Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అందరికీ ఇఎస్‌ఐ

భవన నిర్మాణ కార్మికులకూ వర్తింపు
రాష్ట్రంలో ఎంత మందికి ఇఎస్‌ఐ లేదో తేల్చాలి
వారికి వర్తించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి
కార్మికులకు మరిన్ని సంక్షేమ చర్యలపై మేడే తరువాత నిర్ణయాలు : సిఎం

KCR-meet-with-labour

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని కార్మికులందరికీ ఇఎస్‌ఐ బీమా సౌకర్యాన్ని కల్పించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని కార్మిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం కార్మిక శాఖ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కెసిఆర్ భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరింపజేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కార్మికు ల్లో ప్రస్తుతం ఎంత మంది ఈ సౌకర్యాన్ని పొందుతున్నారో లెక్కతీసి ఆ సౌకర్యాన్ని పొందలేకపోతున్న కార్మికులందరికీ అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్మికులందరి ఆధార్ కార్డు వివరాలను ఈ సౌకర్యానికి అనుసంధానం చేయాలని, విధిగా కార్మికశాఖ దగ్గర కార్మికులందరి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేశారు. మే దినోత్సవం తర్వాత మరోసారి సమీక్ష నిరవహించి కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనింది. ప్రస్తుతం రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఎంత మంది కార్మికులు ఉన్నారు, ఏ రంగంలో ఎలాంటి పనులు చేస్తున్నారు, వారి ఆరోగ్య అవసరాలు ఎలా ఉన్నాయి, సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందుతున్నాయి, ఎలాంటి బీమా సౌకర్యమైనా వారికి వర్తిస్తోందా, ఇకపైన వీటిని కల్పించాలంటే ఎలాంటి విధానాన్ని అవలంబించాలో సమగ్రమైన నివేదికను రూపొందించాలని ఆ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి నదీమ్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఎర్రబెల్లి దయాకర్ రావు, విఠల్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments