోలేదు. నిజామాబాద్‌లో కరెంటు, మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నేను సవాల్ చేస్తున్న. సభ పెట్టి ప్రజలనే అడుగుదాం. ఇప్పుడే నేను హెలికాప్టర్ వేసుకుని వస్తా. నువు కూడా రా. ప్రధాని స్థాయిలో ఉండి ఇంత అల్పంగా మాట్లాడవచ్చా? ఓట్ల కోసం అబద్ధాలు ఆడొద్దు. రాసిచ్చిన స్క్రిప్టుపై ఆధారపడొద్దు. తెలంగాణలో దిక్కుమాలిన రాజకీయం వద్దు. మీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీయే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉందని చెప్పింది. తెలంగాణలో కరెంటు లేదంటరా? అర్థముందా ఏమైనా? నేను భయపడే వ్యక్తిని కాదు.

మన తెలంగాణ / ఆమనగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, హాలియా, మునుగోడు, ఆలేరు, హైదరాబాద్ : విద్యుత్ విషయంలో తెలంగాణ గడ్డమీద పచ్చి అబద్ధాలు మాట్లాడాటరంటూ ప్రధాని నరేంద్రమోడీపై ముఖ్యమంత్రి కెసిఆర్ విరుచుకుపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు ఆధారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, కరెంటు సక్రమంగా లేదని చేసిన వ్యాఖ్యలను నిరూపించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా మహబూబ్‌నగర్ వేదికగా మంగళవారం జరిగిన బహిరంగసభలలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఇంత తెలివితక్కువోడని తాను అనుకోలేదని, కండ్లు ఉన్నయో లేవోగానీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు మీద ఆధారపడి పచ్చి అబద్ధాలు మాట్లాడారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లోని ఎనిమిది సభల్లో పాల్గొనే నిమిత్తం మంగళవారం ఆమనగల్‌లో జరిగిన కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి సభతో మొదలుపెట్టి మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, హాలియా, మునుగోడు, ఆలేరు ని యో గజకవర్గాల సభల్లో పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రభుత్వంలో కరెంటు, మంచినీళ్ళ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడే హెలికాప్టర్‌లో వచ్చి ప్రజలముందే తేల్చుకుందామని, అందుకు సిద్ధమాఅని సవాల్ విసిరారు. కరెంటు విషయంలో ప్రజల సమక్షంలోనే సభ పెట్టి వాస్తవమేందో తెలుసుకుందామని, నిజంగా నిజామాబాద్ ప్రజలు కరెంటుతో ఇబ్బంది పడుతున్నరో లేదో వారినే అడిగి అక్కడికక్కడే తేల్చుకుందామని స్పష్టం చేశారు. ప్రజలు కరెంటుకు ఇబ్బంది పడుతున్నట్లు నిజామాబాద్ వేదికగా చేసిన ఆరోపణలపై వాస్తవాన్ని తెలుసుకుని జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మోడీకి స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అవాస్తవాలు, గలీజు మాటలు మాట్లాడడం సమంజసం కాదని, ఇది ఆలోచించాల్సిన విషయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి మోడీ, చంద్రబాబులు ఢిల్లీలో 2014 లోనే కుట్రలు చేసి కూల్చేసే ప్రయత్నం చేశారని, తెలంగాణ పట్ల అక్కర ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రమాదాన్ని గుర్తించి తనకు వివరించారని కెసిఆర్ గుర్తుచేశారు.
