Home ఆఫ్ బీట్ నీటి ప్రాజెక్టుల పరవళ్ళు

నీటి ప్రాజెక్టుల పరవళ్ళు

చెరువులతో మొదలుపెట్టి, భారీ ప్రాజెక్టుల దాకా నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. కోటి ఎకరాల మాగాణం దిశగా పనులు సాగుతున్నాయి. 2015, మార్చి 12న చంద్రశేఖర రావు చేతుల మీదుగా మిషన్ కాకతీయ పథకం ప్రారంభమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సదాశివనగర్ పాత చెరువు పునరుద్ధరణ పనులతో ప్రారంభించిన మిషన్ కాకతీయలో మొత్తం మూడు దశల్లో 23,000కు పైగా చెరువుల్లో పూడికతీత, మరమ్మత్తు పనులు  పూర్తయ్యాయి. దీంతో 8 లక్షలకు పైగా ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఇందులో 57,965 ఎకరాలు చెరువుల కింద కొత్తగా సాగయ్యింది. మొత్తం పూడికతీత కారణంగా ఇప్పటివరకు  7 టిఎంసిల మేర అదనపు నిల్వకు అవకాశం ఏర్పడింది.

KCR

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ కారణంగా 2016 ఖరీఫ్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా పూడిక తీసిన చెరువుల కింద 57.5 శాతం సాగువిస్తీర్ణం పెరిగింది. రబీలో ఇది మరింత పెరిగినట్లు ‘నాబ్కాన్స్’ అధ్యయనంలో తేలింది. భూగర్భజలాలు, పంటల దిగుబడి, పూడికమట్టి కారణంగా తగ్గిన ఎరువులు, చేపల పెంపకం, ఇతరత్రా కార్యకలాపాలతో గ్రామీణ వాతావరణం మారింది. తెలంగాణ రాకముందు పదేళ్లలో 23 జిల్లాలకు కలిపి రూ.94 వేల కోట్లు ఖర్చుచేయగా, ఆవిర్భావం తర్వాత 45 నెలల కాలంలోనే రూ.50 వేల కోట్లు ఖర్చయింది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీరందింది. వచ్చే ఖరీఫ్ నాటికి వీటి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీరందనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రం భీం, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయడంతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలెం, కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి 20 వేల ఎకరాలకు నీరందుతుంది.

పోచంపాడు పునరుజ్జీవ పథకం

శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులకు ఆగస్టు 10, 2017న ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి వచ్చే నీటిని ఎల్లంపల్లి మీదుగా తీసుకువచ్చి, రెండు టిఎంసిల నీటిని వరదకాలువలో పోస్తారు. వరద కాలువ నుంచి ఒక టిఎంసి నీరు మిడ్ మానేరుకు చేరుతుంది. మిగిలిన ఒక టిఎంసిని అదే వరద కాలువపై రివర్స్‌లో ఎత్తిపోసి, శ్రీరాంసాగర్‌కు చేర్చడమే పునరుజ్జీవ పథకం లక్షం. దీంతో శ్రీరాంసాగర్‌పై ఆధారపడ్డ కాకతీయ, లక్ష్మీ కెనాళ్లు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల, లోయర్ మానేరు, సమీప ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి భరోసా కలుగుతుంది.

ఆర్డీఎస్‌కు భరోసా తుమ్మిళ్ల..

రాజోలిబండ చివరి ఆయకట్టుకు భరోసానిచ్చేలా సుంకేశుల బ్యారేజి బ్యాక్‌వాటర్ ఆధారంగా తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో నిర్మిస్తున్న ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్ నాటికి ప్రారంభంకానుంది. ఇందుకోసం గతంలో దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం కోసం తీసుకువచ్చిన పంపులు, పైపులను వినియోగిస్తున్నారు.

దేవాదుల రీడిజైనింగ్

దేవాదులను పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అవసరాలకే వినియోగించేలా రీడిజైనింగ్ చేశారు. దీన్ని పూర్తిగా వాడేలా తుపాకులగూడెం వద్ద గోదావనిపై బ్యారేజి నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో 38 టిఎంసిలుగా ఉన్న కేటాయింపులను 60 టిఎంసిలకు ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు లింగంపల్లి రిజర్వాయర్‌ను 10 టిఎంసిల సామర్ధంతో నిర్మించనున్నారు. దీనికి త్వరలోనే టెండర్లు పిలువనున్నారు.