ప్రధాని స్థాయికి అబద్ధాలు తగదు
గ్రహచారం బాగలేక ప్రధాని మోడీ మనతోటి పెట్టుకున్నడని వ్యాఖ్యానించిన కెసిఆర్ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడడం సహేతుకం కాదన్నారు. తెలంగాణలో కరెంటు లేదని, 24 గంటల కరెంటు ఉందంటూ కెసిఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నాడంటూ ప్రధాని మోడీ నిజామాబాద్ వేదికగా వ్యాఖ్యానాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని స్థాయిలోనే ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో గోల్‌మాల్ ఉంటదని కెసిఆర్ అన్నారు. ప్రధాని తన వ్యాఖ్యలపై ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. “ప్రధాని ఇంత తప్పుడు మాటలు మాట్లాడవచ్చునా? ఇంత అల్పంగా, తక్కువ స్థాయిలో మాట్లడతాడా? వాస్తవాలు తెలుసుకోకుండా ఎట్ల మాట్లాడతాడు? అవును& మాట్లాడతాడు. ఎందుకంటే, ఈ దేశంలో అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. అంత నీచమైన రాజకీయం ఉంది. వారి పార్టీ అధ్యక్షుడు కూడా ఇంతకుముందు అడ్డం పొడుగు మాట్లాడిండు. రుజువు చేయాలని అప్పుడే సవాల్ చేశాను.

లేదంటే క్షమాపణ చెప్పి ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశాను. ఇప్పుడు కూడా నేను మోడీని ఛాలెంజ్ చేస్తున్నా.” అని ప్రధాని వ్యాఖ్యలపై కెసిఆర్ ఘాటుగానే స్పందించారు. నిజానికి తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోయే పరిస్థితి లేదని, కానీ రాజకీయాల కోసం ప్రధాని ఈ అంశాన్ని వాడుకోవడం సరైంది కాదని అన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనపై వాస్తవానికి విరుద్ధమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని ప్రధానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘కేంద్ర విద్యుత్ ప్రాథికార సంస్థ’ ఇటీవల అన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ పరిస్థితిని అధ్యయనం చేసి దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తించిందని, జాతీయ సగటుతో పోలిస్తే కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నట్లు కితాబు ఇచ్చిందని, దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీకి ఈ విషయం తెలియదా అని కెసిఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉందిగదా, అక్కడ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తోందా అని మోడీని ప్రశ్నించారు.
నేను పూజలు చేసుకుంటే మోడీకేం కష్టం?
“కెసిఆర్‌కు పూజల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని ప్రధాని మోడీ మాట్లాడుతున్నాడు. నేను చేసుకునే పూజలతో ఆయన ముల్లేం పోయింది. నేను ఏడాదికి పది సార్లు చేసుకుంట. నీకేం నష్టం? పూజలు చేసి ప్రజలకు అన్నం పెడుతు న్న, తీర్థం పోస్తున్న. ఇష్టముంటే నువ్వు కూడా రా. అన్నం, తీర్థం తీసుకుని పో. నేను వద్దంటనా? నాకు భక్తి ఉంది పూజ లు చేస్త. నీకేం నష్టమొచ్చె?” అని కెసిఆర్ చమత్కరించారు.
అసెంబ్లీని ఎందుకు రద్దు చేశానంటే ?
ఐదేళ్ళ కాలం పూర్తిచేయకుండా మధ్యలోనే అసెంబ్లీని రద్దు చేశాడంటూ తనమీద ప్రధాని ఆరోపణలు చేశారని, అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు ఇప్పటికే వివరించానని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీని మధ్యలోనే ఎందుకు రద్దు చేసిన? అధికారం అనుభవించలేక చేసిన్నా? ఉత్తగనే చేసిన్నా? కష్టపడి పాలమూరులో ప్రాజెక్టులు కడుతున్నం. ఇదే జిల్లాకు చెందిన ప్రతిపక్షాల నాయకులు, ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్న ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులు కేసులు వేశారు. వారికి గట్టగా సమాధానం చెప్పి ఐదేళ్ళ పాటు రాష్ట్ర అభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరడానికి సిద్ధమయ్యాను” అని కెసిఆర్ వివరణ ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందినవారు పది కేసులు వేశారని గుర్తుచేశారు.
మోడీకి మత గజ్జి
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గిరిజనుల, ముస్లింల జనాభా పెరిగిందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాల్సిన అవసరం ఉందని భావించి రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటికీ అతీగతీ లేదని ప్రస్తావించిన కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వ్యవస్థ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధాని మోడీకి మత గజ్జి ఉందని, ఆయనకు ముస్లింలన్నా, పేదలన్నా పడదని, అందుకే ముస్లిం రిజర్వేషన్ల బిల్లును తిప్పి పంపించారన్నారు. రిజర్వేషన్లను ఇచ్చేదే లేదని బిజెపి నాయకుడు అమిత్‌షా తెలంగాణ గడ్డమీదనే వ్యాఖ్యానిస్తున్నాడుగానీ, కేంద్రం మెడలు వంచి సాధిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. కెసిఆర్ మొండోడని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే పట్టుబట్టి దాన్ని సాధించేదాక తగ్గడని, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నోళ్ళకు గిరిజనుల, ముస్లింల రిజర్వేషన్లు ఒక లెక్కా అని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డమీదకొచ్చిన ప్రధాని మోడీ గిరిజనులకు రిజర్వేషన్ల పైలును ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని, నీతి నిజాయితీ ఉంటే, రాష్ట్రం హక్కుల్ని ఎందుకు గౌరవించలేదో, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారో వివరణ ఇచ్చినంకనే ఢిల్లీకి పోవాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.
భయపడడానికి నేనేమైనా చంద్రబాబునా?
తెలంగాణ గడ్డమీద అబద్ధాలు మాట్లాడితే ఎవరినీ వదిలేదు లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ నిజామాబాద్ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. “ప్రధాని తప్పుడు మాటలు మాట్లాడితే ఎట్ల అర్థం చేసుకోవాలి? వాస్తవాల్ని చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి? నేను ఎవరికీ భయపడేవాడిని కాను. నేనేమైనా చంద్రబాబునా భయపడడానికి? నేనెందుకు భయపడతా? ఏం ఉందని నేను భయపడాలి? నాకేం లేదు.. నాదంతా తెరచిన పుస్తకం. నేను ఎవరికీ భయపడను. ఆ అవసరం కూడా లేదు” అని కెసిఆర్ కుండ బద్దలు కొట్టినట్లు మహబూబ్‌నగర్ వేదికగా స్పష్టం చేశారు. తనకు ఏ అవసరాలూ లేవని, భయపడడానికి ఏ కారణమూ లేదు అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంతో గెలిపించారు
ఈ జిల్లాకు చెందినవాడిని కాకపోయినా, సిద్దిపేట నుంచి వచ్చినా ఉద్యమ సందర్భంలో ఇక్కడి నుంచే తాను పోటీ చేశానని, ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తనను గెలిపించారని, ఇక్కడ ఎంపిగా ఉండే తెలంగాణను సాధించానని మహబూబ్‌నగర్ బహిరంగసభలో కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమం సమయంలో తాను, జయశంకర్ కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారని, ఈసారి తప్పకుండా పాలమూరు పార్లమెంటుకు పోటీ చేయాలన్నారని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఈ ప్రతిపాదనతో పార్టీలోనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేసి జయశంకర్‌పై కోపపడ్డారని అన్నారు. స్థానికుడు కాని కెసిఆర్‌ను పాలమూరుకు పంపిస్తే ఓడిపోతారని, అది బాగుండదుకదా అంటూ జయశంకర్‌కు ఆ కొద్దిమంది వివరించారని పేర్కొన్నారు. కెసిఆర్‌కు పాలమూరు, ఆదిలాబాద్& ఇలా ఒక ప్రాంతమంటూ ఉండదని, ఎక్కడకు పోయి నా గెలుస్తాడని, తెలంగాణ అంతా ఆయనదే అని జయశంకర్ వివరించి నేతలకు భరోసా కల్పించారని కెసిఆర్ పేర్కొన్నారు.