మహారాష్ట్రతో ఒప్పందం

KCR-with-Padnavis

మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం ద్వారా కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డు తొలిగింది. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్‌గంగపై రాజుపేట, చనకా కొరటా, పిన్‌పహాడ్ బ్యారేజిల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీంతో పాటు అన్నారం, సుందిళ్ల ద్వారా వాడుకునే నీటికి మహారాష్ట్ర అంగీకారం తెలిపింది.

కాళేశ్వరం

కాళేశ్వరం పనులు వేగంగా సాగుతున్నాయి. మేడిగడ్డ నుంచి లిఫ్టు చేసే నీటితో 18 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 21వ ప్యాకేజీలో ఓపెన్ కెనాల్ సిస్టంకు బదులుగా ప్రెషర్ పైపులైన్ సిస్టంను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. గంధమళ్ల, బస్వాపూర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ల నిర్మాణం, సామర్థం పెంచారు. మొత్తం ప్రాజెక్టు అవసరాలకుగాను కాళేశ్వరం కార్పోరేషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా రుణం తీసుకుని, వినియోగించడం మూలంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మొత్తం 74,315 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, 34,410 ఎకరాల సేకరణ జరిగింది. దాదాపుగా అన్ని అనుమతులు కేంద్రం నుంచి రాగా, చివరగా టిఎసి (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ) అనుమతి మాత్రమే రావాల్సి ఉంది.

సీతారామ ఎత్తిపోతల

ఖమ్మం జిల్లా తాగు, సాగు అవసరాలు తీర్చేలా దుమ్ముగూడెం ఎత్తిపోతలను సీతారామ పేరుతో ప్రభుత్వం రీడిజైనింగ్ చేసింది. మండలం రోళ్లపాడు గ్రామ సమీపంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 16,2016న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3.87 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 6.44 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. పాలేరులో భక్తరామదాసు ఎత్తిపోతల నిర్మాణం పూర్తయింది. కేవలం 11 నెలల కాలంలో శంకుస్థాపన, ప్రారంభం జరిగిన ప్రాజెక్టుగా ఘనత దక్కించుకుంది. దీంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల

ప్రభుత్వం తొలి ప్రాధాన్యతలో పాలమూరు రంగారెడ్డి పథకం ఉంది. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 60 రోజుల పాటు 120 టిఎంసిల వరద నీటిని లిఫ్టు చేసి, ఎగువ ప్రాంతాలకు అందించమే లక్షం. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించాల్సి ఉంది. ఐదు దశల్లో నీటిని లిఫ్టు చేస్తారు.

ఆర్. విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం

డిండి ఎత్తిపోతల పథకానికి జలవనరులరంగంలో నిపుణులు, ఏడాది క్రితం దివంగతులైన విద్యాసాగర్‌రావు పేరును ప్రభుత్వం పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచి నీటిని డిండికి మళ్లిస్తారు. ఇందులో రోజుకు అర టిఎంసి చొప్పున మళ్లించి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 3.41 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్నది ప్రణాళిక.
మేజర్, మీడియం ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యం

* 2004 నుంచి 2014, జూన్ వరకు కొత్త ఆయకట్టును 5.82 లక్షల ఎకరాలకు నీరివ్వగా, 92 వేల ఎకరాల స్థిరీకరణ జరిగింది. * తెలంగాణ ఆవిర్భావం నుంచి సెప్టెంబరు, 2017 వరకు కొత్తగా 7.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. 1.08 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. * 201718 కొత్త ఆయకట్టు లక్షం… 9.43 లక్షల ఎకరాలు.

చిన్న నీటిపారుదల కింద సాగునీటి వివరాలు

చిన్న నీటిపారుదల కింద తెలంగాణ ఆవిర్భావం నుంచి సెప్టెంబరు 2017 వరకు సాగునీటి సౌకర్యం . మొదటి దశ మిషన్ కాకతీయలో 3.92 లక్షల ఎకరాల స్థిరీకరణ, రెండో దశలో 1.7 లక్షల ఎకరాలు, మొత్తంగా 5.62 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. కొత్తగా చెరువుల కింద 58 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.  165 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మూడేళ్లలో 1.23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు రాగా, 1 లక్ష ఎకరాల స్థిరీకరణ జరిగింది.