పాలమూరు ‘ఇజ్జత్ కా సవాల్’
“ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు అతి పెద్ద ఛాలెంజ్ ఉంది. ముఖ్యంగా పాలమూరు ప్రజల ముందు ఉంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రమాదం వచ్చిపడింది. వ్యక్తుల గురించి మాట్లాడువద్దనుకున్నాను కానీ తప్పడంలేదు. చంద్రబాబు తొమ్మిదేళ్ళు ఈ జిల్లాను దత్తత తీసుకుని ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మనకు సంబంధం లేదు. అయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఉత్తరాలు రాసి సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు మనిషే మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నడు. వ్యవసాయానికి నీళ్ళు రానియ్య అని చెప్పెటోడి మనిషి పోటీ చేస్తున్నడు. మనం రక్తం లేకుండ ఉన్నమా? రెండు చేతులూ జోడించి కోరుతున్న. అలాంటి వ్యక్తులకు, పార్టీలకు డిపాజిట్ పోగొట్టాలి. తెలంగాణలో వలసాధిపత్యం, ఆంధ్ర రాజకీయం చెల్లదని నిరూపించాలి. ఈ జిల్లా, ఈ నియోజకవర్గ ప్రజల ముందు ఈ ఛాలెంజ్ ఉంది” అని కెసిఆర్ వివరించారు.

ఎంపిగా ఈ జిల్లా ప్రజలు తనను గెలిపించినప్పుడు ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు శ్రీనివాసగౌడ్‌ను మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలిపిస్తే అంతే సంతోషపడతా అని అన్నారు. హేమసముద్రం చెరువు కట్టాలని, 10 టిఎంసిలు ఉండాలని, కరివెన నుంచి నీటిని తీసుకొచ్చి నింపాలని శ్రీనివాసగౌడ్ కొట్లాడుతుంటే టిడిపి అభ్యర్థి వద్దంటడని, అలాంటి అభ్యర్థి తెలంగాణ అవసరాలకు ఉపయోగపడతడా అని ప్రజలను కెసిఆర్ ప్రశ్నించారు. “చంద్రబాబు పెత్తనం మన మీద అవసరమా? అవసరం లేదు. కానీ కాంగ్రెస్ తెస్తోంది. చేత్తోని, కాలుతోని కాకుండా ఓటుతోని రాజకీయంగా ఇద్దరినీ కొట్టాలి. పాలమూరు తీర్పు కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది. తస్మాత్ జాగ్రత్త. ‘పాలమూరుకు కా ఇజ్జత్ కా సవాల్’ అయింది. మన ఆత్మగౌరవానికి ప్రమాదం వచ్చి పడింది. మనలో తప్పులు ఉంటే సవరించుకుందాం. కానీ మనం వలస ప్రమాదంలో పడొద్దు. దరఖాస్తు తీసుకుని విజయవాడ, అమరావతికి పోవాలనా? ఇప్పుడు జరుగుతున్నసంక్షేమం దెబ్బతింటది.

వారికి కరెంటు ఇవ్వడం చేతకాదు. సంక్షేమం ఆగిపోతది. అందుకే కాంగ్రెస్‌ను పంపేయాలి” అని కెసిఆర్ సూటిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ జిల్లాలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, దేవరకద్రల నిల్చున్న ముగ్గురు అభ్యర్థులు మన సాగునీటి ప్రాజెక్టులపై కేసులు వేసిండ్రు. కట్టనీయం అన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో నిల్చున్నరు. ఇదే జిల్లాల వారు పుట్టిండ్రు. ఇట్లాంటోళ్ళు ఉండబట్టే ఈ జిల్లాకు ఇంత దరిద్రం. నేను చెప్పేది నిజమైతే వారి డిపాజిట్టు పోగొట్టండి. అబద్ధమైతే మాకు డిపాజిట్ ఇవ్వద్దు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
మజ్లిస్, టిఆర్‌ఎస్ భాయీభాయీ
టిఆర్‌ఎస్, మజ్లిస్ మిత్రపక్షాలని, ఈ రెండూ పక్కా తెలంగాణ పార్టీలని, కల్తీలేని తెలంగాణ పార్టీలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోరుకున్న పార్టీలు కాబట్టే స్నేహపూర్వకంగా ఉన్నాయన్నారు. 2014లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి ఢిల్లీలో కుట్రలు పన్నారని, ప్రభుత్వాన్ని దించేయాలని వ్యూహం పన్నారని కెసిఆర్ అప్పటి ప్రమాదాన్ని వివరించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని, రాష్ట్రాన్ని అస్థిరపర్చాలని కుట్ర చేశారని, తెలంగాణను గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు ఢిల్లీ నుంచే ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాలంటూ మరుసటి రోజు స్వయంగా కలిసి వివరిస్తానని చెప్పాడని, ఆ విధంగా కుట్ర వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటివరకూ ఒంటరిగా కొట్లాడామని, ఇకపైన తానూ తోడుగా ఉంటా అని అసద్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజే మజ్లిస్ పార్టీ తన కార్యాలయం నుంచి టిఆర్‌ఎస్‌కు ఇచ్చే సహకారం గురించి అధికారికంగా మీడియా ద్వారా తెలియజేసిందని కెసిఆర్ గుర్తుచేశారు. అప్పటి నుంచీ కలిసి పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లిం మైనారిటీ పిల్లలు గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్నారని, పదేళ్ళ తర్వాత కొత్త తరం వస్తుందని, ఒక విప్లవమే సృష్టిస్తుందని, అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో కొట్లాడే స్థాయికి వస్తారని పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి
దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని, నాయకులు, పార్టీలు గెలవడానికి బదులు ప్రజలు గెలవాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం పాల్గొన్న దాదాపు అన్ని సభల్లోనూ ‘ఫెడరల్ ఫ్రంట్’ గురించి గుర్తుచేశారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారుగానీ అంతిమంగా ప్రజల ఆకాంక్షలు, అభీష్టం, వాంఛ గెలవాలని, అప్పుడే ఆ తర్వాతి ఐదేళ్ళలో వారి కోరిక, పనులు నెరవేరుతాయన్నారు. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ఏడు దశాబ్దాలు దాటినా ప్రజాస్వామ్యంలో రావాల్సినంతటి పరిణతి రాలేదన్నారు. ఇందిరాగాంధీ కాలం నుంచి ‘గరీబీ హఠావో’ నినాదం వింటున్నాంగానీ పేదరికం పోలేదు, దరిద్రం పోలేదన్నారు. దేశంలో 70 వేల టిఎంసిల నీళ్ళు ఉన్నా డ్బ్బై ఏళ్ళ పాటు రాజ్యమేలిన కాంగ్రెస్, బిజెపి నాయకుల తెలివికి 30 వేల టిఎంసిలను కూడా వాడుకోలేకపోతున్నామన్నారు. ప్రతీ రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నాయని, పాతికేళ్ళ కింద చైనా దేశం మనకన్నా వెనకబడి ఉందని, ఇప్పుడు మనకన్నా అనేక రంగాల్లో ముందుకు పోయిందని గుర్తుచేశారు. మనకున్నంత వ్యవసాయ భూమి కూడా చైనాలో లేదని, కానీ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బిజెపిల మేధావితనం ఏమైందని ప్రశ్నించారు. ఈ దేశంలో ఇద్దరు దరిద్రులూ (కాంగ్రెస్, బిజెపి) పోవాలని, నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీల దుర్మార్గం ఫెడరల్ ఫ్రంట్ వస్తేనే పోతుందన్నారు. అధికారంతో ఆ రెండు పార్టీలు మదమెక్కి ఉన్నాయని, ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గుర్తించే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంలో ఉండాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే తన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఒక్క బక్కటోడ్ని కొట్టడానికి ఇంతమందా?
“ఒక్క బక్క కెసిఆర్‌ను కొట్టడానికి చాలా మంది మోపయ్యారని, ఒక్కసారిగా తననే లక్షంగా చేసుకుంటున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు సిపిఐ, సిపిఎం.. ఇలా అందరూ తననొక్కడిని ఎదుర్కోడానికి వస్తున్నారన్నారు. “ఎందుకు వీరంతా నా వెంట పడుతున్నారు? ఏం కారణం? ప్రజలు నా వెంట ఉన్నరనేది వారి బాధ. మనం మొండిగా ఉంటం. ముక్కుమీద గుద్దినట్లు చెప్తాం, నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి. కాంగ్రెస్, బిజెపి, గాంధీలందరూ నన్ను తిడుతున్నారు. సిపిఐ, సిపిఎం, టిడిపి& ఇంత మందా ఒక్కడ్ని కొట్టడానికి? ప్రజలే కాపాడాలి నన్ను. అప్పుడు ఉద్యమంలో కాపాడారు. ఇప్పుడు కూడా మీరే కాపాడాలి” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
ఇంతకీ టిఆర్‌ఎస్‌కు ఎవరితో పొత్తు?
“కాంగ్రెస్ లీడర్లేమో నేను బిజెపితో సంబంధాల్లో, పొత్తుల్లో ఉన్న అంటున్నరు. మోడీయేమో నేను కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం పెట్టుకున్న అంటడు. అందరూ నాపైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఇంతకీ నేను ఎవరితో పొత్తు పెట్టుకున్ననో నాకర్థమైతలేదు. ప్రజలే తేల్చాలి. మా పార్టీ ఎవరితో కలసినట్లు? మా ధర్మం ప్రజలకు తెలుసు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాం. ఇప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తున్నం. ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే ఏకైక పార్టీ టిఆర్‌ఎస్. ప్రజలపైన మాకు నమ్మకం ఉంది. వారు గెలిపిస్తరనే విశ్వాసం ఉంది. అందుకే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోతున్నం. కచ్చితంగా ఈ రాష్ట్రలో వందకు మించి సీట్లు వస్తున్నాయి. ఆ తర్వాత 16 ఎంపి సీట్లను కూడా మనమే గెలవాలి” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
సారా నీళ్ళొద్దు… సాగునీరే కావాలి
ఎన్నికల్లో ప్రజలను నమ్ముకుని, నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధి మీద నమ్మకంతో ఒంటరిగా పోటీచేస్తున్నామని, సారా నీళ్ళను నమ్ముతలేమని, సాగునీటిపైనే నమ్మకం పెట్టుకున్నామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ప్రజల స్వీయానుభవంలో ఉన్న అభివృద్ధిని, సంక్షేమాన్ని గతంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో అమలైన ఫలాలను పోల్చుకుని పనిచేసే మంచి నేతలను, పార్టీని ఎన్నుకోవాలని అన్ని సభల్లోనూ ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. నాలుళ్ళళో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని వినూత్న, విప్లవాత్మక పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించడం, మానవీయ కోణంలో స్పందించడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఐదున్నర దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కరెంటు ఇవ్వడం ఎందుకు సాధ్యం కాలేదని కెసిఆర్ ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, కంటివెలుగు, కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పరమపద వాహనాలు& ఇలా అనేకం ప్రజల అవసరాల్లోంచి వచ్చినవేనని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు కనిపించవన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీలు, మాటలను విన్న తర్వాత లోతుగా ఎవరికివారుగా విశ్లేషించుకోవాలని, గ్రామంలో చర్చించుకోవాలని, పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని, సారా నీళ్ళ మాయలో పడొద్దని, సాగునీళ్ళతో జీవితాన్ని నిలబెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

రైతులకు ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇచ్చే రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదని, తెలంగాణలో మాత్రమే అది అమలవుతోందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సాగునీరు అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని, రెండేళ్ళలో ప్రతీ పొలానికి సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తానని, కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే వరకు విశ్రమించనని, తాను బతికున్నంత వరకు వ్యవసాయానికి కరెంటు ఉచితంగానే ఇస్తానని, రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసుకుంటానని, రైతుబంధు, రైతుబీమాలను కొనసాగిస్తానని, రైతులకు ఇప్పుడున్న అప్పులన్నీ తీరిపోయి బ్యాంకు ఖాతాల్లో ఐదారు లక్షల రూపాయలు జమ అయ్యేంత వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా ఆశీర్వాద సభలకు హాజరైన కెసిఆర్ ఆయా నియోజకవర్గాల ప్రజల డిమాండ్లకు అనుగుణంగా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించడం, చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలకు హామీ ఇచ్చారు.
బషీర్‌బాగ్ కాల్పుల నుంచి 24 గంటల వరకు
కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో కరెంటుకు ప్రజలు ఎంత గోసపడ్డరో స్వీయానుభవం అని, కరెంటు ఇవ్వనందుకు, ఛార్జిలు ఇవ్వనందుకు ధర్నా చేస్తున్న రైతులపై బషీర్‌బాగ్‌లో తెలుగుదేశం కాల్పులు జరిపిందని, అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమానికి తాను శ్రీకారం చుట్టానని కెసిఆర్ ఆలేరు సభలో వ్యాఖ్యానించారు. కరెంటు కోతలతో రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని, పొలాల దగ్గర తేలుకాట్లు, పాముకాట్లు సాధారణమైపోయాయని, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం.. వీటన్నింటి నుంచి ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని కెసిఆర్ వివరించారు. చాలా గొప్పవాళ్ళమని చెప్పుకునే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇంతకాలం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పేదిండ్లల్లో ఆడపిల్లల పెళ్ళి గుండె మీద కుంపటిగా ఉన్న భావన నుంచి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా పొందుతున్న లక్ష రూపాయల సాయంతో భరోసా నెలకొనిందని అన్నారు. ఒంటరి మహిళల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్నది లేదని, గొంగిడి సునీత ఇచ్చిన సూచనతో ఇప్పుడు అమలవుతోందని, లబ్ధిదారులు చాలా సుఖంగా ఉన్నారని, ఆమె తోబుట్టువులే కొద్దిమంది తనకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని గుర్తుచేశారు.
మా హైకమాండ్ ప్రజలే
టిఆర్‌ఎస్ పార్టీకి హైకమాండ్ తెలంగాణలోనే ఉందని, అది ప్రజలేనని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఢిల్లీ, అమరావతి లాంటివి ఉన్నా ప్రజల ఆకాంక్షల మేరకు తమ పార్టీ పని చేస్తుంది కాబట్టి నిర్ణయాలు వారి అభీష్టం మేరకే జరుగుతాయన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటున్న పార్టీలు రాష్ట్రంలో అంతటి సంపన్న రైతులు ఎంత మంది ఉన్నారో చెప్పాలన్నారు. 95% మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాత్రమే ఉన్నందున క్రితం సారి మాఫీ చేసినట్లుగానే ఈసారి కూడా మాఫీ చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. గజ్వేల్ మండలంలోని ఒక గ్రామంలో కంటి వైద్య శిబిరం పెట్టినప్పుడు ఒక్క ఊరిలోనే 227 మందికి దృష్టిదోష సంబంధ సమస్యలు ఉన్నట్లు తేలడం ఇప్పుడు అమలవుతున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీని తర్వాత ఇఎన్‌టి, డెంటల్ పథకాలు కూడా వస్తాయని, ఆ తర్వాత హెల్త్ ప్రొఫైల్ వస్తుందన్నారు.

Telangana Elections: KCR Comments on Modi in Telugu

Telangana News